హుష్‌..మాయం!

– ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో మరికొన్ని ప్రస్తావనలకు మంగళం
– బాబ్రీ కూల్చివేత, గుజరాత్‌లో ముస్లింల ఊచకోత తొలగింపు
– మణిపూర్‌, జమ్మూకాశ్మీర్‌, భారత్‌-పాక్‌ వివాదం ఊసే లేదు
న్యూఢిల్లీ: 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుండి మరికొన్ని ప్రస్తావనలు అదృశ్యమయ్యాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ హింసలో ముస్లింల ఊచకోత, మణిపూర్‌ ఘర్షణలు, జమ్మూకాశ్మీర్‌పై భారత్‌ వైఖరి…వంటి అంశాల ప్రస్తావన ఇకపై మనకు ఈ పుస్తకాలలో కన్పించదు. ఎన్సీఈఆర్టీ చేసిన ఈ మార్పులు ఆన్‌లైన్‌ పాఠ్యపుస్తకాలలో కన్పించనప్పటికీ పాఠ్య పుస్తకాలను త్వరలోనే సవరిస్తామని అధికారులు తెలిపారు. ‘రాజకీయాలలో చోటుచేసుకున్న తాజా మార్పులను దృష్టిలో పెట్టుకొని అయోధ్యకు సంబంధించిన అంశాన్ని కూలంకషంగా సమీక్షించడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా కొన్ని మార్పులు చేసింది. వాటికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది’ అని ఎన్సీఈఆర్టీ వివరణ ఇచ్చింది.
గుజరాత్‌ అల్లర్ల ఊసే లేదు
11వ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకంలోని ఐదవ ఛాప్టర్‌లో (ప్రజాస్వామిక రాజకీయాలు-1) ఉన్న గుజరాత్‌ అల్లర్ల అంశాన్ని తొలగించారు. 86వ పేజీలో ఇలా ఉంది…’ఈ పేజీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సంబంధించిన ప్రస్తావనను మీరు గమనించారా? ఈ ప్రస్తావనలు మానవ హక్కులపై పెరుగుతున్న అవగాహనను, మానవ గౌరవానికి ఎదువుతున్న ఇబ్బందుల ను ప్రతిబింబిస్తున్నాయి. వివిధ రంగాలలో మానవ హక్కుల ఉల్లంఘ నలకు సంబంధించిన అనేక కేసులు. ..ఉదాహరణకు గుజరాత్‌ అల్లర్లనే తీసుకోండి. వీటిని దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకుపోవడం జరుగు తోంది’ అని ఉంది. దీనిని ఇలా మార్చారు. ‘వివిధ రంగాలలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి న అనేక కేసులను దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకుపోవడం జరుగుతోంది’ అని మార్చేశారు. అంటే గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావనను తొలగించారు.
ముస్లింల ఊచకోత ప్రస్తావనే లేదు
11వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్య పుస్తకంలోని 112వ పేజీలో ‘రాజకీయ సిద్ధాంతం’ అనే ఛాప్టర్‌లోనూ, ‘లౌకికతత్వం’ అనే ఎనిమిదో ఛాప్టర్‌లోనూ కొన్ని ప్రస్తావనలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ప్రస్తుతం ఆ ఛాప్టర్‌లో ఇలా ఉంది. ‘2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్ల తర్వాత అనేకమంది ముస్లింలు సహా వెయ్యి మందికి పైగా ప్రజలను ఊచకోత కోశారు’. ఇకపై దీనిని ఇలా మారుస్తారు. ‘2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్ల తర్వాత వెయ్యి మందికి పైగా ప్రజలను చంపేశారు’ ఇలా మార్చడా నికి ఎన్సీఈఆర్టీ ఏమని కారణం చెప్పిందంటే… ఏ అల్లర్లలో అయినా మతాలకు అతీతంగా ప్రజలు ఇబ్బం దులు పడతారట. అది కేవలం ఏదో ఒక మతానికే పరిమితం కాదట.
బాబ్రీ కూల్చివేత కూడా…
12వ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకంలో ‘భారత రాజకీయాల్లో తాజా పరిణామాలు’ పేరిట ఎనిమిదో ఛాప్టర్‌ ఉంది. అందులోని 136వ పేజీలో ఇలా ఉంది. ‘రాజకీయ సమీకరణకు రామజన్మభూమి ఉద్యమం, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతల వారసత్వం ఏమిటి?’. సవరించిన పాఠ్యపుస్తకంలో ఈ వాక్యం ఇలా ఉంది. ‘రామ జన్మభూమి వారసత్వం ఏమిటి?’.
ఇదే ఛాప్టర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తొలగించారు. 139 పేజీలో ఇలా ఉంది. ‘1992లో అయోధ్యలోని వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు అంటారు) కూల్చివేతలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతం దేశ రాజకీయాలలో అనేక మార్పులు తెచ్చింది. భారతీయ జాతీయతావాదం, లౌకికతత్వ స్వభావంపై విస్తృత చర్చ జరిగింది. బీజేపీ, హిందూత్వ రాజకీయాల ఉద్ధానానికి, ఈ పరిణామాలకు సంబంధం ఉంది’. అయితే దీనిని ఇలా మార్చేశారు. ‘అయోధ్యలోని రామజన్మభూమి దేవాలయంపై శతాబ్దాలుగా నెలకొన్న చట్టపరమైన, రాజకీయ వివాదం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం మొదలు పెట్టింది. అది అనేక రాజకీయ మార్పులకు కారణమైంది. రామజన్మభూమి మందిర ఉద్యమం కేంద్ర బిందువుగా మారింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై చర్చలు, సంభాషణలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు (2019 నవంబర్‌ 9న) నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ మార్పులు దారితీశాయి’ అని మార్చారు.
మాయమైన ‘మణిపూర్‌’
12వ తరగతి పుస్తకంలోని మొదటి ఛాప్టర్‌లో మణిపూర్‌ ప్రస్తావన ఉంది. అందులో ఏముందంటే…మణిపూర్‌లో ప్రజలు ఎన్నుకున్న శాసనసభను సంప్రదించకుండానే 1949 సెప్టెంబరులో విలీన ఒప్పందంపై సంతకం చేసేలా మహారాజుపై ఒత్తిడి తేవడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఈ చర్య మణిపూర్‌లో ఆగ్రహానికి, తిరుగుబాటుకు కారణమైంది. ఆ పరిణామాలు ఇప్పటికీ కన్పిస్తూనే ఉన్నాయి….సవరించిన పాఠ్యాంశంలో మణిపూర్‌ ప్రస్తావనను తొలగించారు. దానిలో ఇలా ఉంది. ‘1949 సెప్టెంబరులో విలీన ఒప్పందంపై సంతకం చేసేలా మహారాజును ఒప్పించడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది’.
భారత్‌, పాక్‌ వివాదాన్ని సైతం…
119వ పేజీలోని ఛాప్టర్‌ 7లో ‘ప్రజల ఆకాంక్షలు’ పేరిట ఉన్న పాఠ్యాంశం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించింది. అందులో ఇలా ఉంది. ‘ఈ ప్రాంతం చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉన్నదని భారత్‌ వాదిస్తోంది. పాకిస్తాన్‌ ఈ ప్రాంతాన్ని ఆజాద్‌ పాకిస్తాన్‌ అని పిలుస్తోంది’. మార్చేసిన పాఠ్యాశంలో ఏమని ఉందంటే…అయితే అది పాకిస్తాన్‌ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగం పాకిస్తాన్‌ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌ (పీఓజేకే). జమ్మూకాశ్మీర్‌ కు సంబంధించి భారత ప్రభుత్వ తాజా వైఖరికి అనుగుణంగా ఈ మార్పును తీసుకొచ్చామని ఎన్సీఈఆర్టీ తెలిపింది.

