భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ప్రకృతి వనరులు, భూగర్భ జలాలను పరిరక్షించు కోవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ హన్మంతు కే జెండగే అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించబడిన భూగర్భజలాల వినియోగం, నియంత్రణ, నిర్వహణపై పారిశ్రామిక, వాణిజ్య వేత్తల అవగాహన కార్యక్రమంలో అయన ముఖ్య అతిథిగా హాజరై భూగర్భ జలాల ఆవశ్యకతను గురించి మాట్లాడారు. వాల్టా చట్టం పరిధులు భూగర్భ జలాల వినియోగానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కనుక ప్రభుత్వ విధి విధానాలను అనుసరిస్తూ ఎంత మేరకు భూగర్భ జలాలను వినియోగించుకున్నారో అంత పరిమాణంలో వర్షపు నీటిని కృత్రిమ పద్ధతిలో సాంకేతిక విధానం రీచార్జ్ చేసుకోవాలని సూచించారు.  పరిశ్రమ కానీ వాణిజ్య సంస్థ కానీ మనుగడ సాధించాలంటే నీరు అవసరం చాలా కనుక ప్రతి పరిశ్రమ విధిగా అనుమతి  పొంది, దానికి సంబంధించిన విధి విధానాలను పాటించటం ద్వారా భవిష్యత్ లో నీటి ఎద్దటిని తట్టుకొని పరిశ్రమలను నిరంతరాయంగా నడుపుకోవచ్చునని అన్నార. గడిచిన కొన్ని సంత్సరాలు మంచి వర్షాలు కురియడం వలన భువనగిరి జిల్లాలో లభ్యత సంతృప్తి కరంగా ఉన్నదని చెప్పారు. ఈ సంత్సరం ఇప్పటికే -4% వర్షాపాతం లోటుగా కురియడం వలన చెరువులు కుంటల్లో నీటి నిల్వలు తగ్గిపోయి భూగర్భ జలాల నిల్వలు కూడా తగ్గిపోతున్నాయని తెలిపారు. మున్సిపాలిటీ ప్రాంతాల్లో ప్రతి బిల్డింగ్ పర్మిషన్ తో పాటుగా రీచార్జ్ కట్టడములను తప్పనిసరి చేయాలని,  తద్వారా భూగర్భ జలాల నిల్వలు పెంపొందించుకోవచ్చునని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ఈ సంత్సరం వర్షాభావ పరిస్థితుల వలన భూగర్భజలాల మట్టం గత ఏడాదితో పోలిస్తే సరాసరి 2.38 మీటర్ల నీటి మట్టం క్రిందకు పడిపోయిందని తెలిపారు.జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  జి వీరారెడ్డి మాట్లాడుతూ. మున్సిపాలిటీ పరిధిలో బోరు బావి త్రవ్వుకొనుటకు సంబంధిత అధికారి నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలని, రీచార్జ్ కట్టడాలను తప్పనిసరి చేస్తూ రీచార్జ్ కట్టడాలను నిర్మించుకున్న తరువాత వసూలు చేసిన రుసుములు తిరిగి గృహ యజమానికి చెల్లించాలని సూచించారు. దీని వలన వర్షాకాలంలో వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా రీచార్జ్ చేయడం ద్వారా రాబోవు రోజుల్లో భూగర్భ జిల్లాల నిల్వలు పెంచుకోవచ్చునని సూచించారు. త్రవ్వుకున్న బోరు బావిని కూడా మున్సిపాలిటీ పరిధిగల టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద విధిగా ఫారం-2 లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి బోరు బావి ద్వారా ఎంత మేరకు భూగర్భజలాలు తోడుతున్నారో లెక్కలు కట్టి భూగర్భ జలాల నిల్వలు తెలుసుకోవచ్చని చెప్పారు. జ్యోతి కుమార్,  డిప్యూటి డైరెక్టర్ భూగర్భజలశాఖ జిల్లాలోని భూగర్భజలాల లభ్యత స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో  రాజేశ్వర్ రెడ్డి జనరల్ మేనేజర్,  ఇండస్ట్రీస్ శాఖ, స్వాతిశ్రీ, హైడ్రోజియాలజిస్ట్, టి మ్యాథ్యూస్, అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్, సబితా బేగం, పిసిబి అధికారి, స్వప్న టిఎస్ఐఐసి అధికారి మున్సిపల్ కమీషనర్ మరియు హింద్ వేర్, బాంబినో, జియోఫాస్ట్, ఏ జి ఐ గ్లాస్ ఫ్యాక్టరీ, వల్లభ, హజెలో తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love