నేల జారిన ‘మోకు’

Slipped 'knee'ఆళ్ళపొద్దుగాల్ల లేసి ఎవల పనుల్లో వాళ్ళు మునిగిపోయే వందగడపల చిన్న పల్లె. ఆ ఊరిలో బెంగుళూరు గూనపెంకలు కప్పిన ఇండ్లకన్నా తాటి కమ్మలతో కప్పిన గుడిసెలే ఎక్కువ. ఊరినిండా తాటివనం. అవే ఆ గుడిసెలకు దిక్కు. ఎటు జూసినా నింగికి నేలకి నిచ్చెనలేసినట్లుంటది. చిన్న గుడిసెలో దీపపు వెలుగుల, మబ్బులనే లేచి ఏదో పని చేసుకుంటుండు. బక్కలుచని పెయ్యి మీద ఎటు సూసిన గాయాలు, ముడుతలు పడ్డ మొకంతో కనిపిస్తుండు నారాయణ. ఊరి పక్కనే ఉన్న వాగుల గొడ్లకు నీళ్లు పట్టిచ్చి, గొడ్ల కొట్టాం సాపు చేసి అచ్చి అరుగుమీది గుంజకు ఒరిగిండు. కొడుకులు, కోడండ్లు, బిడ్డలు, మనవలు, మనవరాండ్లు అందరున్నా ఎవరికీ కానోడు. ఊరొళ్ళందరికి ఐనోడు.
ఎట్నోలెక్క భార్య మల్లవ్వతో సంసారాన్ని నెట్టుకత్తుండు. ఒగలకొగలు అన్నట్లు ఉంటరు గని ఒగలుపోతే ఇంకొకరు ఎట్లా అనే బుగులు మాత్రం ఎప్పుడు వాళ్ళ మదిల మెదుల్తనే ఉంటది. నారాయణ మనసుల ఏదో ఆలోచినలో ఉన్నడు.
అప్పుడే అటుదిక్కు అచ్చిండు ఐలయ్య. ‘నారాయణ బావా’ అని వాకిట్లో వచ్చి నిల్సున్నడు. ‘బావ ఏం చెత్తున్నవే నీతో చిన్న పనివడ్డది’ అనంగనే ‘ఏం పని’ అన్నట్లు నారాయణ కళ్లెగరేశాడు.
‘ఏం చెప్పాలే బావ గుడిసె మొత్తం నాశినమైంది. మల్ల వానలు వడితే సదురుడు కట్టమే. కొంచం తాటి కమ్మలు కోసి ఏత్తవాయే, ఇయ్యల్ల మండువా దగ్గరికి అత్త’
ఐలయ్య పేరుకు మల్లయ్యని బావా అన్నడుగని వాళ్ళది మాదిగ ఆశ్రిత కులం గోసంగి. కానీ ఊరు కలిపిన సుట్టరికం వీళ్ళది.
‘ఎందుకురా ఐలయ్య, పోయిన ఏడాదే ఏసినట్టున్నవ్‌, అప్పుడే మల్ల అడుగుతున్నవ్‌. అవునే బావ కానీ మన బతుకులంటే లోకానికేగాదు ఎలుకలకి గూడా లోకువే కదా. అంత ఆగమాగం జేసినరు. సరే ఆయిటి పూనుకునేట్లుంది. ఇయ్యల్ల మాపటాల్లకురా, కమ్మలేత్త’.
ఇదంతా వింటున్న మల్లవ్వ ‘నీకు యేడ పనిలేదు, మన పని చేయనీకి తీరుతలేదు గని మందికి పనిచేసి పెడతావ్‌. మనది మంగళారం మందిది సోమారం అన్నట్లుంది నీ కథ’.
‘ఎందుకే మళ్లి… గట్ల మాట్లడతవ్‌ గూడు లేని బతుకు ఎట్లుంటదో మనకు తెలువదా, వాన వడితే వాడు ఎక్కడుంటడే, నేనేమన్నా వాడి కోసం తాటి చెట్లు ఎక్కుతున్ననా ఏంది. నేను ఎక్కిన చెట్టుకు నాలుగు కమ్మలు కొసిఏత్త అంతే. నాకు చెప్పింది సాలుగని తెల్లారుతుంది ముందు చారు పెట్టు, తాగి తాళ్ళకుపోవాలే’.
‘సరే నేను చెప్తే మాత్రం నువు ఇంటవాగని ఇప్పుడే పెడతా’ అనుకుంట ఇంటిముందు కట్టెల పొయ్యి ముట్టిచ్చింది. నిమ్మలంగా చారు తాగి, దోతీ పైకెత్తి బుడ్డగోచి పెట్టి నడుముకి ముస్తాదు బలంగా అదిలించి కట్టిండు. జబ్బన మోకు వేసుకుని ఒక చేతుల కాళ్ళ గుయ్యి మరోచేతుల తీటి గొల అందుకుని తాళ్లదిక్కు నడుసుడు మొదలువెట్టిండు. కాయలు గాసిన కాళ్ళకి గులకరాళ్ళు గుచ్చుతున్నా ఆ బాధ తెల్తలేదు. ఎందుకంటే బతుకు పయనం భారమైనంక ఈ గాయాలు ఏం జెత్తయి. చక చకా నాలుగు తాళ్ళెక్కి కల్లు తీసి మండువాలో కూసున్నడు. ఎండకాలం పోయి వానకాలం అచ్చేటట్లుంది. కాలం కలుపుకుంటదా ఏంది? ఈ రోజైనా కల్లు అమ్ముడుపోతే మంచిగుండు. ఆళ్ళపొద్దుగాళ్ల అత్తిని. ఎంతసేపు జూసిన ఎవ్వలు లేరు. అచ్చినోళ్ళందరూ సయి సూత్తం అని చెప్పి మోతుకు దొప్పలో వాసన జూసి పోయినోల్లె గని కొన్నోడు లేకపాయే. సల్లని బీర్లకి అలవాటు పడ్డ జనం కల్లు తాగడానికి ఇట్టపడ్తలేరు. వాళ్ళని ఏమని ఏం ఉందిలే మా బతుకులంటే ఆ దేవునికి గుడ కనికరం లేకపాయే. పొద్దుగాల్లనే ఎండ గిట్లుంటే ఇంక కల్లు వేడెక్కి ఎవరు తాగుతరు, అప్పటికి ఆళ్ళపొద్దుగాళ్ళ అచ్చినా అప్పటికే ఎండయాల్ల కానే వట్టే సూరీడైనా మమ్ముల పాపం అనకపాయే అని చూస్తూ కూసుండిపోయిండు. అప్పటికి మాపటాల్ల ఐతంది. కడుపులో పేగులు, గొలకి జారే కల్లుకు ముసిరిన తేనెటీగల లెక్క సప్పుడు చేస్తున్నయి.
ఇంటికాడ మల్లవ్వేమో మొండి మనిషి ఇంకా రాకపాయే కల్లు పోలేదని తిండి గూడ మరిసిండా, సద్ది కట్టి ఎవలతో పంపాల? అని సూత్తుండగనే ఐలయ్య కనవడ్డడు.
‘అరేరు ఐలయ్య.. తాల్ల వనానికేనా పోయేది? మొండి మనిషి తిండికి రాకపాయే, సద్ది తీసుకపోరా’.
‘అయ్యో అక్క అటే పోతున్నా అంటూ సద్ది తీసుకుని కదిలిండు. మండువాలో తలపట్టుకు దీనంగా కూసున్న నారాయణని చూసి, ‘ఏందే బావ గట్ల తల్కాయ పట్టుకుంటివి. అక్క సద్ది పంపింది ముందు తిను. కల్లు అదే అమ్ముడు పోతదిలే’ అని సద్ది చేతికందించిండు.
‘లేదురా ఐలా.. ఈ ఎండలకి ఎవలత్త లేరు రా… రాత్రిరాళ్ళ దాకా చూస్తా ఇంక చేసేదేముందని సద్ది అందుకున్నడు. పొద్దుగూకి సూరీడు నేలతల్లి ఒడిలోకి జారుకుంటున్నడు. దీనికి తోడు ఆకాశాన్ని కమ్మేసినట్లు వస్తున్న మబ్బులను జూసి వాన వచ్చేలా ఉందని ‘పా..రా.. ఐలా’ అనుకుంట… తాటికమ్మల కోసం చెట్టు ఎక్కడానికి ఐలయ్యతో కలిసి ఎల్లిండు. ఎట్లనో చెట్టు ఎక్కి కమ్మలు కోత్తుండు. అంతలో భయంకరమైన గాలి ఆయిటి పూనేట్టుందిరా.. ఇంతగనం గాలి రావట్టే అనుకుంట చెట్టుమీద బగులు పడుతుండు నారాయణ. ఆ గాలికి తాటి చెట్టు ఒక్కసారిగా అటూ ఇటూ ఊగడం మొదలైంది.
నారాయణకి ఒక్కసారిగా మీది ప్రాణాలు మీదనే పోయినయి. ఆ గాలికి చెట్టుమీద నిల్సుండుడు కట్టం అని, రెండు చేతులతో తాటిమొద్దుని గట్టిగా అదిమి పట్టుకున్నడు. ఇంతలో మోకు నేలకు జారి కిందవడ్డది.
