అగ్రిమెంట్‌

అగ్రిమెంట్‌ఒకప్పుడు అది వెలివాడైనా, నేడు నాగరికత నవనిర్మాణ సౌదాలకు వేలాడదీసిన దిష్టిబొమ్మలాగా నగర నడిబొడ్డున బొడ్రాయి వేసుకుంది ఐదు పదుల ప్రాయాన్ని మోస్తున్న పేదలవాడ.
అర్ధాకలితో పేగులను ముడి వేసుకొని జయ అమ్మ నాయనలు ఆడపిల్లకు చదివెందుకని పలువురు పలువరించినా, అవేవీ పట్టించుకోకుండా నేటి అంటరాని ఈ ఆడపిల్లే రేపు వెలువాడల వేగుచుక్క కాగలదని కాలజ్ఞానాన్ని నమ్మి ముందడుగు వేశారు జయ తల్లిదండ్రులు. వారిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరిలో అణచబడుతున్నా, గోడకు బలంగా కొట్టిన బంతి లెక్క వేగం పుంజుకుని జీవితాన్ని నిలదొక్కుకుంది జయ.
నాగరికత నడుముకు చుట్టుకున్నట్టు జీన్‌ ప్యాంట్‌ వేసి, జేబులో ఒక డబ్బా సెల్లు వేసి చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ తల అటూఇటూ పంపిస్తూ నడుస్తున్న పెద్ద మేతరి వీరయ్య కొడుకు నారయ్య జబ్బకు డప్పు తగిలించి, ఏడో తరగతిలోనే చదువును చంకదించి ఎత్తి అవతలపడేసి నవతరపు నాజోకులు తలకెత్తుకుని డడ్డనక….డం….డడ్డనక డం….డం… అంటూ చిటికెన పుల్ల డప్పు పై దరువులు వేస్తుంటే ”ఇన్నో లేవలో… ఇననో ల్లేవలో…. అందరూ ఇనుడ్లీ…. వచ్చే ఆదివారం నాడు వండకదిన పోవాలని గూడెం పెద్దలు చెప్పిండ్లుళ్ళో…. రానోళ్లను కులముల కెళ్ళి ఎలేత్తరాటుళ్ళో…. డడ్డనక…. నకా..నకా… డడ్డనకా నకా…నకా…” డప్పు ముగిస్తూ వెళ్తున్నాడు నారయ్య.
అప్పుడే పాల బాటిల్‌ పట్టుకొని విజయవాడలో ఇంటికి వచ్చిన నాగేష్‌ ”అక్కా మీరు ఎల్లుండి వండక తిన వస్తలేరా…!” అన్నాడు పాల బాటిల్‌ జయ చేతికి అందిస్తూ.
”వంటలకు అప్పుడే పోయినాము కదా తమ్మి, మళ్ళీ వంటలకు వెళ్లడం దేనికి” అంది జయ ఖాళీ బాటిల్‌ నగేష్‌ చేతికి అందిస్తూ.
”గదేందక్క ఏం తెలవనట్టు గట్ల అనబడితివి, రాత్రి నారిగాడు డప్పుసాటింపు ఏసిండు కదా వినలేదా” అన్నాడు ఆశ్చర్యంగా.
”అదే తమ్మి నాకు అర్థం కాకనే నిన్ను అడుగుతున్నా. ఎందుకు అంది” రెట్టింపుగా జయ.
”అదే అక్క.. నిన్న మన కులపు పెద్ద మేతర్లందరూ పంతులు గారి తానికి పోయిండ్రు. పంతులుగారు ఊరికి కీడు వచ్చిందని చెప్పిందట” అన్నాడు నాగేష్‌.
”కీడేంటి తమ్మి” అంది ప్రశ్నార్థకంగా జయ.