వామపక్షాలకు కొత్త భాష్యం
వామపక్షాలకు ఎన్సీఈఆర్టీ కొత్త నిర్వచనం ఇచ్చింది. 12వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఛాప్టర్‌ 3లో ప్రస్తుతం ఏముందంటే ‘వామపక్షాలు పేదలు, అట్టడుగు వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్త్తాయి. ఈ వర్గాల కోసం తీసుకునే ప్రభుత్వ విధానాలను సమర్థిస్తాయి’. దీనిని ఎలా మార్చేసారో చూడండి. ‘ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణకు మద్దతు ఇచ్చే వారిని గురించి వామపక్షాలు మాట్లాడతాయి. స్వేచ్ఛాయుత పోటీపై ప్రభుత్వ నియంత్రణలను ఇష్టపడతాయి’. ఇక ‘ప్రజాస్వామిక రాజకీయాలు’ పేరిట 10వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో ప్రస్తుతం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, ఎన్సీపీ ప్రస్తావనలను 4వ చాప్టర్‌ నుంచి తొలగించారు. అమ్‌ఆద్మీ పార్టీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలను చేర్చారు. ఈ మార్పులకు ఎన్సీఈఆర్టీ చెప్పిన కారణమేమిటో తెలుసా? సీపీఐ, ఎన్సీపీలు జాతీయ పార్టీలు కావట. అందుకే ఆయా పార్టీల ప్రస్తావనలను తొలగించారట. వాటి స్థానంలో అమ్‌ఆద్మీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలను చేర్చారట. ఈ రెండు పార్టీలనూ 2023లో ఎన్నికల కమిషన్‌ జాతీయ పార్టీలుగా ప్రకటించిందని ఎన్సీఈఆర్టీ గుర్తు చేసింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్య పుస్తకంలోని ఛాప్టర్‌ 7లో ఓ పేరాను సవరించి, అందులో ఆర్టికల్‌ 370 రద్దును ప్రస్తావించింది. గతంలో ఏముందంటే…అనేక రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని జమ్మూకాశ్మీర్‌ వంటి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి…ఈ పేరాను సవరించి ఇలా మార్చారు….అయితే జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టులో రద్దు చేయడం జరిగింది.

Spread the love