మిగ్‌జాం ప్రభావం.. ఈ జిల్లాలో పాఠశాలలకు సెలవు..!

నవతెలంగాణ – హైదరాబాద్: మిగ్‌జాం తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు (బుధవారం) జిల్లా అధికార యంత్రాంగం సెలవు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూసే ఉంచాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తప్పనిసరిగా బుధవారం పాఠశాలల్లో తరగతులు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థిలు బయటకు రావొద్దని.. హాస్టల్స్‌లోనే ఉండాలన్నారు. మిగ్‌జాం తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అలాగే ఏపీలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. భారీ వర్షాల కారణంగా ఇవాళ మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.తుఫాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. కాగా, నెల్లూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 16.4 సెంటీ మీటర్ల వర్ష పాతం కురిసింది. మనుబోలు…సైదాపురం.. నెల్లూరు..వెంకటాచలం మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వర్షం నిలిచిపోవడంతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలో దశల వారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగనుంది.

Spread the love