”అరే అక్క గింత సదువు సదువుకున్నవు…. నీకు కీడు అంటే ఏందో తెలవదా….!” అని తల గోక్కుంటూ ”అరె అక్క గీ మజ్జల మన గూడెంలో ఎంతమంది సచ్చిపోయిండ్లో నీకు ఎరుకైతలేదా… పడుచు పడుచు పోరగాండ్లు ఎందరు పీనిగలెళ్లినరు. గా… రాణి గాడు సచ్చి నెల కూడా ఎళ్ళకముందే గాని నాయన సచ్చి గా… ఇంట్లోనే రొండు సావులయినరు. అరే ఏం తెలవనట్టు గట్లడుగుతున్న వేందక్కా…” అన్నాడు ఒకింత ఆశ్చర్యంగా ముఖం పెట్టి.
”హా తెలుసు. అయితే ఏంటి? ఊరన్నాక జనాలు ఉండరా, జనాలన్నాక చచ్చిపోరా… తమ్మి?” అంది జయ నాగేష్‌ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ.
”యే… ఏమో… పో….అక్క. మీ సదువుకున్నోళ్లతోని మేమేడ మాట్లాడలేత్తం కానీ.. ఎల్లుండి అయితే అందరి తోటి వండక తిననైతే రాండ్లీ… నలుగురితోటి నారాయణ. కులం తోటి గోవింద అనాలి కదా అక్క…. అందరం పోతున్నాం, మీ ఒక్క ఇల్లు రాకుంటే మిమ్ములను కులం నుంచి ఎలేత్తరు. ఓ… జయక్క యాది మరువకు…!” అనుకుంటూ వెళ్లిపోయాడు నాగేష్‌.
‘ఇంకెప్పుడు మారుతారు వీళ్ళు’ అని మనసులోనే ఒక నిట్టూర్పు తీసి ఇంటి పనిలో నిమగం అయ్యింది జయ.
ఉదయాన్నే వాకిలి ఊడుస్తున్న జయను చూసి ”వాకిలి ఊడ్వొద్దు జయా… తొందరగా బయటికి ఎళ్లు అందరూ ఎళ్లిపోయిండ్రు… మీ అన్న కోడిని తెత్తనని పోయి అటే పోయిండు. ఇంత పొద్దు ఎక్కింది జల్దిన రాండ్లీ….” అనుకుంటూ వంట సామాన్లు సరిదిన గంప నెత్తుకుని వెళుతుంది జయకు వదిన వరుస అయ్యే రాజమణి.
వంటలకు వెళ్లి వచ్చిన తెల్లవారి గూడెం నడిబొడ్డున సవర్లచ్చమ్మ గుడి దగ్గర శాంతి పూజకు ఏర్పాట్లు చేశారు కుల పెద్దలు. స్కూలుకి వెళ్లడానికి హడావిడిగా తయారవుతుంది జయ.
”బావా ఓ బావా…” అంటూ పెద్ద మేతరి చిన్న కొడుకు శ్రీనుతో పాటు ఇంకా ఇద్దరు యువకులు వచ్చారు. న్యూస్‌ పేపర్‌ చదువుతున్న స్వామి వెళ్లి గేటు తీసి ”ఏందో శ్రీను దారితప్పి వచ్చినవు” అన్నాడు నవ్వుతూ.
‘ ‘ఏ…. గట్లంటవేంది బావా…” అంటూ ఒక వెకిలి నవ్వు విసిరాడు శ్రీను. ”అది కాదోరు… పండగ మామూళ్లకో… వినాయకుని చందాలకో… తప్ప ఇంకెప్పుడూ ఇటుపక్క కనబడవు కదా… ఇప్పుడు పండుగలు ఏమీ లేవు కదా. మబ్బు లేని వానలా ఏదో పని లేనిదే నువ్వు రావు కదా….” అన్నాడు స్వామి చనువుగా.
‘యే….నీ పరాషికానికేంది కానీ… మా అక్క ఏం చేస్తుంది బావా నౌకరికి పోయిందా ఏంది ఇంత పొద్దుగాలనే…” అన్నాడు శ్రీను ఇంట్లోకి తొంగి చూస్తూ.
‘పోలేదు పోలేదు.. తయారవుతుంది” అంటూనే ”జయా… మీ తమ్ముళ్లు వచ్చారు టీ తీసుకురా” అంటూ కేక వేశాడు స్వామి.
