– మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో రూ.కోటి వ్యయంతో పీడబ్ల్యుడీ రోడ్డు నుంచి చేవెళ్ళ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఆలూరు గ్రామం నుంచి న్యాలట క్రాస్ రోడ్డు వరకు రూ. 4.50 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెంది, స్వచ్ఛతకు నిలయాలుగా మరాయని తెలిపారు. తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రూ.12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చి, నర్సరీలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.1329.73 కోట్ల వ్యయంతో శ్మశాన వాటికలు నిర్మించారన్నారు. అలాగే, రైతుల కోసం రూ.535.44 కోట్ల వ్యయంతో 2601 రైతువేదికలు నిర్మించినట్టు తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించుకోవడం కోసం గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. 24 గంటలు ఉచిత విద్యుత్, రోడ్లు, లైట్లు, తాగునీరు, డ్రయినేజీల నిర్మాణాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలో అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అమలు చేస్తూ, నిరుపేదలకు భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యాదమ్మ, నరేందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రంగారెడ్డి, వైస్ చైర్మెన్ నర్సిములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.