Sunday, May 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకూల్చివేతలను పునరుద్ధరించాలి

కూల్చివేతలను పునరుద్ధరించాలి

- Advertisement -

24 గంటల్లో యథాస్థితి కల్పించాలి
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
కూకట్‌పల్లి భూమి వివాదం


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కోర్టుల ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ కూకట్‌పల్లి భూ వివాదంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీలను, ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టి రాత్రికి రాత్రే నిర్మాణాలను తొలగించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌కు చెందిన స్థలంలో ఈ నెల 25వ తేదీ నాటికి ఉన్న పరిస్థితిని 24 గంటల్లో పునరుద్ధరించాలని హైడ్రా, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌, సంబంధిత తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని సర్వే నెంబర్లు 1003 నుంచి 1006 వరకు విస్తరించిన 13.17 ఎకరాల భూమికి సంబంధించి ఈ వివాదం తలెత్తింది. ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కాంపౌండ్‌ గోడలు, ఫెన్సింగ్‌, భద్రతా సిబ్బంది గదులు, ప్రవేశ ద్వారాలను కూల్చివేశారని ఎన్‌వీఎన్‌ కన్స్ట్రక్షన్స్‌ ఆరోపించింది. అంతేకాక అక్కడ ఉన్న యంత్రాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారని పేర్కొంటూ మూడు వేర్వేరు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్న కేసుల్లోనూ, కోర్టుకు హామీలు ఇచ్చిన వ్యవహారాల్లోనూ హైడ్రా తన ఇష్టానుసారంగా వ్యవహరించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

ముందుగా కూల్చివేతలు చేపట్టి, ఆ తరువాత వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేయడం హైడ్రాకు అలవాటుగా మారినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కోర్టు ముందు ఉన్న రికార్డులను పరిశీలిస్తే గత ఆదేశాలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని, ఇదే అంశంపై ధిక్కరణ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే చేపట్టిన చర్యలు సందేహాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. పిటిషనర్లు సమర్పించిన ఆధారాల ప్రకారం హైడ్రా స్వయంగా కోర్టుకు ఇచ్చిన హామీని కూడా పాటించలేదని గమనించారు. దీంతో వివాదాస్పద స్థలంలో ఈ నెల 25వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని పూర్తిగా పునరుద్ధరించాలని ఆదేశించారు. ఫెన్సింగ్‌, భద్రతా సిబ్బంది గదులు, ప్రవేశ ద్వారం, విద్యుత్‌ లైన్లు, లైటింగ్‌తోపాటు ఇతర మౌలిక వసతులన్నింటినీ తిరిగి ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. స్థలం వద్ద హైడ్రా, రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి, బోర్డులను కూడా తీసేయాలని ఆదేశించారు. అధికారులు ఆదేశాలను అమలు చేయకపోతే పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని ప్రతివాదుల నుంచే వసూలు చేసుకునే హక్కు పిటిషనర్లకు ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను జూన్‌ 4కు వాయిదా వేశారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -