కల్లుగీత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి

కల్లుగీత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి– కేజీకేఎస్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కల్లుగీత కార్మికులకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం(టీజీకేజీకేఎస్‌) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, ఎక్సైజ్‌ శాఖా జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు వినతి పత్రం ఇచ్చిందని తెలిపారు. కానీ ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి చనిపోతున్నారనీ, కొందరు వికలాంగులవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారనీ, వీరిలో 76 మంది చనిపో యారంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటి నివారణకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం చొరవతో టాడి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సేఫ్టీ రోప్‌ 2022 లోనే రూపొందినప్పటికీ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుందనీ, తక్షణమే గీత కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. పది లక్షలు ఎక్స్‌ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామని చెప్పిన హామీని నిలుబెట్టుకోవాలని కోరారు. మెడికల్‌ బోర్డు విధానం తొలగించలేదని గుర్తు చేశారు. ఎక్సైజ్‌ మినిష్టర్‌ జూపల్లి కృష్ణారావు తక్షణమే వీటిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. టాడి కార్పొరేషన్‌ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగిందనీ, వాటిని వెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ. 22.20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్‌ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్‌మెంట్‌ నుంచి తొలగించి టాడి కార్పొరేషన్‌కి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఆగస్టు 18 లోపు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలనీ,50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికునికి రూ. నాలుగువేల పింఛన్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ, కుల గణన తక్షణం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని కేజీకేఎస్‌ రాష్ట్ర కార్యాల యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీరమణ అధ్యక్షతన ఆఫీసు బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు, వి. వెంకట నరసయ్య, గౌని వెంకన్న, బాల్నె వెంకట మల్లయ్య, పామనగుళ్ళ అచ్చాలు, కార్యదర్శులు చౌగాని సీతారాములు, యస్‌. రమేష్‌ గౌడ్‌, బండ కింది అరుణ్‌ కుమార్‌, మడ్డి అంజిబాబు పాల్గొన్నారు.

Spread the love