
నవతెలంగాణ – భువనగిరి రూరల్
బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాలులో జూన్, సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసిక జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ గత డిసెంబర్ వరకు రూ.1421.26 కోట్లు వ్యవసాయ పంట ఋణాలుగా అందచేయడం జరిగిందని, దీనిలోనే వ్యవసాయ దీర్ఘకాలిక ఋణాలుగా రూ. 633.08 కోట్లతో మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 2054.34 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఋణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సూక్ష్మ ఋణాల క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు గాను రూ. 303.43 కోట్లు ఇవ్వడం జరిగిరదని, విద్యా ఋణాలుగా రూ.10.04 కోట్లు, గృహ ఋణాలుగా రూ.36.87 కోట్లు అందించడం జరిగిందని, అంతే కాకుండా ప్రాధాన్యతా రంగాలకు రూ.34.38 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో ఋణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. జిల్లాలో SERP 12747 మహిళా సంఘాలకు రూ.495.20 కోట్ల ఋణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, దీనిలో ఇప్పటి వరకు 12747 సంఘాలకు గాను 495.20 కోట్లు అందించి, 84.48 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, మెప్మా లోని 580 స్వయం సహాయక సంఘాలకు రూ.60.11 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని, అలాగే అర్హత ఉన్న సంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్ లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు. అలాగే వీధి వ్యాపారులకు అందించే రూ.20 వేల రూపాయల ఋణానికి సంబంధించి జిల్లాలో వీధి వ్యాపారులకు రూ. 7.30 కోట్ల రుణాలు మంజూరు చేయటం జరిగిందని, వీధి వ్యాపారులకు రెండో విడుత 20 వేలు సకాలంలో చెల్లించిన వారికి మూడో విడత రూ.50 వేలు సత్వరమే అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు. పాడి, మత్స్య పరిశ్రమలకు సంబంధించి లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ ఋణాలు సకాలంలో ఇవ్వాలని తెలిపారు. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు నూరు శాతం ప్రజలకు డిజిటల్ సేవలు అందించేలా కృషి చేయాలని, దీనికి బ్యాంకులు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. నాబార్డు ద్వారా రాబోయే 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టరు విడుదల చేశారు. జిల్లాలో రూ.4513.06 కోట్ల ఋణ లక్ష్యంగా నాబార్డు నిర్ణయించింది. దీనిలో వ్యవసాయరంగానికి రూ.2784.44 కోట్లు, సూక్ష్య ఋణ ప్రణాళికకు రూ.762.28 కోట్లు, విద్యారంగానికి రూ.17.55 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.70.20 కోట్లు, ఇతర మౌళిక వసతులకు రూ.11.76 కోట్లు, సోలార్ ఎనర్జీ సంబంధించి రూ.15.01 కోట్లు బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఈ నెల 26 నుండి మార్చ్ 2 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశానుసారం జిల్లాలో బ్యాంకర్ల సహకరంతో నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ అధికారి కె రామకృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, ఆర్బిఐ లీడ్ జిల్లా అధికారి తాన్య సంగ్మా , నాబార్డ్ డిడిఎం వినయ్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ఏస్సీ కార్పొరేషన్ ఈడి శ్యామ్ సుందర్, మెప్మా ప్ర్రాజేక్టు డైరెక్టరు రమేష్ బాబు, వివిధ బ్యాంకుల ప్రతినిథులు పాల్గొన్నారు.