”ఒద్దొద్దు బావా… ఇప్పుడు అంత టైం లేదుగానీ జల్దిన నువ్వూ, అక్క్కా సవర్లచమ్మ గుడి కాడికి రండి. అక్కడ గూడెం గూడెం పూజలు చేస్తుంటే మీరేంది ఇంట్లోకి వెళ్లి బయటికి రావట్లేదు నిన్న సుత వండక తిన రాలేదు. నీ మీద అందరూ గరం గరంగా ఉన్నరు. ఊరికి కీడు వచ్చిందంటే ఇంత బుగులు లేదు.. ఎంత చెప్పినా చెవి మీద పేను బారట్లేదు మీకు…” అంటూ గొంతులో ఆవేశాన్ని నింపుకున్నాడు శ్రీను.
”కీడు లేదు ఏం లేదు మేం అలాంటివి నమ్మం” అన్నాడు స్వామి తెగేసినట్టు. ”అయితే మిమ్ములను పెద్ద మేతర్లు పిలుసుకొని రమ్మన్నారు. ఆడికి వచ్చి మాట్లాడండి” అన్నాడు శ్రీను కొంచెం దవాయింపుగా. ”మేమెందుకు వస్తామోయి మేం రాం…” అన్నాడు స్వామి లోపల నుండి తన్నుకొస్తున్న ఆవేశాన్ని తమయించుకుంటూ.
‘అయితే గూడెంలో ఇల్లు ఎందుకు పట్టుకున్నారు అన్నాడు” శ్రీను ఆవేశంగా.
”అంటే ఈ ఊరేమన్నా మీరు కొనిపెట్టిండ్రా” అన్నాడు స్వామి కోపంగా.
”మీ రాగండి” అంటూ బయటకు వచ్చిన జయ ”మనం అందరిలోకి వెళ్లి మాట్లాడుదాం రండి…” అంది కాళ్లకు చెప్పులేసుకుంటూ.
అందరూ కలిసి జనాల మధ్యలోకి వెళ్లారు. టెంట్‌ కింద హోమం ముందు మంత్రాలు చదువుతూ పంతులు, హోమం చుట్టూ ముందు వరుసలో పెద్దమనుషులు, వారి వెనుక వరుసలో మిగిలిన పురుషులు, ఆఖరి వరుసలో ఆడవాళ్లు, పిల్లలు కూర్చొని ఉన్నారు. జయ, స్వామిను చూడగానే అక్కడున్నవాళ్లు ”రండి రండి నాయన రండి…. ఇప్పటికే ఆలస్యం అయ్యింది పూజ కూడా అయిపోయింది. మీరు పూజలో కూర్చొని ఉంటే మీ మీద ఉన్న కీడు తొలిగిపోయేది కదమ్మా….” అన్నాడు పంతులు జయ వైపు చూస్తూ ఒక కింత విసుగ్గా.
‘ఇప్పుడు ఇక్కడ పూజలో కూర్చున్న వారందరి మీద కీడు తొలిగిపోయినట్టే నా పంతులుగారు” అన్నాడు స్వామి నిష్ఠురంగ.
”అంతేగా….” అన్నాడు పంతులు కుల పెద్దల వంక ఒరగంట చూస్తూ. ”అంతే…. అంతే…. మరి పంతులు ఎట్లా చెప్పితే అట్లనే. ఇప్పుడు గూడెంలో ఉన్న అందరం వంటలకు పోయినం. పూజలో కూకున్నం… మీ ఒక్క ఇంటోల్లే రాలేదు. మీ కీడు పోలేదు ఇప్పుడు ఎట్లా…. ఊరంతా ఓ దారైతే చదువుకున్నమని చెప్పి మీదో దారాయే… అందుకని మిమ్ములను పంచాయతీలకు గుంజినం” అన్నాడు పెద్ద మేతరి అందరు వైపు చూస్తూ.
”అయితే ఏంది ఇప్పుడు? మేం రాకపోతే మా కీడు మాతోనే ఉంటుంది కదా. మీకు కీడు అయితే పోయింది కదా. మరి మళ్లీ పంచాయతీ ఏముంది” అంది అందరి వైపు తిరిగి చూస్తూ.
