ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు

– గతం కంటే ఈసారి మరింత అధికం
– వ్యయానికి వెనుకాడని రాజకీయ పార్టీలు,అభ్యర్థులు వెల్లడిస్తున్న సంస్థలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతు న్నాయి. ఈ ఎన్నికల్లో గెలవటానికి రాజకీయ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా ఎంత ఖర్చుకైనా పార్టీలు, అభ్యర్థులు వెనుకాడటం లేదు. అయితే, ఈ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని కొన్ని అంచనా సంస్థల సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అయిన మొత్తం ఖర్చు రూ. 55,000-60,000 కోట్లకు చేరుకున్నది. అయితే, ఈ సారి ఎన్నికల్లో దానిని మించి ఖర్చయ్యే అవకాశాలున్నాయని ఎన్నికల ఖర్చులను ట్రాక్‌ చేసే సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) వెల్లడించింది. .
ఎన్నికల వ్యయాన్ని అంచనా వేసే ఓపెన్‌ సీక్రెట్స్‌.ఆర్గ్‌ ప్రకారం.. ఈ ఎన్నికల్లో కాబోయే ఖర్చు 2020 యూఎస్‌ ఎన్నికల్లో అయిన మొత్తం వ్యయం దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల ఖర్చుతో సమానం. మరో మాటలో చెప్పాలంటే.. భారత్‌లో జరుగుతున్న ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. అయితే, రాజకీయ పార్టీలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. డబ్బు ప్రభావంతో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)నుంచి రాజకీయ పార్టీల ఖర్చుపై పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఆగకపోవటంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసీఐ ‘వ్యయ పరిశీలకులను’ నియమించి నప్పటికీ.. ప్రతి ఎన్నికలతో పాటు బహుమతులు, నగదు, బంగారం, డ్రగ్స్‌ వంటి బహుమతులు కూడా ప్రతి ఎన్నికలకు పెరుగుతూనే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ‘ఓటుకు నోటు’కు వ్యతిరేకంగా ఎన్నికల సంఘం ఎన్ని ప్రచారాలు నిర్వహిస్తున్నా అభ్యర్థులు, ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థుల ఖర్చు విషయానికొస్తే.. ప్రతి పోటీదారు లోక్‌సభ నియోజకవర్గాలకు రూ. 75-95 లక్షలు (ప్రాంతాన్ని బట్టి), అసెంబ్లీ స్థానాలకు రూ. 28-40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. వ్యయ పరిమితులు బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్‌లు, వాహనాలు, ఇతర వాటితో సహా ప్రతి అభ్యర్థి చట్టబద్ధంగా ప్రచారం కోసం ఖర్చు చేయగల మొత్తాన్ని సూచిస్తాయి. ఈ ఖర్చు పరిమితులు 1951-52లో మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో దాదాపు రూ. 25,000 నుంచి ప్రతి అభ్యర్థికి ప్రస్తుతం రూ. 75-95 లక్షలకు పెరగటం గమనార్హం.
సీఎంఎస్‌ నివేదిక ప్రకారం.. 1998 నుంచి 2019 వరకు.. మొత్తం 20 సంవత్సరాలలో ఎన్నికల వ్యయం ఆరు రెట్లు పెరిగింది. 1998లో ఖర్చు రూ. 9,000 కోట్లు ఉండగా.. అది 2019లో దాదాపు రూ. 55,000 కోట్లకు ఎగబాకింది. 2019 ఎన్నికల సమయంలో ఒక్కో ఓటుకు సగటున రూ.700 లేదా లోక్‌సభ నియోజకవర్గానికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల తీరును బట్టి చూస్తే ఈ సారి 2024 ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలో మొత్తం రూ. 55,000-60,000 కోట్ల పోల్‌ ఖర్చులో కేవలం రూ. 12,000-15,000 కోట్లు (20 నుంచి 25 శాతం) నేరుగా ఓటర్లకు చేరాయి. అభ్యర్థులపై పడిన అతిపెద్ద భారం ప్రచారం. ఇందుకు 30 నుంచి 35 అంటే.. రూ. 20,000-25,000 కోట్లు అభ్యర్థులు ఖర్చు చేశారు. రూ.5,000 నుంచి రూ.6,000 కోట్లు(మొత్తం వ్యయంలో 8-10 శాతం) ఖర్చు లాజిస్టిక్స్‌ మీద ఉన్నాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక ప్రకారం.. 2009 ఎన్నికల సమయంలో 29 శాతం మంది అభ్యర్థులు రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఆ సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి 474 మంది ఎంపీలకు(దాదాపు 88 శాతం మంది) చేరటం గమనార్హం.
అభ్యర్థుల విజయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాజకీయ పార్టీలు.. తీవ్రమైన ఖర్చు చేస్తున్నాయి. అభ్యర్థుల తరపున పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం.. 2019లో 32 జాతీయ, రాష్ట్ర పార్టీలు అధికారికంగా ఖర్చు చేసిన మొత్తం రూ. 2,994 కోట్లలో.. రూ.529 కోట్లు అభ్యర్థులకు ఏకమొత్తం గా వెళ్లాయి. రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్‌, కార్పొరేట్లు, పరిశ్రమలు, చిట్‌ ఫండ్‌, కాంట్రాక్టర్లు, పౌరులు, రవాణా దారులు, ఎన్నారైలు, వివిధ పరిశ్రమల మూలాల నుంచి దాతల డాలర్లు తరచుగా వస్తాయనీ, వీటినే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విచ్ఛలవిడిగా ఖర్చు చేస్తున్నాయని చెప్తున్నారు.

Spread the love