రాజ్యాంగం రక్షతి రక్షిత:

భారత రాజ్యాంగం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆదిమ కాలంలో సామాజిక ఆచారాలుగా చెలామణీ అయిన అనేక సంప్రదాయాలను సాంఘీకభారత రాజ్యాంగం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆదిమ కాలంలో సామాజిక ఆచారాలుగా చెలామణీ అయిన అనేక సంప్రదాయాలను సాంఘీక దురాచారాలుగా ప్రకటించి భారతీయ సమాజాన్ని నాగరీక సమాజంగా భారత రాజ్యాంగం నడిపించింది. సరిగ్గా దీనికి విరుద్ధంగా తిరిగి ప్రాచీన సమాజం యొక్క ఆదిమ అవశేషాలను ఆధునిక సమాజంలో పునర్నిర్మించే పనిలో కొన్ని రాజకీయ పార్టీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో ఒక అనిశ్చిత వాతావరణానికి ఈ పార్టీలు కారణమవుతున్నాయి. మతాన్ని భారత రాజ్యాంగం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశంగానే పరిగణిస్తుంది. అంతవరకే దాని పాత్రను, పరిధిని పరిమితం చేస్తుంది. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా మతం దాని పరిధిని దాటి రాజకీయాలను ప్రభావితం చేయటం ప్రారంభించింది. మతతత్వ పార్టీల చర్యలు ముందుకు సాగకుండా భారత రాజ్యాంగం వాటికి ప్రధాన అడ్డంకిగా మారింది. దాంతో భారత రాజ్యాంగాన్నే మార్చేస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. కేవలం కొన్ని వర్గాల, మతాల ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రే ఇందులో దాగి ఉన్న బహిరంగ రహాస్యం. దేశంలో మతతత్వ పెత్తందారులే నాయకులుగా నడుస్తున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరులే దీనికి సాక్ష్యం.

(నేడు రాజ్యాంగ దినోత్సవం)
రాజ్యాంగం అంటే అక్షరాలతో కూడిన పేజీలతో నిర్మితమైన గ్రంథమే కాదు, కోట్లాది మంది భారతీయుల జీవితాలకు, హాక్కులకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తమకు తాముగా ప్రజలే రాసుకున్న హాక్కుల హమీ పత్రం. ఇది 12 శతాబ్దంలో ఎడ్వర్డ్‌ జాన్‌ చక్రవర్తి కాలంలో వచ్చిన ‘మాగ్నా కార్టా’తో పోల్చదగినదే కాదు, అంతకు మించి ఉన్నతమైనదిగా భావించాలి. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు, వారి జీవితాలకు భారత రాజ్యాంగం సంపూర్ణ భరోసాను ఇవ్వటంతో పాటు, వారి జీవితాలకు రక్షణ కవచంగా నిలబడుతుంది. రాజ్యాంగం ఆధారంగా తమను తాము పరిపాలించుకోడానికి ప్రజలు అనేక ప్రజాస్వామిక వ్యవస్ధలను రూపొందించుకున్నారు. ఆ వ్యవస్ధల్నే నిర్విర్యం చేస్తూ రాజ్యాంగాన్ని బలహీన పరిచే కుట్రలకు పాల్పడుతున్న కాలంలో నేడు మనమున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించటమే కాదు, హాక్కుల కోసం అడిగిన వారిని దేశద్రోహులుగా ముద్రలు వేస్తూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంక్షుభిత కాలంలో మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
సరిగ్గా ఇదే రోజు భారత రాజ్యాంగానికి ఆత్మలా భావించే ప్రవేశికలో తాము నిర్మించుకున్న రాజ్యాంగాన్ని తమకే సమర్పించుకుంటూ ఈ దేశ ప్రజలు ఇలా లిఖించుకున్నారు ‘భారత ప్రజలమైన మీము, భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమాధికారమున్న సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుకోవడానికి, దేశ పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్ధిక న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసాలు కలిగి ఉండటంలోను, ఆరాధించటంలోనూ స్వేచ్ఛను, హోదా అవకాశాలలో సమానత్వానికి, వ్యక్తిగత గౌరవం, ప్రజలందరి మధ్యనా ఐక్యత, సౌభ్రాతృత్వం, దేశ సమగ్రతల సాధనకై ఏకగ్రీవంగా తీర్మానించుకుని ఈ నవంబర్‌ 26వ తేదిన, ఇందు మూలంగా ఆమోదించుకుని, అన్వయించుకుని, ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.’ అని ప్రకటించారు. 1949 నవంబర్‌ 26వ తేదిన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. 2015 నుండి ఈ రోజును భారతీయు రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్‌ దినోత్సవ్‌ పేరుతో జరుపుకోవటం జరుగుతుంది.