”పంచాయతీ ఎందుకంటే ఎట్లా అక్క. మీ కీడు మీతోనే ఉంటే మాకెందుకు బాధ మీ కీడంతా మల్ల ఊరందరి మీద పడితే ఏం చేయాలి? కులం కట్టడి అంటే కట్టడి మీదనే ఉండాలె కదా… ఇంటికి రొండు వెయ్యిల రూపాయలు జమ చేసి శాంతి పూజలు చేయించిందంతా మీరు చేయబట్టే అంతా ఉత్తదే అయింది. మిమ్ములను కులం నుంచి ఎలేసుడే ఇంకా ఆగేదే లేదు…” అన్నాడు గుక్క తిప్పుకోకుండా శ్రీను.
”ఎట్టెట్టా…. మేం పూజలో పాల్గొనకపోతే మా కీడు మీ మీద పడుతుందా? మరి మొత్తం ఊరంతా వంటలకు గాని, పూజకు గాని రాలేదుగా. మరి ఊరందరినీ ఊరు నుండి వేలేస్తారా…!” అన్నాడు స్వామి తనను తాను తమాయించుకుంటూ.
”అరే…. గట్టెట్ట బావా…. ఊరందరి ముచ్చట మనకెందుకు. మన గూడెంలో మన కులపోళ్లకే కీడు..” అన్నాడు ప్రపంచంలోని విషయాలన్నీ తనకే తెలుసు అనుకునే ఎంకటి.
”కేవలం మన మాదిగ కులం వాళ్లు, మన గూడెం వరకే ఎందుకుంటుంది కీడు? మన గూడెంలో వేరే కులం వాళ్లు కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారుగా. మరి వాళ్లు కూడా ఈ ఊరిలో భాగమే కదా…” అంది జయ విస్మయంగ.
”మన గూడెంలోనే నెలకొక్కడు పిట్టలోలే లేచిపోతుండ్రు. ఇంకా పదిమంది దాంక మంచాన పడ్డారు అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఉన్నాయి వాళ్ల ప్రాణాలు. మీకేమో మా బాధలు చాదస్తంగా కనబడుతున్నాయి. ఎంత చదువుకున్నోళ్లు అయితే మాత్రం గింత అద్వానంగా వాదిస్తుండ్రేంది బిడ్డ” అన్నాడు పెద్ద మేతరి ఒకంత విచారంగా.
”మేం చదువుకున్న వాళ్ళం కాబట్టే వాస్తవాలు మాట్లాడుతున్నాం బాబారు” అంది జయ అందరి వైపు పరికించి చూస్తూ.
”ఏం వాస్తవమో ఏందో. అందరూ మీరు చెప్పింది వినాలంటే ఎవ్వరూ వినరిక్కడ. మేం కులమంతా ఒక్క కట్టడిగా ఉంటే మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు” అన్నాడు ఎంకటి ముఖం కందగడ్డల మార్చుకుని.
”ఇష్టం వచ్చినట్టు కాదు, మేం చెప్పేది నిజం…! నిజం మాత్రమే చెపుతున్నాం. చనిపోయిన వాళ్లంతా యువకులు నడీడు వాళ్లే. మేం కాదనడం లేదు, కానీ… ఎలా చనిపోయారు…. ఎందుకు చనిపోయారు…. అనేది మాత్రం మీరు ఆలోచించరు. వారందరూ చనిపోయింది మీరు నమ్ముతున్న కీడు వల్ల మాత్రం కాదు” అంటూ ఒక్క నిమిషం ఆగింది జయ.
‘కీడు కాక మరేంటి’ అన్నట్టు గుర్రుగా చూస్తున్నారు అందరు.
చనిపోయిన వారందరిలో వివిధ రకాల జబ్బుల వల్ల కొందరు, రాత్రింబవళ్లు తేడా లేకుండా సారాయి తాగి టైం కు తిండి తినకుండా బీడీ, సిగరెట్‌, పాన్‌ పరాక్‌, గుట్కాలు తింటుంటే ఆరోగ్యాలు పాడుగాక మరేం అవుతుంది. ఒంట్లో కొంచెం సుస్తీ చేయగానే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్కు చూపించుకోకుండా ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించే వరకు చేతబడులని, మంత్రాలని, తాయత్తులని బాగు చేయించుకోవడం, తిప్పి పోయాడాలు, వన భోజనాలు, శాంతి పూజలు, హోమాలు అంటూ మూఢనమ్మకాల ముసుగులో మునిగిపోతుంటే మనుషుల ఆరోగ్యాలు క్షీణించి పోక బాగుపడతారా…! నేను, నా భర్త ఎన్నిసార్లు మిమ్మల్ని చైతన్యం చేయాలని చూసినా మా మాట వినకపోగా పైపెచ్చు మమ్మల్ని శత్రువులుగా చూస్తూ, అవకాశం దొరికితే మా మీద లేనిపోనివి మోపి గొడవలు చేసి రివేంజ్లు తీర్చుకోవాలని ఎన్ని సార్లు చూడలేదు? మీరెన్ని కుట్రలు చేసినా మీ అమాయకత్వాల్ని చూసి జాలిపడ్డాం కానీ ఇకమీదట మీ మూఢనమ్మకాలు, కట్టుబాట్లు మా మీద రుద్దితే మిమ్మల్ని సమర్థించేదే లేదు….” అంది జయ తెగేసినట్లు.
‘యేహే.. గాళ్లతోటి ముచ్చటేంది?’ అంటూనే ”ఇగో సామి.. మీరు మా మాట లెక్క చేయట్లేదు. మీ కర్మ మీరే అనుభవిస్తారు. వారం తిరగకుండానే మీకే ఏదైనా కీడు జరుగుద్ది. అప్పుడు మీరే ఏడుస్తరు’ అన్నాడు ఇంకులు పూజారి వైపు ఓరగంట చూస్తూ.
”కీడు జరగవచ్చు అని నిమ్మలంగా అంటావేంది నాయనా.. తప్పకుండా జరుగుద్ది…” అన్నాడు వెకిలిగా నవ్వుతూ పూజారి.
”అదేం జరగదు. మేం అదేం నమ్మం. ఒకవేళ జరిగితే అది ప్రమాదం, అనారోగ్యం వల్లనో అనుకుంటాం తప్ప మీరు అనుకుంటున్న కీడు వల్ల కాదు…” అన్నారు స్వామి దంపతులిద్దరూ ఒక్కసారే. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం. మానవుడు అంబరాన్ని చుంబిస్తూ చంద్రమండలాన్ని చుట్టేసి వస్తున్నాడు. కంప్యూటర్‌ యుగంలో ఉండి మూఢనమ్మకాలతో ముందుకు పోకుండా తిరోగమనం పాలు కావడం కడుసోచనీయం. సైన్స్‌ ఎంతో అభివృద్ధి అయింది. ఆధునిక వైద్య పరికరాలతో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలతో వైద్యం అందుబాటులో ఉంది. అయినా మీరు ఈ మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అనవసరమైన వాటికి అధిక ఖర్చులు పెట్టి, అప్పుల్లో కూరుకొని, ఉన్న ఇల్లు వాకిళ్ళను కూడా అమ్ముకొని నిలువ నీడ లేకుండా చేసుకుంటున్నారు..” అంది బాధతో కూడిన ఆవేశంతో జయ.
”ఓ… జయమ్మా.. నీ ఇంట్లో వారం తిరగకుండనే ఏదో ఒక చెడు జరిగితే నీకు అప్పుడు తెలుస్తది. గ్యారెంటీగా జరుగుద్ది నేను అగ్రిమెంట్‌ రాసిస్త. మీ ఇంట్లో కీడు జరగకపోతే ముక్కు నేలకు రాస్త. మరి కీడు జరిగితే నేను చెప్పినట్టు ఈ ఊరు మా గూడెం వదిలిపెట్టి పోతారా…” అన్నాడు ఎంకటి కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ రోషంగా.
”ఊరు వదిలిపెట్టి పోవాలా…” అంటూ వారి అమాయకత్వపు మాటలకు లోలోపలే నవ్వుకుంటూ, ”సరే ఎంకటి నువ్వు చెప్పినట్టే వింటాం. కానీ మరి మన గూడెంలో మా ఇంట్లో తప్ప ఇంకెవరికి ఏ కీడు జరగదుగా…” అన్నాడు స్వామి చిరునవ్వుతో.
