ప్లేట్లెట్స్ పడిపోవడం, కిడ్నీ, మూత్ర ఇన్ఫెక్షన్ లక్షణాలు
బాన్సువాడ
ప్రభుత్వాస్పత్రిలో ఘటన
నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలింపు
అక్కడి నుంచి ముగ్గురు
నిమ్స్‌కు రిఫర్
విచారణ చేపడుతున్నాం : బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్
నవతెలంగాణ-బాన్సువాడ
సిజేరియన్ వికటించి.. ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ ఏరియాస్పత్రి పరిధిలోని మాతా శిశు ఆస్పత్రిలో ఈ నెల 10, 11 తేదీల్లో మొత్తం 10 మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించారు. అయితే వారిలో ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన హుమెరా ఫాతిమా, బాన్సువాడ పట్టణానికి చెందిన లక్ష్మిప్రియ, పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన సునీత, బాన్సువాడ మండలం కొత్తాబాది గ్రామానికి చెందిన రుక్సానా, గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన జ్యోతి ఆరోగ్యం సోమవారం ఉదయం నుంచి విషమించింది. ఆపరేషన్ అనంతరం వారిలో ప్లేట్లెట్స్ అసాధారణంగా పడిపోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో సమస్యలు తలెత్తడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్ వెంటనే స్పందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు బాలింతలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతుండగా.. ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి మరింత విషమించడంతో నిజామాబాద్ వైద్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి మెరుగుపడింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన..
ఒకేసారి ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు అనుభవజ్ఞురాలే అయినా ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సిజేరియన్ సమయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం లేదా మత్తు డాక్టర్ అధిక మత్తు ఇవ్వడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని నిజామాబాద్ వైద్యులు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఐదుగురిలో ముగ్గురిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు రిఫర్ చేయడం పట్ల వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
విచారణ జరుపుతున్నాం: సూపరింటెండెంట్
ఈ విషయంపై బాన్సువాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం. ప్రస్తుతం తాను నిజామాబాద్‌లో ఉండి పర్యవేక్షిస్తున్నా’నని తెలిపారు.
సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