రాజ్యాంగ నిర్మాణానికి తొలి అడుగులు పడింది ఇలా….
భారత రాజ్యాంగం 1947వ సంవత్సరంలో ఆమోదించినప్పటికీ దేశంలో రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు తొలి అడుగులు 1858లోనే పడ్డాయి. 1857లో సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన అంతమై బ్రిటీషు రాణి పాలన ప్రారంభమైంది. దీంతో భారత దేశంలో భారత ప్రభుత్వ చట్టాల రూపకల్పనకు దారులు పడ్డాయి. బ్రిటీషు రాణి పాలన ప్రారంభమైన తర్వాత ఏర్పడిన చట్టాలను కౌన్సిల్‌ చట్టాలు అంటారు. 1861లో వచ్చిన ఒక కౌన్సిల్‌ చట్టం ఆధారంగా భారతదేశ శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయలకు ప్రాధాన్యతను కల్పించారు. ఈ చట్టం ద్వారా బెనారస్‌ మహారాజు, పాటియాలా మహారాజు, దినకరరావు అనే ముగ్గురు సభ్యులు కౌన్సిల్‌లోకి అనధికార సభ్యులుగా నామినేట్‌ చేయబడ్డారు. 1892లో గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్‌ షా మెహాతా, సురేంద్రనాథ్‌ బెనర్జీ, రాస్‌బిహారీ ఘోష్‌ వంటి వారు కౌన్సిల్‌లోకి నామినేట్‌ చేయబడ్డారు. 1909 భారత్‌ కౌన్సిల్‌ చట్టం నుండి 1919 వరకూ జరిగిన అనేక సంస్కరణలు, చట్టాల ఆలంబనగా భారతదేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు 1917 ఆగస్టు 20వ తేదిన బ్రిటీషు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. నాటి నుండి భారత దేశ స్వాతంత్య్రంతో పాటు, రాజ్యాంగ రచనకు సంబంధించిన అంశాలపై జాతీయ నాయకులు తమ గళాలను మరింత బలంగా వినిపించటం ప్రారంభించారు. 1927లో భారత వ్యవహారాల కార్యదర్శి ‘లార్డ్‌ బిర్కెస్‌హెడ్‌’ 1927 నవంబర్‌లో బ్రిటీష్‌ ఎగువ సభలో మాట్లాడుతూ ‘అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా’ అని జాతీయ నాయకులకు సవాలు విసిరారు. ఈ సవాలుకి ఒక కారణం ఉంది, నిజానికి భారతదేశం ఏక శిలా సదృశ్యం కాదు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ఆచారాలు, భిన్న వ్యవహారాలు, విభిన్న సంస్కృతులకు సాముహిక ప్రతినిధి. కానీ రాజ్యాంగ నిర్మాణం ప్రారంభమైతే ఈ భిన్నత్వానికి రాజ్యాంగ రూపకల్పనలో చోటు లభిస్తుందా.. లేదా అన్న సంశయమే ఈ సవాలులోని అంతరార్ధం. ఈ సవాల్‌ను స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్‌ 1928 ఆగస్టు 10వ తేదిన రాజ్యాంగ రచనకు మోతిలాల్‌ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన ఒక ఉప సంఘాన్ని నియమించింది. దీనికి ముందుగా 1927 మే 17న బొంబేలో జరిగిన కాంగ్రెస్‌ అఖిలపక్ష సమావేశంలో మోతిలాల్‌ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగాన్నే ‘నెహ్రూ రిపోర్టు’ అంటారు. ఆ తర్వాత 1935లో కాంగ్రెస్‌ భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలని డిమాండు చేసింది. ఆ తర్వాత కాబినెట్‌ సిఫార్సుల మేరకు ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946లో ఎన్నికలు జరిగాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు ఈ పరిషత్తులో ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ తదనంతరం జాతీయ కాంగ్రెస్‌, ముస్లీం లీగ్‌, యూనియస్టు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌, యూనియనిస్టు ముస్లిం, కృషిక్‌ ప్రజా, సిక్కు