”జరగదు గాక జరగదు. మేం పంతులు చెప్పినట్టు వంటలకు పోయినం, శాంతి పూజలు చేయించి కీడంతా పోగొట్టుకున్నం” అన్నాడు శ్రీను ఒకింత గర్వంగా.
”అయితే మా ఇంట్లో తప్ప మీ అందరి ఇండ్లలో ఎవరింట్లోనైనా ఎలాంటి చెడైనా జరిగితే…” అంది ప్రశ్నార్ధకంగా శ్రీను వైపు చూస్తూ జయ.
”ఏంది అక్క అడ్డంగా వాదిస్తున్నవ్‌… అగ్రిమెంట్‌ రాస్తే ఓడిపోయి ఊరి నుండి వెళ్ళిపోవాలని భయపడుతున్నావా..” అన్నాడు శ్రీను గర్వంగా చూస్తూ. ”అదేం లేదు శ్రీను. మేం ఓడిపోతే మేమే ఊరును విడిచి వెళ్ళిపోతాం. కానీ మీరు ఓడిపోతే మేం ఏది చెప్పినా వింటారా…” అన్నాడు స్వామి నిచ్చలమైన చూపులు అందరి వైపు సారిస్తూ.
”మీ మాట అంటే మమ్ములందరిని ఊళ్ళో కెళ్ళి వెళ్ళగొడతారా ఏంది…” అన్నాడు పెద్ద మేతరి అనుమానంగా. అనుమానం ఎందుకు చిన్నాయనా. వాళ్లే ఓడిపోయి ఊరిడిసి వెళ్లిపోతరు. మనం పంతులు చెప్పినట్టు అన్ని చేసినం కదా, మనకు భయం ఎందుకు” అంటూ ‘ప్రతిరోజు వీళ్ళు ఊరిని ఉద్ధరించే మాటలు మనకు చెపుతారు’ అంటూ చిన్నగా పెద్ద మేతరి చెవిలో ఊదాడు ఎంకటి.
అయితే అగ్రిమెంట్‌ రాసుకుందాం అని, వారం టైంలో ఇంట్లో ఏదైనా కీడు జరిగితే జయ కుటుంబం ఊరు వదిలిపోయేటట్టుగా, అలా కాకుండా, గూడెంలో ఎవరికైనా ఏమైనా జరిగితే జయ చెప్పినట్లు గూడెం వాళ్ళు వినాలని అగ్రిమెంట్‌ రాసుకున్నారు.
ఈ వారం రోజులు గడిస్తే జయ దంపతులను ఊరి నుండి వెళ్లగొట్టే శుభ ఘడియల కోసం తహతలాడుతున్నారు గూడెం వాళ్ళు. ఈ విధంగానైనా తన వాళ్లలో మూఢత్వాన్ని పారద్రోలి వారి బతుకులు బాగు చేయాలనే తపనతో జయ దంపతుల ఆలోచనలతో రెండు రోజులు గడిచాయి. మూడవరోజు అర్ధరాత్రి ఒక్కసారిగా కుక్కలు మొరుగుతున్నాయి. ఏడుపులు పెడ బొబ్బలు వినపడుతున్నాయి. గూడెం నడిబొడ్డున ఉన్న పెద్ద మేతరి కొడుకు ఉపేందర్‌ చనిపోయాడు. మద్యం తాగి తాగి సరైన భోజనం చేయక టీబీ బారిన పడి, లోపల అవయవాలన్నీ దెబ్బతిని ఎముకల గూడుగా మారిన ఉపేందర్‌ బతుకుకో భరోసా ఇచ్చాడు పంతులు శాంతి పూజతో.
తెల్లవారి అంతిమ సంస్కారాలు ముగించుకొని అందరూ ఇళ్లకు చేరకముందే మైసయ్య కోడలు చంద్రమ్మ చనిపోయిందని వార్త విన్న గూడెం వారందరూ దు:ఖ సముద్రంలో మునిగిపోయారు. ఇద్దరి ఇళ్లల్లో దశదినకర్మలు అయిపోయే వరకు జయ దంపతులు వారికి సహాయ సహకారాలు అందించారు.
