అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు!
కోడ్ భాష ద్వారా సరఫరా
జార్ఖండ్ కేంద్రంగా భారీ నెట్‌వర్క్
ప్రధాన నిందితుడి అరెస్ట్
నవతెలంగాణ- సిటీబ్యూరో
పోస్టల్, కొరియర్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా నిషేధిత గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్-న్యూ) బయటపెట్టారు. జార్ఖండ్ కేంద్రంగా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సాగిస్తున్న సూత్రధారుడిని అరెస్టు చేసింది. బంజారాహిల్స్‌లోని సీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సత్యం మిశ్రా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్మీడియట్ చదువును మధ్యలోనే ఆపేశాడు. జీవనోపాధి కోసం మొదట్లో పెయింటర్‌గా, ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మారాడు. లారీల్లో వివిధ రాష్ట్రాలకు సరుకులను చేరవేసే క్రమంలో అతడు తరచూ ముంబయికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో 2018లో గంజాయికి బానిసైన సత్యం మిశ్రాకు డ్రగ్స్ వాడేవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తన అన్న శుభమ్ మిశ్రాతో కలిసి దందా ప్రారంభించాడు. బంధువు సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి అక్రమ గంజాయి వ్యాపారంలోకి దిగాడు.
పోస్టల్, ప్రయివేటు కొరియర్ల ద్వారా డెలివరీ
జార్ఖండ్‌లోని తమ స్వగ్రామంలో గంజాయిని పండించడంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించిద హైదరాబాద్, ముంబయి, చెన్నయ్, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లో కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్, ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీసులుద్వారా పార్సిళ్లను పంపేవారు. స్పీడ్ పోస్ట్ బుకింగ్ సమయంలో పార్సిల్ లో మెడిసిన్ ఉందంటూ పోస్టల్ అధికారులకు చెప్పేవారు. సత్యం మిశ్రా, అతని సోదరుడు శుభమ్ మిశ్రా గంజాయి పార్సల్స్ సిద్ధం చేయగా, రాహుల్ ఝా వాటిని పోస్ట్ ఆఫీసుల్లో బుక్ చేసే బాధ్యతలు చూసేవాడు. అవసరమైన సమయాల్లో సత్యం, శుభమ్ కూడా బుకింగ్ చేసేవారు. వాట్సప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు స్వీకరించి, డెలివరీ వివరాలు, చెల్లింపులను సమన్వయం చేసుకునేవారు.
డాదికి రూ. నాలుగు కోట్ల అక్రమ సంపాదన!
ఈ అంతర్రాష్ట్ర ముఠా దేశవ్యాప్తంగా రోజుకు సగటున 80 నుంచి 100 ఆర్డర్లను పూర్తి చేసేది. ఇందులో రోజుకు 8 నుంచి 10 పార్సిళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపేవారని దర్యాప్తులో వెల్లడైంది. ప్రతి పార్సిల్‌లో సాధారణంగా 50 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు గంజాయిని ప్యాక్ చేసి, కస్టమర్ల నుంచి ఆర్డర్ పరిమాణాన్ని బట్టి రూ. 1,500 నుంచి రూ. 8,000 వరకు వసూలు చేసేవారు. ఈ పద్ధతిలో రోజుకు సుమారు రూ. ఒక లక్షకు పైగా, నెలకు దాదాపు రూ. 30 నుంచి 35 లక్షలు ఆర్జిస్తూ, ఏడాదికి సుమారు రూ. 4 నుంచి 5 కోట్ల రూపాయల భారీ టర్నోవర్‌తో ఈ అక్రమ దందా సాగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. తపాలా సేవల ద్వారా పంపడమే కాకుండా, ముంబయి నగరంలో కూడా వీరు భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ముంబయిలో వీరికి 1000 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్టు గుర్తించారు. నిందితుడు శుభమ్ మిశ్రా స్వయంగా జార్ఖండ్ నుంచి రైళ్ల ద్వారా భారీ మొత్తంలో గంజాయిని ముంబయికి తరలించేవాడు. అక్కడ సచిన్ మిశ్రా, సంతోష్ పండిత్ అనే సహచరుల ఇండ్లలో ఈ గంజాయిని రహస్యంగా నిల్వ చేసేవారు. జార్ఖండ్‌లోనే ఉంటూ వాట్సప్ ద్వారా ముంబయిలోని ఖాతాదారులను సత్యం, శుభమ్ పర్యవేక్షించేవారు.
పోలీసుల కండ్లు గప్పేందుకు వీరు ‘మ్యాంగో, స్టిక్ , ఫ్లవర్ ‘ వంటి కోడ్ పదాలను పంపించేవారు. వివిధ యూపీఐ ఖాతాల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకుని ఆ వివరాలను ముంబయిలోని తమ సహచరులకు పంపేవారు. వారు ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, పోలీసులకు ఎలాంటి అనుమానమూ రాకుండా లోకల్ ట్రైన్లు, ఆటో రిక్షాల వంటి ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా కస్టమర్లకు చేరవేసేవారు. ఇదే తరహాలో ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఒకరికి ఈ ముఠా గంజాయి పార్సల్ పంపింది. ఈ సమాచారం అందుకున్న హెచ్-న్యూ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ సరఫరా లింక్ బయటపడింది. అలాగే ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీస్ నుంచి మరో కస్టమర్‌కు కూడా గంజాయి పార్సల్ పంపారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని తెలియగానే నిందితులు పోలీసులకు దొరక్కుండా తమ గుర్తింపును మార్చుకుని పరారయ్యే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలపై గుడిమల్కాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో గంజాయిని బుక్ చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన సుశాంత్ వ్యాస్, లడ్డును అరెస్టు చేసి, రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును నిందితులు వారి పాత్రల ఆధారంగా పంచుకునేవారు. ఆ డబ్బుతో భారీగా బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేశారు. సత్యం మిశ్రాను రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని సీపీ తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా నెట్ వర్క్ ఛేదనలో 22 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెచ్-న్యూ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మార్గదర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్లు బాలస్వామి, నాగార్జున, ఎస్‌ఐ మనోజ్ కుమార్, ఏఎస్‌ఐలు చక్రపాణి, సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ ఉమాశంకర్, కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించారు. వారందరినీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.