నాన్‌ కాంగ్రెస్‌, స్వతంత్ర కమ్యూనిస్టులు, బ్రిటీషు ఇండియా ప్రతినిధులతో 389 సభ్యులతో భారత దేశ మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటయ్యింది. అయితే ఈ సందర్భంగా అనేక మంది మేధావులు, రాజకీయ వేత్తలు విమర్శలు భవిష్యత్తు రాజ్యాంగ పరిషత్తు నిర్మాణంతో పాటు, రాజ్యాంగ పరిషత్తు సభ్యుల నియామకం వంటి అంశాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేశాయి. ‘రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తుంది’ అని విన్‌స్టన్‌ చర్చిల్‌ విమర్శిస్తే, ‘రాజ్యాంగ పరిషత్తు హిందువుల యొక్క సంస్ధ’ అని విస్కౌంట్‌ సైమన్‌ వ్యాఖ్యానించారు. 1947 ఆగస్టు 15న భారత దేశం స్వతంత్య్ర దేశంగా అవతరించింది. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకోబడింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీ అప్పటికే రాజ్యాంగాలను ఏర్పరచుకున్న దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలో భారతదేశానికి అవసరమైన వాటిని తీసుకుని దేశానికి అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. సుమారు 60కి పైగా దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను అంబేద్కర్‌ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్‌ కమిటీ పరిశీలించింది. అనేక చర్చలు , సమావేశాలు అనంతరం సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుధీర్ఘ పరిశ్రమ అనంతరం భారత రాజ్యాంగం ముసాయిదా ప్రతిని ఆమోదం కోసం అంబేద్కర్‌ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్‌ కమిటీ ప్రజల ముందు పెట్టబడింది. భారత రాజ్యాంగం ఆమోదానికి ముందు జరిగిన అనేక సమావేశాల్లో
మేధావులు, రాజకీయ నాయకులే కాదు, సామాన్యులు కూడా నేరుగా పాల్గొని వారి సలహాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం కలిపించారు. సామాన్యులకే కాదు మహిళలకు కూడా రాజ్యాంగ నిర్మాణంలో తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించారు. సుమారు 15 మంది మహిళలు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు. దుర్గాభాయి దేశ్‌ముఖ్‌, రాజకుమారి అమ్రిత్‌ కౌర్‌, హాన్సా మెహాతా, సుచేతా కృపాలనీ, అన్నీ మాస్కారేనే, అమ్ము స్వామినాథన్‌, దాక్షాయణీ వేలాయుధన్‌, కమలా చౌధరీ, పూర్ణిమా బానర్జీ, బేగం ఏజాజ్‌ రసూల్‌లతో పాటు మరికొంత మంది రాజ్యాంగ పరిషత్తుకు ప్రాతినిధ్యం వహించారు. సుమారు 114 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అయితే 1950 జనవరి 26వ తేది నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుండి భారత దేశం సంపూర్ణ సార్వభౌమాధికారంతో సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
