జూన్ 16, 17న గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో చర్చాగోష్టులు : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వీబీజీ రామ్ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ పాత చట్టాన్ని కొనసాగించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర కమిటీ సమావేశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులతో చర్చించకుండా ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబీజీ రామ్ జి చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. కొత్త చట్టం పేదల పని హక్కును నాశనం చేసేదని ఆందోళన వ్యక్తం చేశారు. 90శాతం కేటాయించే నిధుల్లో 60 శాతం ఇవ్వడం వల్ల రాష్ట్రాలతో పాటు కూలీలు కూడా నష్ట పోతారని అన్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఉదయం, సాయంత్రం ఫోటోల పేరుతో కూలీలను వేధించడం ఆపాలని డిమాండ్ చేశారు.
కొత్త చట్టాన్ని కేంద్రం ఏక పక్షంగా అమలు చేయాలని చేసే ప్రయత్నాలకు నిరసనగా ఈ నెల 17న ఢిల్లీ కేంద్రంగా ప్రజాసంఘాలు మేధావులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే జూన్ 16,17న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో చర్చా గోస్టులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బి పద్మ, పొన్నం వెంకటేశ్వరరావు, కొండమడుగు నరసింహ, ములకలపల్లి రాములు, పెద్ది వెంకట రాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి నారి ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, సాంబశివ, నరసింహులు, వెంకటయ్య, శశిధర్, సమ్మయ్య, ఆవుల వీరన్న, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పాత చట్టాన్ని కొనసాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



