Friday, July 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅన్నదాతకు ఆదిలోనే ఆటంకం..!

అన్నదాతకు ఆదిలోనే ఆటంకం..!

- Advertisement -

మొలకెత్తని విత్తనాలు
రెండు సార్లు విత్తిన రైతులు
ఎకరానికి రూ.5వేల వరకు నష్టపోయినట్టు అంచనా
సాగు సమయం ఉంది.. తొందర పడొద్దంటున్న అధికారులు

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఈ యేడాది ఖరీఫ్‌ సాగు ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావడం ఒక కారణమైతే ప్రభుత్వ ఆమోదం పొందిన ఓ కంపెనీకి చెందిన విత్తనాలు మొలకెత్తక రైతులు లబోదిబోమంటున్నారు. పలు చోట్ల వర్షాలు సరిగా పడక రెండు సార్లు విత్తనాలు విత్తుకుని నష్టాలపాలయ్యారు. ఎకరానికి సుమారు రూ.5వేల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధిక శాతం వర్షాధారిత పంటలు సాగవుతాయి. అనేక మండలాల్లో 50మి.మీల వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయి రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడోసారి విత్తనాలు వేసుకునే పరిస్థితులు ఉన్నా, ఇప్పటికీ రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మంది రైతులు 17లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా పత్తి 10.44లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. సోయా 2.10లక్షలు, కంది 1.10లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా వరి, కూరగాయల సాగు చేపడుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని లక్ష్మిపూర్‌ గ్రామంలో విత్తనాలు మొలకెత్త లేదు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన తేజస్విని కంపెనీకి చెందిన సోయాబీన్‌ విత్తనాలు విత్తుకున్నారు. అవసరమైన మేరకు వర్షం కురిసినప్పటికీ అవి మొలకెత్తలేదు. అక్కడక్కడ కొన్ని మాత్రమే మొలకెత్తాయి. దాంతో రైతులు మంగళవారం ఆదిలాబాద్‌ కలెక్టర్‌ను కలిశారు. ఈ విషయమై కలెక్టర్‌ వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం రైతులకు వారు కోరిన విత్తనాలను ఉచితంగా ఇచ్చారని తెలిసింది. నష్టపరిహారం కూడా ఇస్తామని, సదరు డీలర్లను సంప్రదిం చాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఆదిలాబాద్‌ జిల్లా తాంసి, భీంపూర్‌ మండలాల్లో అత్యధిక శాతం మంది రైతులు రెండు సార్లు విత్తనాలు విత్తారు.

రూ.5 నుంచి రూ.6వేల వరకు నష్టం
సోయా, పత్తి పంటలు సాగు చేయడానికి గడువు ఉన్నప్పటికీ రైతులు ముందస్తుగా విత్తనాలు వేసుకున్నారు. సోయా విత్తనాలు వేసిన రైతుకు ఎకరానికి సుమారు రూ.5వేలు, పత్తి రైతుకు రూ.6వేల వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సోయా సాగు చేయడానికి ఈ నెల మొదటి వారం వరకు సమయం ఉందని పేర్కొంటున్నారు. అదేవిధంగా, పత్తి విత్తనాలు వేయడానికి మరో పక్షం రోజులు గడువు ఉందని చెబుతున్నారు. రుతుపవనాలు ఆలస్యం అయినప్పటికీ జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయని, త్వరలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

వర్షాలు లేక నష్టం జరిగింది రవీందర్‌సింగ్‌, డీఏఓ ఆదిలాబాద్‌
వర్షాలు పడతాయని ముందస్తుగా విత్తనాలు వేసుకున్న రైతులు నష్టపోయి ఉండొచ్చు. జైనథ్‌ మండలం లక్ష్మిపూర్‌ గ్రామంలో కలెక్టర్‌ సూచన మేరకు మొలకలురాని రైతులకు తిరిగి వారు కోరుకున్న విత్తనాలు ఇప్పించాం. నేల తడిబారక ముందు విత్తనాలు వేసిన వారికి నష్టపరిహారం ఇవ్వలేం. వ్యవసాయ అధికారులు నేల తడిబారిన తర్వాతే విత్తనాలు వేయాలని చెబుతారు. ముందస్తుగా వేసుకుంటే ఏమీ చేయలేం.

పొలం దున్నుతూనే గుండెపోటుతో రైతు మృతి
పొలం దున్నుతూనే ఓ యువ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని చింతలకుంట గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంట గ్రామానికి చెందిన రైతు మాల వీరేష్‌(30) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. గురువారం తన వ్యవసాయ పొలంలో దున్నుతున్న సమయంలోనే గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -