మార్గదర్శి మాకినేని

The guide is Makineni– ఆయన రచనలు సైద్ధాంతిక ఆయుధాలు
– ఎర్రెర్రని ఉత్తేజం
– వాటి స్ఫూర్తితో ముందుకు సాగాలి
– ఎన్నికల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
– హైదరాబాద్‌లో ఎంబీ వర్ధంతి కార్యక్రమం
కష్టజీవుల కర్తవ్యబోధకుడు… కమ్యూనిస్టుల మార్గనిర్దేశకుడు కటికి చిరునవ్వులు అద్దినవాడు… వేకువకు మెరుగులు దిద్దినవాడు ఆకలికి యుద్ధం నేర్పినవాడు… తూర్పును  మార్పుకు నడిపినవాడు అధ్యయనం ఆచరణల అచ్చమైన రూపమతడు విముక్తి పోరాటంలో అరుణారుణ పతాకమతడు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మార్క్సిస్టు పార్టీ నేత మాకినేని బసవపున్నయ్య (ఎంబీ) బహుముఖ ప్రజ్ఞాశాలి అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. పార్టీ ఎత్తుగడలను రూపొందించడంలో, సైద్ధాంతిక అవగాహనను పెంపొందించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు. ఎంబీ 32వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో నిర్వహించారు. బసవపున్నయ్య చిత్రపటానికి రాఘవులు పూలమాలవేసి నివాళులర్పించారు. ‘జోహార్‌ మాకినేని, సాధిస్తాం మాకినేని ఆశయాలు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ పార్టీ ఎత్తుగడలకు సంబంధించి ఆయన రచనలను అధ్యయనం చేయాలని సూచించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోందనీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగించాలని చెప్పారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకికవాదం గురించి మౌలిక విషయాలను ఆయన రాశారని గుర్తు చేశారు. లౌకికవాదం, దాని స్వభావం గురించి సైద్ధాంతిక రూపకల్పన చేశారని వివరించారు. రాజీవ్‌గాంధీ బాబ్రీ మసీదు తాళాలు తెరిపించి, హిందూవులు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ లౌకికవాద పార్టీ అయినపుడు ఆ పని చేయాల్సిన అవసరమేంటన్న ప్రశ్న అందరిలోనూ వచ్చిందన్నారు. ఆ అంశంపైనే మాకినేని ఓ వ్యాసం రాశారని తెలిపారు. కాంగ్రెస్‌ లౌకికవాద అవగాహనలోనే ఒక లోపం ఉందన్నారు. లౌకికవాదాన్ని కమ్యూనిస్టులు చూసే పద్ధతికి, బూర్జువాలు, కాంగ్రెస్‌ పార్టీ చూసే పద్ధతికి తేడా ఉందని చెప్పారు. అది జాతీయోద్యమం నుంచి ఉందన్నారు. అందుకే మతోన్మాదులపై పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ పోరాటానికి మాకినేని సైద్ధాంతిక ఆయుధాలనీ, వాటిలో ఎన్నో విషయాలు, సందర్భాలను ఆయన ప్రస్తావించారని వివరించారు. ఆయన్ను స్మరించుకుంటున్నామంటే ఆచరణలో ఆయన ఆలోచనలు ఎప్పుడు ఏ రకంగా ఉపయోగపడతాయో వాటిని తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ఆ రకమైన ప్రయత్నం అందరూ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, డీజీ నరసింహారావు, టి జ్యోతి, టి సాగర్‌, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, జె బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love