తెలంగాణ ఆడబిడ్డ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కితాబు
మహిళా సంఘాలతో సీఎం ముచ్చట.. వాటర్ ప్లాంట్ ప్రారంభం
పోరాటాల ఫలితమే ములుగు జిల్లా : మంత్రి దనసరి సీతక్క
మేడారంలో ముఖ్యమంత్రి ముమ్మర పర్యటన
నవతెలంగాణ – ములుగు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేడారంలో గిరిజన పూజారులు సాంప్రదాయ డోలు వాయిద్యాల నడుమ సీఎంకు ఘన స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ గద్దెలను దర్శించుకున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించి మొక్కులో భాగంగా నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 24 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,016 చొప్పున చేయూత సామాజిక భద్రత పింఛన్ చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు. మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ములుగు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్లతో చేపట్టనున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 2,145 రహదారులు (మొత్తం 7,448 కి.మీ) అభివృద్ధి చెందనున్నాయి. ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క -సారలమ్మ దేవాలయాన్ని రామప్ప, వేయి స్తంభాల గుడి తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి త్వరలో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. జంపన్న వాగుపై చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాల నిర్మాణం చేపట్టి సమగ్ర అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించేందుకు జర్మన్, జపనీస్, కొరియన్ వంటి విదేశీ భాషల్లో ఉచిత శిక్షణ అందించడంతో పాటు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆడబిడ్డ అంటూ సీఎం కితాబు
ములుగు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కపై ప్రశంసల జల్లు కురిపించారు. “తెలంగాణ ఆడబిడ్డ” అయిన సీతక్క ములుగు అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆమె పనితీరును సీఎం ప్రత్యేకంగా కొనియాడారు.
ప్రజా ప్రభుత్వంలోనే అభివృద్ధి గత పాలకులపై మంత్రి సీతక్క విమర్శలు
గత పాలకులు ఎన్నికల సమయంలో కేవలం శంకుస్థాపనలు చేసి, ఆ తర్వాత నిధులు కేటాయించకుండా పనులను నిలిపివేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిలిచిపోయిన పనులను మళ్లీ ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని మంత్రి సీతక్క కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి, స్వర్గీయ నల్లెల్ల కుమారస్వామి చేసిన పోరాటాల ఫలితంగానే ములుగు జిల్లా ఏర్పాటయిందని సీతక్క గుర్తుచేశారు. నేడు అదే జిల్లాను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారన్నారు.
ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