రాజ్యాంగాల్లో బాహుబలి
ప్రపంచదేశాల రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం బాహుబలి వంటిది. 448 నిబంధనలు, 24 భాగాలు, 12 షెడ్యూల్స్‌తో దాదాపు మూడు సంవత్సరాల పాటు రచించబడిన రాజ్యాంగం అనేక విశిష్టతలని కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. దీనిని ఇంగ్లీషు, హిందీ భాషలలో రచించారు. రాజ్యాంగానికి సంబంధించిన డ్రాప్టింగ్‌ కాపీని రచించటంలో డాక్టర్‌ అంబేద్కర్‌ కీలక పాత్రను పోషించారు. భారత రాజ్యాంగాన్ని భావితరాలకు భధ్రంగా, అందంగా అందించాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రాయించాలని నెహ్రూ ప్రభుత్వం భావించింది. దేశంలోనే ప్రఖ్యాత కాలిగ్రాఫర్‌గా పేరుగాంచిన ప్రేమ్‌ బిహారీ నారాయణ రైజుదాకు రాజ్యాంగాన్ని రచించే భాద్యతని నెహ్రూ అప్పగించారు. ఈ సందర్భంగా నెహ్రూ రాజ్యాంగ రచనకు ఎంత తీసుకుంటారు అని రైజుదాని అడుగగా, నాకు ఒక్క రూపాయి వద్దు, కానీ రాజ్యాంగం ప్రతిలో నా పేరుతో పాటు, మా తాతగారి పేరు కూడా ఉంటే చాలని బదులిచ్చాడు.దానికి నెహ్రూ ప్రభుత్వం సమ్మతించటంతో రాజ్యాంగ రచనా ప్రక్రియ ప్రారంభమయ్యింది. 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌ 22 భాగాలతో కూడిన భారత రాజ్యాంగాన్ని పార్చుమెంట్‌ షీట్‌ల మీద 251 పేజీల మీద ఇంగ్లీషు భాషలో ప్రవహించే ఇటాలియన్‌ స్టైల్‌లో రైజుదా రచించారు. మొత్తం రాజ్యాంగాన్ని రాయడానికి రైజుదాకి 6నెలల సమయం పట్టింది. ఈ రచన కోసం రైజుదా 432 పాళీలను వాడారని చెబుతారు. దీంతో ప్రపంచంలోనే చేతితో రాసిన అతిపెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం చరితకెక్కింది.
హీలియం బాక్సులో ఎందుకు ?
చేతితో రాయబడిన భారత రాజ్యాంగం అసలు ప్రతులు ఇంకా భద్రంగా ఉన్నాయి. భారత ప్రభుత్వాలు ఈ ప్రతులను భద్ర పరచడానికి అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాజ్యాంగ ప్రతులని భద్రపరచడానికి పార్లమెంట్‌లో కొన్ని ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. రాజ్యాంగం అసలు ప్రతి ఒక్కొక్కటి 22 అంగుళాల పొడవు, 16 అంగుళాల వెడల్పుతో 3.75 కిలోల బరువు ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు భాషలో వీటిని రచించేటప్పుడు వినియోగించిన నల్ల ఇంకు యొక్క ఆయుర్దాయం తక్కువ. ఈ ఇంకుకు ఆక్సిజన్‌ తోడైతే కొంత కాలానికి అది ఆవిరై పోయే అవకాశముంది. ఈ అక్షర క్షయం నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం ప్రతులను హీలియం నింపిన పెట్టెలలో భద్రపరుస్తారు. ఈ పెట్టెలు ఉన్న గదులను ఒక ప్రత్యేక నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏడాదికి ఒకసారి ఈ గ్యాస్‌ ఛాంబర్లని ఖాళీ చేసి వాటిని పునరుద్ధరిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాజ్యాంగం ఒరిజినల్‌ కాపీలను సందర్శించే అవకాశం ప్రజలకి కల్పిస్తారు.
