– ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భవిష్యత్తులో ప్రతి అంశంలో మేధో సంపత్తి హక్కుల ప్రమేయం ఉంటుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. అందుకు పరిశోధకులు, ప్రొఫెసర్లు మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంసిద్ధం కావాలని సూచించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉద్యాన విశ్వవిద్యాలయం – మేధో సంపత్తి హక్కుల విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల వాణిజ్య పంథా మేధో సంపత్తి హక్కుల పాత్ర’పై నిర్వహించిన సదస్సులో నీరజ ప్రభాకర్ మాట్లాడారు. ఉద్యాన రంగంలో సైతం మేధో సంపత్తి హక్కులకు చాలా ప్రాధాన్యం ఉన్నదని తెలిపారు. రైతులకు, పంటలకు లాభాలు తెచ్చి పెట్టేలా మేధో సంపత్తి హక్కులను మార్చుకోవాలని పేర్కొన్నారు. గణాంకాలు సేకరిస్తున్నామని త్వరలోనే వాటికి భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేస్తామన్నారు. విద్యార్థులు చేపట్టిన పరిశోధనలో మేధోసంపత్తి హక్కులు పరిరక్షించేందుకు అవకాశాలుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల ద్వారా 20 నుంచి 30శాతం అధిక ధరను రైతులు పొందుతున్నట్టు ప్రముఖ అడ్వకేట్, రిజల్యూట్ ఫర్ ఐపీ, లీగల్ హెడ్ సుభాజిత్ సాహా అన్నారు. తెలంగాణలో మేధోసంపత్తి హక్కులకు అర్హత కలిగిన అనేక ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. మేధో సంపత్తి హక్కుల సంఖ్య ఒక సంస్థ యొక్క పనితనానికి కొలమానంగా ఉంటాయని వర్సిటీ డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పీజీ డీన్ డాక్టర్ ఎం. రాజశేఖర్, వర్సిటి మేధాసంపత్తి హక్కుల పరిరక్షణ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ పిడిగం సైదయ్య, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.