కింద ఉన్న ఐలయ్య అది జూసి ‘అయ్యో బావ పైలమే, మోకు జారిపోయే, ఎట్ల దిగుతవే. నేను వచ్చిన ఘడియ మంచిది గాదా ఏంది? గిట్లెపాయే. ఏమన్నా ఐతే మల్లవ్వ నన్ను పాణాలతో ఉంచుతదా!’
చెట్టుపైన నారాయణ మొదలిని అదిమిపట్టిండు. కొంచెం గాలి తగ్గినంక రెండుచేతులతో కొద్ది కొద్దిగా కిందకి జారిండు. కింద ఉన్న ఐలయ్య గుండె దడ మాత్రం ఇంకా తగ్గడం లేదు.
ఎట్నోలెక్క తాటి చెట్టుకిందికి దిగిండు. కానీ ఛాతీ అంతా కొట్టుకుపోయి నెత్తురు రావట్టే. ‘అయ్యో బావ నీకేం కాలేదుగా’ అని వచ్చి ఐలయ్య గట్టిక అలుముకున్నడు. ‘ఏం లేదురా ఎందుకు అంత భయపడ్తవ్‌ చిన్నగ తగిల్నై అంతే’.
‘నీకేమన్నా ఐతే మల్లక్క ఎట్లా బతుకుద్ది, నన్ను ఊళ్ళే తిరగనిత్తదా, బావ ఈ వయసుల ఇంత కష్టం ఎందుకే. ఇంకేదన్న పని సూసుకుంటే గాదా’.
‘అరేరు ఐలా.. బుద్దెరిగినసంది నాకు తెలిసిన పని ఇది ఒక్కటేరా ఇప్పుడు సావుదలకు కొత్తపనులు నేనేడ నేర్సేది కానీ, మీ అక్కకి మాత్రం ఈ సంగతి చెప్పకురా భయపడ్డది. అది నీకమ్మలకత్తే గిట్లెందంటే నామీద ఉన్న ఇదితోని నిన్నేమంటదో, నేనే ఏదో చెప్తాలే’.
ఇలా మాట్లాడుకుంటున్న కొంచెం సేపటికే వాన మొదలైంది. ఇద్దరు పోయి మండువాలో కూసుని ఇంకా కాలం కలుపుకున్నట్టే ఉంది వాన గట్టిగనే దంచుతుంది కదరా అని ముచ్చట్లలో పడ్డరు.
ఉరుములు, మెరుపులకి తోడు, గాలి బీభత్సంతో వాన ఇసిరి ఇసిరి కొడుతుంది. ”బావ.. ఈ పిడుగులు పడ్డప్పుడల్ల నిదురుండదు. రాతిరి ఎక్కడ మన గుడిసెలమీద పడతదో అని ఒకటే భయం’.
‘అరేరు ఐలయ్య మన ఊరి సుట్టూ పెద్ద పెద్ద తాల్లు ఉన్నరు. అవి ఉండగా ఊరిలో పిడుగులు పడరు రా. ఎందుకంటే పిడుగు ఎప్పుడు ఎత్తున్న చెట్లమీదనే పడతయి. మన ముందోళ్ళు మంచి తెలివికల్లొల్లు అందుకే ఊరికి అవతల చుట్టూరా చెట్లని కాపాడిర్రు’.
‘అవునే బావ, ఎన్నోసార్లు తాటి చెట్లమీద పిడుగులు పడటం నేను గూడ జూసిన, అప్పుడు తెల్వలే ముచ్చట ఇదంటావా అసలు కథ’.
పొద్దుగూకింది వర్షం కొద్దిగ తగ్గినట్టెంది. సైకిల్‌ మీద కమ్మలు పెట్టుకుని ఐలయ్య, మల్లయ్య ముచ్చట్లు పెట్టుకుంట ఇంటి దారి పట్టిండ్రు. ఇంట్లకి పోంగనే మల్లవ్వకి తెల్వకుండ తిని పడుకున్నడు. రాత్రంతా ఒకటే పిడుగులు, బోరున వర్షం. రోజులెక్కనే మబ్బుల లేచి ఇంటిపనుల్లో మునిగింది మల్లవ్వ. కానీ ఇప్పటికి లేవాల్సిన మనిషి లెవ్వకపాయే అని లేపడానికి వెల్లి పిలిస్తే ఉలుకులేదు పలుకలేదు. ఏమైందో అని భయంతో దగ్గరగా వెళ్ళి చూస్తే, పెయ్యి నిండా దెబ్బలు. అవి జూసి మల్లవ్వ గుండె ఝల్లు మంది. ఆ గాయాలని చూసి… ‘ఏమైందయ్యా.. ఈ దెబ్బలేంటి?’ అని బోరున శోకం పెట్టింది. నారాయణ లేచి ‘ఏం లేదు, మండువా దగ్గర కాలు జారిందని చెప్పి, ఇంత పొద్దుగల్ల పొద్దుగల్ల శోకం ఎందుకే’ అని అదిలించి, ముందు ఇంట్ల పనికానీరు. మల్ల ఎప్పుడు వాన పడతడదో తెల్వది. తొందరగా తాల్లకి పోవాలె ఇయ్యల్ల ఈదులు కొయ్యాలే, కమ్మలకి ఎరుకలి కనుకడు అత్త అన్నడు’ అని తన పనిలో తాను మునిగిపోయిండు.
మొండి మనిషి. గింత దెబ్బలతో పని చెయ్యవట్టే. కడుపున పుట్టినొల్లు సక్కగుంటే ఈ బాధలు ఉండేనా? మా గాశారం అట్లుండే ఏంచేద్దాం. పొద్దున్నే ఇంత తిని, మోకు కట్టి తాల్లకి బైలెల్లిండు. అప్పటికే ఎరుకలి కనుకయ్య ఎదురుసూత్తుండు.
‘ఏందే మామా… ఇంత నిమ్మళంగ రావడ్డివి, నేను మబ్బులనే వచ్చి కూసుంటి’.
‘అరేరు ముసలి బువ్వ చేసేసరికి గీ యాల్లెంది. ఐనా ఎంత సేపు కోత్తం రా.. అని ఇద్దరు కలిసి రెండు గంటల్లో ఈదుమొత్తం సుట్టువట్టి కమ్మలు కోసి మోపు కట్టిండ్రు.
‘సరే మామా నేను పోత గని, పొద్దుగూకేటాళ్ళకి నేనత్త. రెండొందల కల్లు ఉంచు మర్సిపోకు. ‘
‘సరే రాపోరా.. అట్నె నార దీసి ముసలిదానికి ఒక చీపురు పట్టుకరా..’
‘సరేనే..’ అంటూ సైకిల్‌పై ఈత మోపుతో ఎల్లిపోయిండు.
ఆ మరునాడు మళ్ళీ ఆకాశం అంతా మబ్బులతో నిడిపోయింది. లేవంగనే ఈ వాన ఇయ్యాల్ల తాళ్ళు ఎక్కనిత్తదా? అని మనసులో అనుకుంటూ, కత్తి తీటీగొలమీద నూరుతూ ఆలోచిస్తున్నాడు. అంతే అంతలో కత్తి పట్టు జారి చేతివేలు తెగి నెత్తురుకారింది.
మల్లవ్వ ‘అయ్యో… ఏం దరిద్రమో గిట్లాయే. జర పైలంగుంటే ఏంది?’ అనుకుంట పసుపుదెచ్చి వేలుకు అద్దింది. మల్లవ్వ నారాయణని అద్దని చెప్తున్నా ఇనకుండ తాళ్ళకు పోయిండు. మల్లవ్వకి మాత్రం మనసు మనసుల లేదు.
ఏంది గిట్లాయే అని రంది పెట్టుకుంది. అంతలోనే ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. అయ్యో! ఈ మనిషి ఎక్కడున్నడో ఏమో? వానకి ఎట్ల అత్తడో ఏమో అని సూత్తుంది. వాన మొదలుగాంగనే రోడ్డు పక్కనున్న తన మండువాలో కూసున్నాడు. కొంచం సేపటికే ఎదురుంగ, కొంత దూరంలో ఎవరో బండిమీద పోతూ వానకి పక్కన తాటి చెట్టుకింద ఆగిర్రు. ఒకదిక్కు పిడుగులు, మరోదిక్కు వాన. వాళ్ళని రమ్మని పిలిచి మండువాలో కూసొమని చెప్పి, పిడుగులతో వాన వచ్చినప్పుడు చెట్లకింద, అందులో తాటి చెట్లకింద అసలే ఉండద్దు బిడ్డా అని చెప్పిండు.
అప్పుడు వాళ్ళు సరే అని మండువాలో కుసుంటూ… ఎందుకే బాపు గట్ల! పిడుగు ఎక్కడైనా పడ్తదికదా. దానికి అక్కడ ఇక్కడ అని ఏముంది.
