కొత్తమోనూ ప్రకారం బడ్జెట్‌ కేటాయించాలి

The budget should be allocated according to the new one– అల్పాహారం పథకం పనికి అదనపు వేతనమివ్వాలి
– పెంచిన వేతన డబ్బులను మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాల్లో వేయాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతన డబ్బులను వారి ఖాతాల్లో వేయాలనీ, కొత్తమెనూ ప్రకారం బడ్జెట్‌ కేటాయించడంతో పాటు అల్పాహారం పథకం పనికి అదనంగా వేతనమివ్వాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఇదే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, ఉపాధ్యక్షులు వై.స్వప్న వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. గుడ్లకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. గ్యాస్‌ను సబ్సిడీపై అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొద్దని విన్నవించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు, కాటన్‌ శారీలివ్వాలనీ, ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు అదనంగా పెంచిన రూ.2 వేలు ఇప్పటి దాకా వారి ఖాతాల్లో పడలేదన్నారు. ఇవే డిమాండ్లపై సెప్టెంబర్‌ 28న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది జూలై నుంచే పెరిగిన వేతనం చెల్లిస్తామనీ, పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తామని మంత్రి స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంట చేసి పెట్టారనీ, ఇప్పుడు వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడున్న మెనూకే కేటాయించిన బడ్జెట్‌ సరిపోవడం లేదనీ, కొత్తమెనూ పెట్టడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దానికి అదనపు బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారని తెలిపారు.

Spread the love