రాజ్యాంగానికి గుడి
దేశంలోని ప్రజలందరికీ సమాన హాక్కుల్ని ప్రసాదించే భారత రాజ్యాంగానికి కేరళలోని తిరువనంతపురంలో మూడు సెంట్ల తన సొంత స్ధలంలో శివనాథన్‌ పిళ్ళై అనే సామాజిక శాస్త్ర అధ్యాపకుడు ఒక గుడిని నిర్మించారు. భారతదేశంలో నివశిస్తున్న ప్రజలందరినీ ఒక్కటిగా ఉంచి, అందరి సంక్షేమాన్ని కాంక్షించే భారత రాజ్యాంగంపై నేటి తరంతో పాటు, భావి తరాలకు కూడా అవగాహన కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ గుడి నిర్మించానని శివనాథన్‌ పిళ్లై చెబుతారు. ఈ భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాజు పెట్టెలో భారత రాజ్యాంగం అందరికీ కనబడేలా ఉంటుంది. రాజ్యాంగం ప్రదర్శనకు ఉంచిన గదిలో నిరంతరం ఒక దీపం వెలుగుతూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ భవనం నిండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఫోటోతో పాటు, సామాజిక విప్లవకారులు జ్యోతిభా ఫూలే, తైకాడ్‌ అయ్యావు గురు, వినోభాబావే, అయ్యంకాళీ, మహాత్మాగాంధీ వంటి మహానీయుల చిత్రపటాలను అమర్చారు. రాజ్యాంగాన్ని సంబంధించిన ప్రవేశిక, దాని విశిష్టతలకి సంబంధించిన చిత్రపటాలను కూడా ఈ భవనంలో శివనాథన్‌ పిళ్లై ఏర్పాటు చేశారు. భరణ ఘటన క్షేత్రంగా పిలవబడే ఈ గుడిలో ఏటా స్వాతంత్య్రం దినోత్సం నాడు ఆయన అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన, ఉన్నతమైన రాజ్మాంగంగా అభివర్ణించవచ్చు. ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగాలలో అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. అందుకే హెచ్‌.వి. కామత్‌ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు. భారత దేశం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచార, వ్యవహారాలు, భిన్న వర్గాలు ఒక్కటిగా మనుగడ సాగిస్తున్న ఒక సమాఖ్య వ్యవస్ధ. ఈ వైవిధ్యంతో పాటు దేశంలో శతాబ్దాలుగా సాగుతున్న మానవ హాక్కుల హాననం, కుల వివక్ష, లింగ వివక్ష, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్ధిక అసమానతలు వీటన్నింటినీ చర్చించి వాటికి పరిష్కారాలను చూపించాల్సిన భాద్యతను రాజ్యాంగ నిర్మాతలు భాద్యతగా భావించటం వల్లే 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్‌తో కూడిన ఒక అతిపెద్ద రాజ్యాంగం ఆవిష్కృతమయ్యింది. ప్రస్తుతం 448 నిబంధనలు, 24 భాగాలు, 12 షెడ్యూల్స్‌ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అప్పటి వరకూ భారతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలకు రాజ్యాంగం పరిష్కార మార్గాలను చూపించింది. మానవ సమాజాన్ని ముక్కలు చేస్తున్న కుల, మత, లింగ వివక్షతను సాంఘిక నేరాలుగా పరిగణించింది. వేల సంవత్సరాలుగా అంటరానివారిగా సమాజానికి దూరంగా బతుకుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలను చేపట్టింది. వందల సంవత్సరాలుగా ఆచారాలుగా చెలామణీ అవుతున్న అంటరానితనం, బాల్యవివాహాలు, వెట్టి చాకిరీ, లింగ వివక్షత వంటి వాటిని సామాజిక దురాచారాలుగా ప్రకటించి, వాటిని నిషేదించింది. సామాజిక దురాచారాల నిర్మూలనకు ప్రత్యేక చట్టాలను చేసింది. భారత దేశంలో అనేక మతాలు మనుగడలో ఉన్నాయి. