– టీయూసీఐ జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్
– మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – సత్తుపల్లి
మున్సిపల్ కార్మికుల వేతనాలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎండార్స్‌మెంట్‌ను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాల తగ్గింపు ఎండార్స్‌మెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహకు శనివారం వినతిపత్రం అందించారు. సందర్భంగా శరత్ మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, జీవో నంబర్ 6 పేరుతో జోన్ల వారీగా విభజించి కార్మికుల పొట్టకొడుతోందని మండిపడ్డారు.
ఈ నిర్ణయం వల్ల ఒక్కో మున్సిపల్ కార్మికుడి వేతనంలో రూ. 1,000 నుండి రూ. 3,000 వరకు కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం దారుణమని దుయ్యబట్టారు. వేతన సంఘం సిఫార్సు చేసిన రూ. 26,000 జీతాన్ని లేదా ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని అమలు చేయాలని కోరారు. స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్‌లో స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రవి, ప్రసాద్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, కాంతమ్మ, వెంకటమ్మ, భారతమ్మ పాల్గొన్నారు.



