Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంది 'షాబాద్‌ కిల్లర్‌' మైండ్‌సెట్‌

సీఎంది ‘షాబాద్‌ కిల్లర్‌’ మైండ్‌సెట్‌

- Advertisement -

రాజకీయాలు పక్కనబెట్టండి.. ‘కన్నెపల్లి’ ఆన్‌ చేయండి
డెడ్‌ స్టోరేజీలో ప్రాజెక్టులు
తాగునీటికీ గడ్డు పరిస్థితులు
ఉత్తర తెలంగాణ 
ఎడారిగా మారే ప్రమాదం
కరీంనగర్‌ ఎల్‌ఎమ్‌డిని సందర్శించిన : బీఆర్‌ఎస్‌
 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

​’మాపై కోపంతో సీఎం రేవంత్‌రెడ్డి నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను వేధిస్తున్నారు. ఆయన వైఖరి ‘షాబాద్‌ కిల్లర్‌’ మైండ్‌ సెట్‌లా ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ నేరపూరిత వైఖరి వల్ల ఇప్పటికే ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీలోకి వెళ్లి తాగునీటికీ గడ్డు పరిస్థితులను తెచ్చిపెట్టాయి.. ఉత్తర తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది..’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన ఎల్‌ఎండీని సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్‌ సహా ఎల్లంపల్లి, మధ్య, దిగువమానేరు, అనంతగిరి, కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌ వంటి కీలక జలాశయాలన్నీ నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని తెలిపారు. ‘ప్రస్తుతం ఎల్‌ఎమ్‌డీలో 5.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టుపైనే 8 నియోజకవర్గాల సాగుభూమి ఆధారపడి ఉంది. వారం రోజుల్లో కరీంనగరానికి తాగునీరూ కష్టమే’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లిలోనూ 4 నుంచి 5 టీఎంసీల నీరు మాత్రమే మిగిలిందని, అక్కడి నుంచి నీటిని తోడకపోతే హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి తప్పదని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రోజుకు 15 వేల ట్యాంకర్లు బుక్‌ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు.

‘ఎల్‌ నినో ప్రభావంతో వర్షాలు పడవని నిపుణులు చెబితే వారిని బెల్టుతో కొట్టాలంటారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ దగ్గర నీళ్లు ఎత్తిపోయొచ్చని విశ్రాంత ఇంజినీర్లు చెబితే వారిని కొట్టాలంటారు. మీడియా ప్రశ్నిస్తే .. బీఆర్‌ఎస్‌ వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయి అని నీచ భాష మాట్లాడుతున్నారు’ అని సీఎం రేవంత్‌ రెడ్డిని విమర్శించారు. ఒకవేళ రక్తం చల్లితేనే నీళ్లు ఇస్తానంటే.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలమంతా రక్తదానం చేస్తామన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఎవరి మీదనో కోపం ఇంకెవరి మీదనో చూపించే ‘షాబాద్‌ కిల్లర్‌’ మైండ్‌సెట్‌లా కనిపిస్తోందని ఆరోపించారు.​

పంపులు ఆన్‌ చేయండి
కన్నెపల్లి దగ్గర గోదావరి 97 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోందని, అక్కడ 90.5 మీటర్ల ప్రవాహం ఉన్నప్పుడే పంపులు ఆన్‌ చేయొచ్చని కేటీఆర్‌ సాంకేతిక వివరాలను వెల్లడించారు. 2024 జూన్‌లోనే ఇంజినీరింగ్‌ అధికారులు గ్రౌంటింగ్‌ పనులు పూర్తి చేశారని, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో ఒకేసారి పంపులు ఆన్‌ చేసే అవకాశం ఉందని చెప్పారు. జులై నుంచి అక్టోబర్‌ వరకు వంద రోజులపాటు వరద ప్రవాహం ఉంటుందని, రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసినా 350 టీఎంసీల నీటిని నింపుకోవచ్చని సూచించారు. ‘మాకు క్రెడిట్‌ వస్తుందని భయపడకండి. మీరు పంపులు ఆన్‌ చేసి నీళ్లిస్తే.. అది మా ఘనత అని మేము ఎక్కడా చెప్పుకోము.. వెంటనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడికౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -