నెస్లే నివేదికపై విచారణకు ఆదేశించిన కేంద్రం

నవతెలంగాణ – న్యూఢిల్లీ: నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి లేఖ రాసినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిన్నారుల ఉత్పత్తుల్లో అత్యధిక చక్కెరలు వారి ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సిసిపిఎ) చీఫ్‌ నిధి ఖారే తెలిపారు. దేశ ప్రజల ముఖ్యంగా చిన్నారుల, శిశువుల ఆరోగ్యం, శ్రేయస్సు అత్యంత ముఖ్యమని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. నివేదికపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫస్సీని ఆదేశించినట్లు తెలిపారు. నెస్లేపై పబ్లిక్‌ ఐ నివేదికపై నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సిపిసిఆర్‌) కూడా ఫస్సీకి నోటీసులు జారీ చేసింది. ఆసియా,  ఆఫ్రికా,  లాటిన్ అమెరికా దేశాలలో నెస్లే విక్రయించే చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటున్నట్లు  స్విస్ ఎన్‌జిఒ పబ్లిక్ ఐ తన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Spread the love