భారీగా పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌

– దేశ వ్యాప్తంగా 250 గిగావాట్లకు చేరొచ్చని అంచనా
– బొగ్గు నిల్వలు పెంచుకోవాలని కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: రానున్న వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశ వ్యాప్తం గా 250 గిగావాట్ల గ్రిడ్‌ డిమాండ్‌ ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. గత ఏడాది వేసవిలో జరిగిన వినియోగానికి సమానంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలోనే దేశ వ్యాప్తంగా వినియోగించారు. చలి కాలం కావడంతో ఆ తరువాత వినియోగం కొంత తగ్గినా, ఫిబ్రవరి నెలాఖరు నుండి పెరిగి వేసవిలో పతాక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రిడ్‌ డిమాండ్‌ 220 గిగావాట్ల వరకు ఉంది. ప్రతి ఏటా విద్యుత్‌ డిమాండ్‌ మూడుశాతం నుండి ఐదుశాతం వరకూ పెరుగుతోంది. అయితే ఈ సారి వర్షాభావం వల్ల డిమాండ్‌ భారీ గా పెరిగే అవకాశం ఉందని అంచ నా వేస్తున్నారు. జల విద్యుత్‌ ఉత్పత్తి ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకూ ఒక మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కూడా ఉత్పత్త్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల ద్వారా గతేడాది సరిపోయినంత రెండువేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం పవన, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. వర్షాలు లేక రిజర్వాయర్లలో నీరు లేక పోవడంతో ఖరీఫ్‌లో బోర్ల మీదే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఏర్పడింది. రబీ సాగు కూడా బోర్లపైనే అధారపడి జరగాల్సి ఉంటుందని అంచనా వేస్తు న్నారు. దీంతో ఈసారి డిమాండ్‌ తారాస్థాయికి చేరుతుందని నిపుణు లు భావిస్తున్నారు. దీనిలో భాగం గానే బొగ్గు నిల్వలు పెంచుకునేందు కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అవసర మైతే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది.
వ్యవసా యానికి సోలార్‌ విద్యుత్‌ను వినియో గించేలా చర్యలు తీసుకోవాలనీ సూచించింది. సోలార్‌ ఉత్పత్తి లేని సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లపై ఆధారపడాలని సూచించింది. రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న జెన్‌కో ప్లాంట్లను పూర్తి సామర్ధ్యంతో నడపాలని చెప్పింది. పిఎల్‌ఎఫ్‌ 85 శాతం ఉండేలా ప్లాంట్లను సిద్ధం చేయాలని పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని, పర్యావరణ, ఇతర అనుమతులు వచ్చేలా, భూమి లభ్యత వంటి వాటికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.

Spread the love