వరద సవాల్‌..!

Flood challenge..!– ఎమ్మెల్యేలకు ముంపు చిక్కులు
– శాశ్వత పరిష్కారానికి డిమాండ్‌
– మున్నేరుపై ఆర్‌సీసీ వాల్‌ సాకారమేనా..?
– గోదావరి ముంపు ఊసేలేని క్యాబినెట్‌ భేటీ
– వరద తక్షణ సాయంపైనా విమర్శలు
– అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చేనా..
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జులై 18 నుంచి మొదలైన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. 27వ తేదీ నుంచి భారీగా వరదలు పోటెత్తడంతో ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతం.. అటు కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరిసరాలు ముంపు బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల క్యాబినెట్‌ భేటీలో ముంపు బాధితులకు తక్షణ సహాయార్థం రూ.500 కోట్లు కేటాయించింది. కానీ ఇవి ఏమేరకు సరిపోతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గురువారం నిర్వహించే చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా నదీ తీర ప్రాంత వాసుల సమస్యలు పరిష్కారం అవుతాయో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సమావేశాల్లో ఏ మేరకు ముంపు ప్రాంత ఎమ్మెల్యేలు మాట్లాడతారు.. శాశ్వత పరిష్కారం చూపుతారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం వరద బాధితులు ఎదురుచూస్తున్నారు.
మున్నేరుకు అడ్డుగోడ సాకారమయ్యేనా..?
ఖమ్మం నగరానికి సరిహద్దున ఉన్న మున్నేరు పరివాహంలోనూ ఇటీవల వరదలు భారీగా పోటెత్తాయి. 2005లో ఎగువన బయ్యారం, పదుల సంఖ్యలో చెరువులకు గండ్లు పడటంతో ఉగ్రరూపం దాల్చిన మున్నేరు చేసిన నష్టానికన్నా ఈసారి రెట్టింపు స్థాయిలో ముంపు సంభవించింది. నగరానికి ఎగువన రెండు, మూడుచోట్ల చెక్‌డ్యాంలు నిర్మించినా అవీ వరదలను నియంత్రించలేకపోయాయి. మున్నేరు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో పైన ఏ చెరువుకూ గండిపడకపోయినా ఖమ్మం అర్బన్‌, రూరల్‌ మండలాల్లోని మూడువేలకు పైగా ఇండ్లు జలమయమయ్యాయి. పదివేల మందికి పైగా ప్రజలు ముంపు బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన క్యాబినెట్‌ భేటీలో మున్నేరుకు ఇరువైపులా ఆర్‌సీసీ వాల్‌ మంజూరు చేస్తూ రూ.150 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో పలుమార్లు కరకట్ట గురించి హామీ ఇచ్చినప్పటికీ అది కలగానే మిగిలింది. టీడీపీ హయాంలో తుమ్మల నాగేశ్వర రావు మంత్రిగా ఉన్నప్పుడు కరకట్టలకు ప్రతిపాదనలు పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ప్రతిపాదనలు వెళ్లాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక కూడా మాజీ మంత్రి తుమ్మల, ప్రస్తుత మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ సీఎం, కేటీఆర్‌లలో ఎవరూ వచ్చినా కరకట్టల విషయం ప్రస్తావించారు. రెండేండ్ల క్రితం కార్పొరేషన్‌ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే రూ.146 కోట్లు కేటాయిస్తూ అనుమతులు జారీ చేశారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇలా మూడు దశాబ్దాలుగా మున్నేరుకు అడ్డుగోడ కలగానే మిగిలింది. ఇప్పుడు కూడా సాకారం అవుతుందో లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి.
వరదల నియంత్రణకు శాశ్వత పరిష్కారం లేదా..?
సాధారణంగా భద్రాచలానికి ఆగస్టులో భారీగా వరదలు పోటెత్తుతాయి. కానీ ఈ ఏడాది జూన్‌, జులైలోనే గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో వరదలు పోటెత్తాయి. పోలవరం ఎత్తు పెంచడం.. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంతో బ్యాక్‌వాటర్‌ భద్రాచలం వరకు ఎగపోటు వేస్తున్నా కేంద్ర జలమండలి, రాష్ట్ర ప్రభుత్వాలు దాని ప్రస్తావనే తేవడం లేదు. రెండు, మూడేండ్ల్లుగా కొద్దిపాటి వర్షానికే భద్రాచలం జలమయం అవుతుండటం.. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీరు ప్రవహిస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు.
భద్రాచలం వరదలకు కరకట్టల నిర్మాణం అసాధ్యమని జలసౌధలో మంగళవారం నిర్వహించిన నీటిపారుదల శాఖ సమీక్షలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ చేసిన ప్రకటన వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది వరదల సందర్భంగా భద్రాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరదల నియంత్రణ, భద్రాద్రి అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానన్న హామీ అమలుకాలేదు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ భద్రాచలం వరదల ఊసే ఎలేకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తంతో ఉన్నారు.
మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ చూపాలి..
అటు గోదావరి, ఇటు మున్నేరు కరకట్టల విషయంలో ఉమ్మడి జిల్లా మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజరుకుమార్‌తో పాటు ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, భద్రాచలం, పాలేరు ఎమ్మెల్యేలు పోడెం వీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి చొరవ చూపి కరకట్టలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా మాట్లాడాలి. నష్టాల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ముంపు వాసులకు ప్రభుత్వం కేటాయించిన తక్షణ సహాయం రూ.500 కోట్లను మూడింతలు పెంచాలి.
– నున్నా నాగేశ్వరరావు,
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి

Spread the love