గడ్డు కాలం ముగిసింది.. గాడిన పడుతున్నాము

– విస్తారా సిఇఒ వెల్లడి
న్యూఢిల్లీ: ఇటీవల పైలట్ల నుంచి తీవ్ర ఆందోళనను ఎదుర్కొన్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు తిరిగి పుంజు కుంటున్నట్లు ప్రకటించింది. గత వారం చోటు చేసుకున్న సర్వీసుల రద్దు, ఆలస్యంపై విస్తారా ఎయిర్‌లైన్స్‌ సిఇఒ వినోద్‌ కన్నన్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు తొలగి పోయాయని సిబ్బందితో నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో పేర్కొన్నారు. కార్యకలాపాలు కూడా గాడిన పడ్డాయని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కాంట్రాక్టుతో వేతనాలు తగ్గుతాయని విస్తారా పైలట్లు అసంతృప్తితో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనారోగ్యం సాకుతో వారంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టారు. దీంతో మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 2 మధ్య సగానికి పైగా సర్వీసులు రద్దయ్యాయి. అర్ధంతరంగా విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనిపై విస్తారా యాజమాన్యాన్ని రెగ్యూలేటర్‌ డిజిసిఎ తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ పైలట్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి రాజీకి వచ్చిందని సమాచారం. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటంతో వివాదం సద్దుమణిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. తాము ప్రణాళికలను మరింత పటిష్ఠంగా రూపొందించి ఉండాల్సిందని కన్నన్‌ పేర్కొన్నారు. ఈ అనుభవం తమకు ఒక గొప్ప గుణపాఠమని తెలిపారు. ఆర్థిక సంవత్సరం ఆరంభం చాలా సవాళ్లతో ప్రారంభమైందని పేర్కొన్నారు. తమ ప్రయాణికుల ఇబ్బందుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించ గలిగామన్నారు. విమానాల రద్దు, ఆలస్యం వల్ల ప్రభావితమైన ప్యాసింజర్లకు తగిన పరిహారం చెల్లించామన్నారు.

Spread the love