అవును బిడ్డా కానీ ఎత్తున్న చెట్లమీద పిడుగులు ఎక్కువ పడ్డయి బిడ్డా. తాటి చెట్లు ఎత్తుంటయి గదా, అందుకే ఆటిమీద ఎక్కువగా పడతయని ఇటు రమ్మన్న బిడ్డ. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కొంచం సేపటికే ఆ తాటిచెట్టుపై పిడుగు పడింది. భగ్గున చెట్టంతా కాలిపోతుంది. అది చూసిన వాళ్ళకి ఒక్కసారిగా పాణం ఝల్లుమంది. బాపు ఆ దేవుడే నిన్ను పంపిండు. ఈ రోజు మా పాణం కాపాడినవ్‌ అని కండ్లనీళ్లు తెచ్చుకున్నరు.
అదేముంది బిడ్డా, మనకు తోచింది చెయ్యాలే, అంతా ఆ భగవతుండే సూసుకుంటడు. కొద్దిసేపటికే వర్షం తగ్గింది గానీ, మబ్బులు మాత్రం అట్నే ఉన్నయి. సమయం తెలియనట్లుగా దట్టమైన చీకటి కమ్ముకుని ఉంది. మాటల్లో పడి వర్షం తగ్గిన విషయాన్నే మరిచిపోయిండ్రు. ఇంతలో నారాయణ తెలివికచ్చి ‘బిడ్డా ఇట్ల కూసొర్రి. అగో అట్ల కనిపించే చెట్టు నాదే. ఎక్కి ఇంత కల్లు తెత్తా తాగిపోదురు. ఈ వర్షానికి ఎవ్వర్రారు, కనీసం మీకన్నా పోత్త’ అని వెళ్తుంటే, అయ్యో! బాపు వర్షం తగ్గింది గానీ చెట్టు ఆరినట్లు లేదు కొద్దిగ ఆగి పోరాదే’.
‘బిడ్డా మల్ల వాన ఎప్పుడు పడతదో తెల్వది. పొద్దున మెర తప్పిపాయే, ఇప్పుడన్నా మెర పెడితే గొల దక్కుతది. లేదంటే గొల సత్తది కల్లు పడది’.
‘కానీ చెట్టు ఆరకపోతే ఏమన్నా ఇబ్బంది కాదా మరి…’
‘ఇన్నెడ్లసంది ఎక్కుతున్నా ఇగ పానం కోసం చూస్తే, రేపు బతుకు సాగది బిడ్డా’ ముందుకు నడిసిండు. చెట్టుపైకి ఎక్కుతుండగా కాలు ఆగడం లేదు, పదన ఎక్కువున్నట్లుంది. మెల్లగ సూసుకుంట ఎక్కాలి అని మనసులో అనుకుంటుండు. ఏలాగోలా ఎక్కి కల్లు కుండలో పోసుకుని దిగుతున్నడు. తాడి చెట్టు సరిగా ఆరకపోవడంతో ఒక్కసారిగా కాలు జారగానే ‘మోకు నేల జారింది’. అంతే ఏం జరుగుతుందో తెలిసేలోపే క్షణాల్లోనే నేలపై పడి రక్తపు దారలలో నెత్తురు ముద్దెపోయాడు. మండువానుండి చూసిన వాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ జరిగింది చూసి ఒక్కసారిగా కాలుజేతులు ఆడుతలేవు లోకమే ఆగినట్టయింది. కొంచం ఆగినంక తేరుకుని ‘అయ్యో! మా ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు వదిలిండే’ అని గుండెలవిసిపోయేలా ఏడిసిర్రు. ఏం జేయాలో తెలియక ఆగం ఆగం అయితుర్రు.
చుట్టూ ఉన్న గౌడులని కేకలేసి పిలిసిండ్రు. కానీ అప్పటికే నారాయణకి ఈ భూమ్మీద నూకలు తీరినయి. ఈ విషయం తెల్వంగనే మల్లవ్వ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అంతే ఇన్ని రోజులుగా ఒకరుపోతే ఇంకొకరు ఎట్లా బతుకుడు అనుకుంట ఉండేటోళ్ళు గని, చావు కూడా వాళ్ళ బంధాన్ని వీడదీయలేక పోయింది. ఊరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారి చావు ఊరందరిని శోకసంద్రంలోకి నెట్టింది. ఊరందరిలో మంచివాడు అనిపించుకున్న నారాయణ ఇక లేడు. ఇందరి మనసుల్లో అభిమానం సంపాదించిన నారాయణ, తనవాళ్ళకి మాత్రం కానివాడే అయ్యాడు.
– డా. బండారి ప్రేమ్‌ కుమార్‌, 9492788752

Spread the love