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను గౌరవిస్తుంది, మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణిస్తుంది. మతాన్ని పాలనా వ్యవహారాల్లోకి భారత రాజ్యాంగం అనుమతించదు. కానీ నేడు దానికి విరుద్ధంగా భారతదేశంలో పాలన నడవటం గమనార్హం.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు పైగా గడిచినప్పటికీ నూటికి 70 నుండి 80 శాతం మందికి రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అందలేదంటే అతిశయోక్తి కాదు, అది అక్షర సత్యం. అసలు రాజ్యాంగం అందించిన హాక్కుల గురించి కనీస అవగాహాన లేని ప్రజలు ఈ దేశంలో ఇంకా సగం మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. ఏ సామాజిక అభివృద్ధినైతే రాజ్యాంగం వాగ్ధానం చేస్తుందో ఆ వాగ్ధానం నేటికీ నెరవేరకపోవటం ఒక మహా విషాదం. ఇంకా కోట్లాది మంది భారతీయులు దుర్భరమైన పేదరికంలో మగ్గుతున్నారు. గ్లోబల్‌ హాంగర్‌ ఇండెక్స్‌ 2023కి ప్రకటించిన జాబితాలో భారత్‌ 111వ స్ధానంలో ఉంది. 125 దేశాలకు సంబంధించిన జాబితాలో 111వ స్ధానంలో భారతదేశం ఉందంటే భారతదేశంలో పేదరికం, ఆకలి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గ్లోబల్‌ హాంగర్‌ ఇండెక్స్‌ ర్యాంకులను భారత ప్రభుత్వం తిరస్కరించవచ్చు కానీ, ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వాలు అందిస్తున్న చౌక డిపో బియ్యం మీదే ఆధారపడి బతుకుతున్నారన్నది కాదనలేని వాస్తవం. రోజు వారీ అవసరాలకు తగిన సంపాదన లేని ప్రజలు ఈ దేశంలో సగానికి పైగా ఉన్నారు. 70శాతం మంది శ్రమతో నిర్మితమైన సంపద కేవలం ఒక్క శాతం మంది వ్యక్తుల ఖజానాలో చేరుతుంది. భారత దేశంలో ఆర్ధిక అసమాతలు రోజురోజుకీ పెరుగుతున్నాయని అంతర్జాతీయ హాక్కుల సంస్ధ ఆక్స్‌ఫాం లెక్కలతో సహా నిగ్గు తేల్చింది. భారత రాజ్యాంగం ప్రకారం విద్య, ఆరోగ్యం ప్రభుత్వాలకు సంబంధించిన ప్రధాన భాద్యతలు, కానీ వాటి నుండి ప్రభుత్వాలు దూరంగా జరిగాయి. విద్య, ఆరోగ్య రంగంలో ప్రవేటు శక్తుల ప్రవేశంతో నాణ్యమైన విద్య కోట్లాది మంది భారతీయులకు అందని ద్రాక్షగా మారిపోయింది. ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఈ రెండు రంగాలలో జరుగుతుంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారమే గ్రామీణ భారతదేశంలో నూటికి 40 శాతం మంది నిరక్షరాస్యులు. వీరికి కనీసం వారు పేరు కూడా రాయటం రాదు. అంటే భారత రాజ్యాంగం గురించి వీరికి పూర్తిగా తెలియదనే అనుకోవాలి. దేశంలో అక్షరాస్యతా శాతం 77.7 శాతం ఉంటే దానిలో పురషులలో 82 శాతం అక్షరాస్యత ఉంటే, మహిళలలో కేవలం 65శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. భారతదేశంలో కనీస భూమిలేని వారు 30కోట్ల మందికి పైగా ఉన్నారు. నివశించడానికి కనీస జాగాలేని ప్రజలు 30శాతం మందికి పైగా ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం దేశంలో 15కోట్ల మంది భూమి లేని పేదలు వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. 2023నాటికి ఇది 30కోట్లకి పెరిగిందని ఒక అంచనా. ఇది కాదు భారత రాజ్యాంగం ఆశించిన ప్రజాస్వామ్యం. ఇది కాదు కోట్లాది మంది కలలు గన్న స్వాతంత్య్రం.
