మోడీ పాలనలో చేనేత రంగం కుదేలు

The handloom sector has collapsed under the Modi regime– ఎత్తేసిన సబ్సిడీలను వెంటనే పునరుద్ధరించండి
– కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ”నేతన్న పోరుయాత్ర”
– జులై 7న సిరిసిల్లలో ప్రారంభం, 15న హైదరాబాద్‌లో ముగింపు : తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి
– యాత్రకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు: పాలడుగు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నరేంద్ర మోడీ పదేండ్ల పాలనలో చేనేత రంగం కుదేలయిందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేనేత రంగం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల బోర్డులను బీజేపీ సర్కార్‌ రద్దు చేసిందని ఆరోపించారు. మహత్మాగాంధీ బుస్కర్‌ యోజనా పథకం, ఐసీఐసీఐ లాంబార్గ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీం, హౌస్‌ కం వర్క్‌షెడ్‌ తదితర పథకాలను పక్కన పెట్టిందని అన్నారు. ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిన కేంద్రం, పరిశ్రమలో ఉపయోగించే రసాయనాలు, రంగులపై 18శాతం అదనంగా జీఎస్టీ భారాన్ని మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడు నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్న కేంద్రం పట్ల మెతక వైఖరి అవలంబించడాన్ని ఆయన తప్పు పట్టారు. త్రిఫ్ట్‌ పథకం చెల్లింపులు రాష్ట్ర సర్కార్‌ చేయక పోవడంతో ఈ రంగంలో పని చేసే కార్మికులు తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను కొత్తగా ఇవ్వక పోవడంతో నేత కార్మికులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన ఈ స్కీంపై అభ్యంతరాలుంటే పేరు మార్చి వెంటనే ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలేమైనా ఉంటే రెండు పార్టీలు పరస్పరం చూసుకోవాలే తప,్ప నేత కార్మికుల బతుకు దెరువుపై కాదని సూచించారు. రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో జులై 7 నుంచి 15 వరకు నేతన్న పోరు యాత్ర చేపట్టినట్టు తెలిపారు. సిరిసిల్లలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర హైదరాబాద్‌లో జరిగే నేతన్న గర్జనతో ముగుస్తుందని వెల్లడించారు. తొమ్మిది రోజులు సాగే యాత్రలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్టు పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ నేతన్న పోరు యాత్రకు సీఐటీయూ దాని అనుబంధ సంఘాలు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు సిరిసిల్లలో చేనేత కార్మికుల చుట్టూ తిరిగిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల తర్వాత వారి గురించి పట్టించు కోవడం లేదని విమర్శించారు. గత సర్కార్‌ చేసిన తప్పులనే తిరిగి కాంగ్రెస్‌ చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల వద్ద పేరుకు పోయిన నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. మూతపడ్డ సేల్స్‌ సెంటర్లను వెంటనే తెరిపించాలని కోరారు. తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 11 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. షాదీముబారక్‌, కళ్యాణ లక్ష్మి పథకాలకు బట్టలను చేనేత సంఘాల నుంచి కొనుగోలు చేయాలని కోరారు.
నేతన్నపోరుయాత్ర ”డిమాండ్స్‌”
1). చేనేత, పవర్‌ లూమ్స్‌ కార్మికులకు ఉపాధి కల్పించాలి
2). బతుకమ్మ చీరల పథకాన్ని కొనసాగించాలి లేదా జనతా వస్త్రాల పథకాన్ని అమలు చేయాలి
3).వర్కర్‌ టూ ఓనర్‌ పథకాన్ని అమలు చేయడంతో పాటు చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలి
4). త్రిఫ్ట్‌ ఫండ్‌, యారన్‌ సబ్సిడీ, నేతన్న బీమా పథకాలను అమలు చేయాలి.
5). చేనేత, పవర్‌లూం రంగాలకు బకాయిలను చెల్లించడంతో పాటు ఉచిత విద్యుత్‌ అందించాలి.
6). వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలి
7). చేనేత సహకార సంఘాలకు, టెస్కోకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలను ఏర్పాటు చేయాలి.
8). పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలను పెంచి అమలు చేయాలి.
9). యారన్‌ సబ్సిడీ నిధులను కార్మికుల అకౌంట్లలో వేయాలి
10). కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం లబ్దిదారులకు చేనేత వస్త్రాలను ఇవ్వాలి
11). సహకార సంఘాలు, మ్యాక్స్‌ సొసైటీలకు క్యాష్‌ క్రెడిట్‌ పెంచాలి
12). ప్రతి నేతన్న కుటుంబానికి రూ.5 లక్షల పెట్టుబడి సహాయం అందించాలి
13). కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 92 శాతం సబ్సిడీపై పట్టు, నూలు పరికరాలు ఇవ్వాలి.
14). వస్త్ర ఉత్పత్తి కేంద్రాల్లో నూలు డిపోలను ఏర్పాటు చేయాలి
15). ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలి

Spread the love