అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలి
కలెక్టర్, డీసీఎల్ ఆఫీసు ముందు సీఐటీయూ రిలే నిరాహార దీక్షలు
కార్మికులకు న్యాయం చేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం:సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మల్లేశం
నవతెలంగాణ-సంగారెడ్డి
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న మైక్రో బాక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ పక్కన ఐలమ్మ విగ్రహం వద్ద కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామ పరిధిలోని మైక్రో బాక్స్ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ.. పరిశ్రమలో 13 మంది పర్మినెంట్ కార్మికులు 26 సంవత్సరాల నుంచి పని చేస్తుంటే పరిశ్రమలో జరిగిన చిన్న ఘటనతో యాజమాన్యం 13 మందిని అక్రమంగా తొలగించడం అన్యాయమన్నారు. 8 నెలల నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. కార్మికులకు వేతనాలు చెల్లించకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై లేబర్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ పర్మినెంట్ అయిన కార్మికుల పనిని కాంట్రాక్ట్ కార్మికులతో చేయిస్తోందన్నారు. పరిశ్రమలో పని చేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయడం లేదన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న మైక్రో బాక్స్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి, లేబర్ అధికారులను, కలెక్టర్‌ను కలిసినట్టు తెలిపారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీలోకి తీసుకునేలా లేబర్ అధికారులు, జిల్లా కలెక్టర్.. పరిశ్రమపై ఒత్తిడి తెచ్చి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని, లేకుంటే కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జి.సాయిలు, నాయకులు ప్రవీణ్, శ్రీధర్, మురళి, భీమ్ రెడ్డి, శివ, ప్రేమ్, వెంకటేశం, సాయన్న, శ్రీనివాస్, మైక్రో బాక్స్ కార్మికులు పాల్గొన్నారు.
మైక్రో బాక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



