భూస్వాములను తరిమికొట్టిన చరిత్ర ఎర్రజెండాది..

The history of evicting landlords is a red flag.– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడు వేల గ్రామాల్లో భూస్వాములను తరిమికొట్టి సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌ డివిజన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయుధ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది ప్రాణం కోల్పోయారన్నారు. అప్పట్లో భూస్వాములు అన్ని రకాల కులస్తులతో వెట్టి చాకిరీ చేయించుకున్నారన్నారు. ఈ క్రమంలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా.. దున్నే వాడిదే భూమి అనే నినాదంతో ఎర్రజెండా ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు పోరాటం చేసి భూస్వాముల భూములను పేదలకు పంచి పెట్టారని గుర్తు చేశారు. నిజాం సర్కారులాగా.. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఉందని, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పథకాలు సక్రమంగా అమలు కావట్లేదన్నారు. అందరికీ విద్యా, వైద్యం అందించాలని కోరారు. తల దాచుకోవడానికి 100 చదరపు గజాల భూమి కోసం వెళ్తే కేసులు పెట్టడం, మహిళలు అని చూడకుండా జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం హిందూత్వం పేరుతో తెలంగాణలో ఓట్లు రాబట్టేందుకు యత్నిస్తోందన్నారు. మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలని, మన కోసం మన వాడికి ఓటు వేసుకోవాలని అప్పుడే రాజ్యాంగం పరిపాలన చేస్తామని చెప్పారు. కేంద్రం ఇష్టానుసారంగా ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు అమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సీపీఐ(ఎం) చేపట్టే పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఓటును నోట్ల కోసం, మందు, బీరు, బిర్యానీ కోసం అమ్ముకోవద్దని సూచించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చంద్రమోహన్‌, పగడాల యాదయ్య, నాయకులు ఏర్పుల నర్సింహ, హయత్‌నగర్‌ సర్కిల్‌ కార్యదర్శి కీసరి నర్సీరెడ్డి, సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యదర్శి వెంకన్న, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ కార్యదర్శి ఎల్లయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love