– జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య
నవతెలంగాణ – బోనకల్
కురమ, యాదవులను గొర్రెల పంపిణీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య, జిల్లా అధ్యక్షుడు చింతలచెరువు కోటేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో ఈనెల 22న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు సంబంధించి పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 16,844 మంది కురమ, యాదవులకు గొర్రెల పంపిణీ చేయవలసి ఉండగా కేవలం 15 నెలల కాలంలో 521 మందికి మాత్రమే గొర్రెల పంపిణీ చేశారన్నారు. గొర్రెల పంపిణీ వలన కురమ, యాదవులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ప్రకటిస్తూ మరొకవైపు వారిని అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు. డీడీలు చెల్లించి 15 నెలల కాలం అవుతున్న నేటి వరకు గొర్రెల పంపిణీ చేయలేదన్నారు.కురమ, యాదవులకు నగదు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ధనియాకుల రామయ్య, జోనిబోయిన గురవయ్య, దుందుకూరు మోహన్ రావు, పుచ్చకాయల ధనయ్య, మంద వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
గొర్రెల పంపిణీ.. నగదు బదిలీ రూపంలో చేయాలి
నేలకొండపల్లి: కురుమ, యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నగదు బదిలీ రూపంలో చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న జిఎంపిఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన మహాధర్నాకి యాదవ్, కురమలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షుడు చింతలచెరువు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలలో గొర్రెలు మేకల పెంపుకుందారుల సంఘం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో గొర్రెల స్కీం కోసం డీడీలు కట్టి 14 నెలలుగా గడుస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న యాదవ, కురములు అందరికీ వెంటనే గొర్రెల పంపిణీ నగదు రూపంలో అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. ఈ ప్రచారంలో జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య, మండల అధ్యక్షులు తెల్లగొర్ల లింగస్వామి, కార్యదర్శి యడ్ల తిరుపతిరావు, నాయకులు మార్తి కొండలరావు, జిల్లా డైరెక్టర్ మల్లెబోయిన శ్రీ ను, యర్రా దేశి నరసింహారావు, కనకబండి రమేష్, వలరాజు, నోముల జానయ్య, కొమెర నాగేశ్వరరావు,పచ్చిపాల వెంకటేశ్వరరావు, ధనమూర్తి, ఆవుల వెంకన్న, నవీన్, మీగడ లింగరాజు, చిలకల వెంకటనర్సయ్య పాల్గొన్నారు.