బ్రిటీషు పాలనకు ముందు భారతదేశంలో పరిపాలన రాజుల చేతుల్లో ఉండేది. రాజరికంలో ప్రజాబీష్టానికి ఏ మాత్రం విలువ లేకుండా పాలన కేవలం కొన్ని వర్గాల చేతుల్లో ఉండేది. వారు చెప్పిందే చట్టం, చేసిందే ధర్మం. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా రాజద్రోహం నేరాన్ని ఎదుర్కొవాల్సి వచ్చేది. ఆంగ్లేయుల ప్రవేశంతో దేశంలో వ్యాపార సంస్ధల పాలన ప్రారంభమయ్యింది. ఇక్కడ కూడా ప్రజల అభీష్టాలకీ, హాక్కులకీ ఏ మాత్రం విలువ ఉండేది కాదు. కేవలం పాలకుల వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగేది. కొద్ది మంది ప్రయోజనాలే లక్ష్మంగా సాగుతున్న వలసవాద పాలనపై అలుపెరుగని పోరాటం చేసి భారతీయులు స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నారు. సంపాదించుకున్న స్వాతంత్య్ర ఫలాలు, దేశంలోని సహజ వనరులు అందరికీ సమానంగా దక్కాలన్న లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామిక పాలనా యుగం ప్రారంభమయ్యింది. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం అవతరించింది. భారతదేశంలో ప్రజల పాలన ప్రారంభమై ఏడు దశాబ్దాలు పూర్తయినా, ఈ దేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందలేదంటే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఏ రీతిగా పని చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. కేవలం పారిశ్రామిక వర్గాల ఆర్ధిక ఆకలి తీర్చడానికే దేశంలోని సమస్త వనరుల్ని, వ్యవస్ధల్ని ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. కేవలం ఒక్క శాతం సాధిస్తున్న అభివృద్ధినే దేశాభివృద్ధిగా ప్రచారం చేస్తున్నాయి. వీటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తమ పాలనను పటిష్టం చేసుకోడానికి కొన్ని మతతత్వ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మెజారిటీ పేరుతో కేవలం ఒకే మతం, ఒకే వర్గానికి చెందిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ వ్యవస్ధలు పనిచేస్తున్నాయి. ఈ చర్యలకు అడ్డంకిగా మారిన భారత రాజ్యాంగాన్ని సైతం మార్చాలన్న దిశగా వారి చర్యలు సాగుతున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన హాక్కులని అడగటం కూడా దేశ ద్రోహం నేరంగా పరిగణించబడుతున్న కాలంలో ప్రజలే రక్షకులుగా మారాలి. రాజ్యాంగం వైఫల్యం చెందితే అది రాజ్యాంగ వైఫల్యం కాదు, దానిని అమలు చేసే వారి వైఫల్యంగానే పరిగణించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ మాటల్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. కోట్లాది మంది జీవితాలకు రక్షణ కోటగా నిలిచిన భారత రాజ్యాంగం రక్షణకు విఘాతం కలిగితే దేశ ప్రజలు మరొక స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని అంబేద్కర్‌ ఆనాడే ఉద్భోధించారు. భారతీయులంతా, ప్రజాస్వామికవాదులంతా రాజ్యాంగ పరిరక్షణకు మరొక స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన తరుణమిది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే, రాజ్యాంగం మనల్ని, మన దేశాన్ని కాపాడుతుంది. రాజ్యాంగం రక్షతి రక్షిత:.
డా|| కె. శశిధర్‌ , 94919 91918 

Spread the love