”జయా… ఇదేంది బిడ్డా…. ఇట్లయింది… ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుని పంతులు చెప్పినట్టు చేసినం” అంటూ తల పట్టుకున్నాడు పెద్ద మేతరి.
”ఇప్పటికైనా మేం చెప్పినట్టు వినండి మామ..” అన్నాడు స్వామి అనునయంగ. ”ఏం చేయాలో చెప్పండి బిడ్డ” అన్నాడు నిస్సత్తుగా పెద్ద మేతరి. ”ఈరోజు సాయంత్రం చిన్నా పెద్ద అందర్నీ మన గూడెం నడిబొడ్డున జమ చేయండి” అంది జయ.
”గట్లనే బిడ్డ” అంటూ ”శీను…. ఓరి శీను… ఇటు రారా…” అంటూ శ్రీను అని పిలిచి ”ఇల్లులు తిరిగి అందరిని పొద్దుగూకంగా సవర్లచ్చమ్మ దగ్గరికి ఇంటిల్లాదులు పిల్ల మేకతో రావాలని చెప్పి రాపో…” అంటూ హుకుం జారీ చేశాడు పెద్ద మేతరి.
అనుకున్నట్టుగానే అగ్రిమెంట్‌ పేపర్లతో గూడెం పెద్దలు, జయ దంపతులు గూడెంలోని జనం చిన్న పెద్ద ఒక దగ్గర జమ కాగానే… ”మీరందరూ నాకు ఆత్మీయులు. మీలో మార్పు తీసుకురావాలని మేం ఎంతో తపనతో ఇక్కడే ఇల్లు కట్టుకొని సమాజంలో మనం కూడా ఒకరం, మనం కూడా గౌరవంగా జీవించాలని తెలిపి, మిమ్మల్ని మార్చాలని కంకణం కట్టుకున్నాం… కానీ మీరందరూ మొండిగా వాదిస్తూ వచ్చారు.. ఇకనైనా మేం చెప్పినట్లు వింటారని ఆశిస్తున్నాం” అంటూ అందరి వైపు ఒకసారి చూపులు మళ్ళించింది జయ.
జయ మాటలు వినకుండా అడుగడుగునా వాళ్లను అవమానించినందుకు సిగ్గుతో నేలను తాకుతున్నాయి కొందరి చూపులు. అందర్నీ ఊరి నుండి ఎక్కడ వెళ్ళగొట్టిస్తుందో అని కొందరు భయంతో చూపులను పక్కకు పక్కకు తిప్పుకుంటున్నారు.
”మనం రాసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం నేను ఏది చెప్పినా మీరు కాదనకూడదు. మేం మూఢనమ్మకాలతో కాలం గడపవద్దని ఎంత చెప్పినా వినకుండా మీకు నచ్చినట్టు మీరు చేశారు. కానీ ఇప్పుడు మేుం చెప్పినట్టు మీరు వినాలి. విని తీరాలంతే…. లేకపోతే ఊరుకునేదే లేదు…” అంది ఆవేశంగా జయ.
”సరే జయ.. మమ్ములందరినీ ఏం చేస్తావో చెయ్యి. ఇప్పుడు పట్టు నీ చేతులున్నది” అంది విస్మయంగా పెద్దమేతర భార్య ఎల్లమ్మ.
”రేపు ఉదయం 8 గంటలకల్లా మన గూడెంలోని ఆడ,మగ పిల్లలందరినీ తయారుచేసి ఉంచండి. కొత్త బట్టలు కావలసిన అవసరం లేదు. శుభ్రంగా ఉతికిన బట్టలు వేయండి. మనం ఉన్నంతలోని శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సమాజంతో పాటు మనం ముందుకు పోవాలి. ఇక ఈరోజు నుండే అందరూ తాగుడు మానేసి వారి వారి పనులు సవ్యంగా చేసుకోవాలి” అంది జయ బాధ్యతగ.
