పోలీసుల అదుపులో తొమ్మిది మంది..
భారీగా సొత్తు రికవరీ
జవహర్‌నగర్‌లో వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి చోరీ : మల్కాజిగిరి కమిషనర్ బి.సుమతి వివరాలు వెల్లడి
నవతెలంగాణ-బేగంపేట్
నమ్మకంగా ఇంట్లో పనిలో చేరి ఆపై యజమానులకే మత్తుమందు ఇచ్చి కాళ్లు, చేతులు కట్టేసి ఘరానా దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర నేపాలీ ముఠాను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలించి పట్టుకున్నట్టు పోలీస్ కమిషనర్ బి.సుమతి తెలిపారు. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాల యంలో ఆమె వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్, మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సి పురం(68) ఇంట్లో వృద్ధ దంపతులు ఉంటున్నారు. దంపతులు మాత్రమే ఉంటున్నారని గమనించిన నేపాలీ కార్మికులు మీనా, రాజేష్ దోపిడీకి పథకం రచించారు. ఇందుకోసం మరో ఆరుగురు నేపాలీయులతో కలిసి ముఠాగా ఏర్పడి ఏప్రిల్ 25న సబీనా అనే మహిళను ఆ ఇంట్లో పనిమనిషిగా చేర్పించారు.
పుట్టినరోజు వేడుకల నెపంతో దోపిడీ
మే 11న మీనా పుట్టినరోజు వేడుకల పేరుతో నిందితులంతా మురళీ మోహన్ ఇంటి వెనుక ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఐదుగురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను బంధించారు. అనంతరం వారికి బలవంతంగా మత్తు పదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ప్లాస్టిక్ టేపులు, బట్టలతో కాళ్లు, చేతులు కట్టేసి బెదిరించి గడ్డపారలతో అల్మారాలను పగులగొట్టారు. 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు, 3 వేల అమెరికన్ డాలర్లు దోచుకుని పరారయ్యారు.
ఆరు బృందాలతో దేశవ్యాప్త వేట
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. లా అండ్ ఆర్డర్, ఎస్‌వోటీ, సీసీఎస్ విభాగాలతో కలిపి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 255 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, శాస్త్రీయ ఆధారాలు, వేలిముద్రల సహాయంతో నిందితులను గుర్తించారు. ఘటన అనంతరం ఆటో, స్కూటర్‌లపై పారిపోయిన నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినట్టు గుర్తించారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, లక్నో, పూణే నగరాలతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించి గాలింపు చేపట్టారు. ఐదు రోజుల్లోనే సునీత, బిస్వాల్, కమల్ బహదూర్, జంకర్ బహదూర్‌ను అరెస్టు చేశారు. అనంతరం 20 రోజులపాటు నిఘా ఉంచి ప్రధాన నిందితులు మీనా (ఏ1), రాజేష్ (ఏ2), డేనియల్ చారో (ఏ5), కిరణ్ (ఏ6)ను శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, వెండి సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మీనా, రాజేష్‌పై గతంలో మొయినాబాద్ పరిధిలో దొంగతనం కేసులు నమోదైనట్టు సీపీ వెల్లడించారు.
‘మీ సురక్ష’తో గృహ కార్మికుల వెరిఫికేషన్
ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండేందుకు మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో “మీ సురక్ష” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సీపీ తెలిపారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్లు, వాచ్‌మెన్‌ల వివరాలను పోలీసులు ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 39,270 మంది వివరాలు నమోదు చేయగా, అందులో 1,276 మంది నేపాల్ దేశస్థులు ఉన్నారని, ప్రజలందరూ ఈ భద్రతా ప్రక్రియలో పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి రివార్డులను ప్రకటించారు.



