కేరళంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు
తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం
న్యూఢిల్లీ: కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. జూన్ 6 నుంచి 12వ తేదీల వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కర్నా టక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళం రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా పేర్కొంది.
హైదరాబాద్ లోనూ వర్షాలు
జంటనగరాల్లో శనివారం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్న జనానికి అమాంతంగా మేఘామృతమై కురిసిన వాసతో సేదతీరారు.
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు: ఐఎండీ
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించింది. ఇక ఈశాన్య భారతంలోని అన్ని ఏడు రాష్ట్రాల్లో జూన్ 12 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో జూన్ 12 వరకు వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేసింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావం పశ్చిమ తీర ప్రాంతాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కర్నా టక తీర ప్రాంతాలు, కేరళ, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా పలురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా రాష్ట్రాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో గత కొన్ని రోజులుగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తగ్గాయి. శుక్రవారం దిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణ స్థాయి కంటే 4.2 డిగ్రీలు తక్కువ. కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
తొలకరి పలకరింపు
- Advertisement -
- Advertisement -



