రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!

నవతెలంగాణ – హైదరాబాద్
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం విడుదల కానుందని సమాచారం. అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పూర్తి చేశారని, సోమవారం ఉదయం 11 గంటల 5 నిమిషాలకు మీడియా సమావేశం పెట్టి అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. మెజారిటీ సిట్టింగులకు మరో మారు అవకాశం ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారని సమాచారం. శ్రావణ సోమవారం, పంచమి రోజు 105 మంది పేర్లు ప్రకటన చేయనున్నారు. టికెట్లు రాని సిట్టింగులకు, ఆశావాహులకు ఇప్పటికే బుజ్జగింపులు పూర్తి చేశారనే టాక్ వినిపిస్తోంది. వారికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. 10 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేదు. ఈసారి ఉప్పల్ టికెట్‌ బండారు లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్‌లను ఎమ్మెల్సీ కవిత బుజ్జగించారు.  వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌కు నో ఛాన్స్, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ సిట్టింగుల అభ్యర్థులపై వేటు వేశారు. అయితే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చారు. వైరా, కొత్తగూడెం, జహీరాబాద్‌ సిట్టింగులకు ఈ సారి అవకాశం ఇవ్వలేదు. దీంతో నియోజక వర్గాల్లో గ్రూప్ కొట్లాటలు పెరిగాయి. టికెట్ల కోసం సిట్టింగ్‌లకు పోటీగా ఆశావహులు మీటింగులు పెట్టుకుంటున్నారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు వారిని బుజ్జగిస్తున్నారు. కాగా వరంగల్‌ జిల్లా నుంచే సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. అక్టోబర్‌ రెండో వారంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. అక్టోబర్‌ 6న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 4 లేదా 6న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలియవచ్చింది.

Spread the love