అనుకున్నట్టుగానే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి ఉచిత పుస్తకాలు స్కూల్‌ యూనిఫామ్‌ ఇప్పించింది జయ. చదువు మధ్యలో ఆపేసిన పిల్లల్ని కూడా మళ్లీ రీ అడ్మిషన్‌ ఇప్పించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించింది. మూడు నాలుగు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించింది. ఆడ మగ తేడా లేకుండా అందరూ పని చేసుకుని డబ్బులు సంపాదించి వాటిని పొదుపు చేసుకొని సమాజంలో గౌరవంగా జీవించాలని మార్గదర్శనం చేసింది జయం.
వీధిలైట్ల కిందికి అందరిని పిలుచుకొని రాత్రి సమయంలో పిల్లలకు, పెద్దలకు పుస్తకాలలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించడం మొదలుపెట్టింది జయ.
”చదువుకుంటేనే మన బతుకులు బాగుపడతాయని మీరు ఎంత చెప్పినా అప్పుడు వినలేదు. అజ్ఞానంతో పూర్తిగా మూసుకుపోయిన మా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఇప్పటి సంది మీరెట్ల సెప్పితే అట్లనే ఇంటమ్‌..” అంటూ స్వామి వైపు ప్రేమగా చూసాడు ఎంకటి.
”అవును… అవున”ంటూ మూకుమ్మడిగా గొంతు కలిపారు అందరూ.
”దూరపు కొండలు నునుపెక్కువని, దగ్గర ఉంటే దొగ్గలి కూరకు గొరగారని ఊకెనే అనలేదు పెద్దళ్ళు…. మన గూడెంలో మనతోపాటుగా కూలీనాలీ చేసి ఆడపిల్లల్ని సక్కగ సదివించుకున్నరు జయ వాళ్ళ అమ్మానాయనలు. అయినా వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించలేదు. వాళ్ళ పిల్లలు మన కండ్ల ముందే ఎదిగి మనకు మంచి సెయ్యాలని ఎన్ని ఏండ్ల సంది తాపత్ర పడుతున్నరు.
అయినా మనం వాళ్ళ మాటలను ఇనకుంట వాళ్ళని ఎన్నోసార్లు బాధపెట్టినం. ఇప్పటి సందైనా వాళ్ళ మాట అందరం ఇందాం …!” అంటూ అందరి వైపు చూపులు సారించాడు పెద్ద మేతరి.
”ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన బ్రతుకులు మారాలంటే చదువు చాలా అవసరం. విద్య వలన విజ్ఞానం పెరిగి మంచికి చెడుకు తేడా చూపిస్తుంది. విలువలతో జీవించడం సాధ్యమవుతుంది. అందుకు అందరూ వారి పిల్లలను చదివించాలి, మన చీకటి బ్రతుకుల్లో విద్యా దీపాన్ని వెలిగించుకొని అంతరాలన్నింటినీ ఎదుర్కొంటూ విజయం వైపు అడుగులు వేయాలి. కాలంతోపాటు మనం ముందుకు సాగిపోతూ మన భావితరాలకైనా మంచి భవిష్యత్తు అందించాలి…” అంటూ చిన్నారులందరినీ దగ్గరికి తీసుకుంది జయ.
”ఇప్పటి సంది తాగుడు బంద్‌ చేస్తం పిల్లల్ని చదివించుకుంటం… సోమరితనం మానేసి కష్టపడి పనిచేసి, మూఢనమ్మకాలతో అడ్డగోలు ఖర్చులు పెట్టకుండా పొదుపు చేసుకుని మా జీవితాలను మీరు కోరుకున్న విధంగా అందరికీ ఆదర్శంగా నిలుపుకుంటాం అక్క…” అంటూ తన చేతిలోనే అగ్రిమెంట్ను చింపి పారేశాడు శ్రీను.
పిల్లల కేరింతలు పెద్దల ఆనంద హేళల మధ్య అక్కడి వాతావరణం వెల్లివిరిసింది. జయ కళ్ళలో ఆనందభాష్పాలు నిండుకుండలా నిండుకొని జలజల జలపాతంలా పుడమి తల్లిని హత్తుకున్నాయి.
– డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681

Spread the love