మొక్కజొన్న, వేరుశనగ, కొబ్బరి. ఆహారంలో భాగంగా ఈ మూడు పదార్థాలను తీసుకుంటే అనారోగ్యం ఆమడ దూరం పోతుంది. కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ, క్యాలరీలు ఎక్కువ అనే సాకు చెప్పి వీటిని వదిలేస్తున్నాం. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ని శరీరం కలిగి ఉండాలనే వాస్తవాన్ని విస్మరించి పుష్టికరమైన ఆహారాన్ని దూరం పెట్టడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మొక్కజొన్నలోని విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానన శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొక్క జొన్నపొత్తుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని సరదాగా తినేప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. సంతోషభావనను పెంచే రసాయనాలైన ‘ఫ్లేవనాయిడ్స్’ మొక్కజొన్నలో ఉండడమే కారణం. తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తిమంతమైన పోషకాలతోబాటు ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ లభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్ లాంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది.
మొక్కజొన్న గింజలు బలమైన ఆహార పదార్ధం. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని, ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీ కార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. గింజల నుండి నూనె తీస్తారు. పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలోను, విస్కీ తయారీలోను మొక్కజొన్న వాడుతున్నారు. సూప్ తాగినా సలాడ్‌గా తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. చిరుతిండిగా తినే పాప్‌కార్న్ సంగతి సరేసరి. సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. ఒకప్పుడు మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్నను మాయన్లు పెంచి పోషించారని చెప్పాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ దీన్ని వాళ్లు కూరగాయగా, అల్పాహారంగా, చిరుధాన్యంగా వాడుతూనే ఉన్నారు. జన్యు మార్పుల ద్వారా మేలైన వంగడాలనూ సృష్టిస్తున్నారు.
మనకు ఎక్కువగా పసుపు, తెలుపు రంగుల్లోని సాదా, తీపిమొక్కజొన్న (స్వీట్‌కార్న్)లు మాత్రమే తెలుసు. కానీ ఎరుపూ, గులాబీ, వూదా, ఆకుపచ్చ, నలుపూ, నీలమూ… ఇలా మనకు తెలీని రంగులు చాలానే ఉన్నాయి. ఒక్కో రంగుదీ ఒక్కో ప్రత్యేకత. పసుపు రంగు కార్న్‌లో ల్యూటెన్, జియాక్సాంథిన్ వంటి కెరోటినాయిడ్లు ఉంటే, నీలి రంగు మొక్కజొన్నలో ఆంథోసైనిన్ల శాతం ఎక్కువ. వూదారంగు మొక్కజొన్నలో హైడ్రాక్సీ బెంజాయిక్ ఆమ్లం దొరుకుతుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లలా పనిచేస్తాయి.
ఉపయోగించే పద్ధతిని బట్టి ఫ్లోర్, పాప్, డెంట్, ఫ్లింట్, స్వీట్, వాక్సీ – ఆరు ప్రధాన రకాలుగా మొక్కజొన్నల్ని చెప్పవచ్చు. ఫ్లోర్, ప్లింట్, డెంట్ రకాలను ఎక్కువగా పిండికీ ఫ్లేక్స్‌కీ వాడితే, వేడి చేసినప్పుడు పాప్ అయ్యే రకాన్ని మాత్రం పాప్‌కార్న్‌గానే వాడతారు. జన్యుమార్పు ద్వారా ఆవిర్భవించిన స్వీట్‌కార్న్‌ను నేరుగానూ లేదా ఉడికించీ తింటారు. మెరుస్తున్నట్లుగా ఉండే వ్యాక్సీ రకాన్ని టెక్స్‌టైల్స్, కాగితం తయారీ పరిశ్రమలతో బాటు మెయొనెజ్, మార్గరిన్, చూయింగ్‌గమ్, ఐస్‌క్రీమ్ తదితర ఆహారపదార్థాల్లోనూ వాడుతుంటారు.
బేబీ కార్న్‌తో చాలా మంది అనేక రకాల వంటకాలు చేసుకుని తింటుంటారు. బేబీ కార్న్ కేవలం రుచిలో మాత్రమే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ బాగా పనిచేస్తుంది. బేబీ కార్న్‌లో మన శరీరానికి అవసరమైన కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను కలిగిస్తాయి. బేబీ కార్న్‌ను తరచూ తింటుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. బేబీకార్న్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. 100 గ్రాముల బేబీకార్న్ తింటే కేవలం 26 క్యాలరీలు మాత్రమే వస్తాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలైన ఆహారంగా పనిచేస్తుంది. బేబీకార్న్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ ఎ, సి, ఐరన్ కూడా వీటిల్లో ఉంటాయి. కనుక ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది.
బేబీకార్న్‌లో కెరోటినాయిడ్స్ అనబడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. చూపు బాగా పెరుగుతుంది. కంటి శుక్లాలు రాకుండా ఉంటాయి. బేబీకార్న్‌లో వుండే ఫోలేట్ అనే పోషక పదార్థం గర్భిణీలకు మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. గర్భిణీలు బేబీకార్న్ తినడం చాలా మంచిది.
మొక్కజొన్నలోని విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానన శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతలో ఉంచుతాయి. మొక్కజొన్నలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్-ఎ లోని ఆరుశాతం మనకు సమకూరుతుంది.
మొక్కజొన్నలో ఫెలురిక్ యాసిడ్ అనే శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు… అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయం అయినప్పుడు కలిగే ఇన్‌ఫ్లమేషన్ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది.
మొక్కజొన్నలో విటమిన్ బి-కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి. ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ. అందుకే అందుబాటు ధరలో ఉండే మొక్కజొన్నను వదలొద్దు.
రోజువారీ అవసరమైన జీర్ణసంబంధ సమస్యల్ని నివారించే పీచు ఓ కప్పు కార్న్ గింజలనుంచి దొరుకుతుంది. మలబద్ధకంతో బాటు కొలొరెక్టల్, పేగు క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది. మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థ్కెమీన్, నియాసిన్ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇ-విటమిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్ ఆమ్లం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతో సైనిన్‌లు సైతం క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడం వల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీ- ఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది. పసుపురంగు కార్న్‌లో కంటికీ చర్మానికీ అవసరమైన బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. కార్న్‌లోని ఐరన్ రక్తహీనతనీ తగ్గిస్తుంది. మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది.
మొక్కజొన్న వ్యర్థాలకు ఉప్పు, చక్కెర, సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి అతి తక్కువ ఖర్చుతో బయోడీజిల్ తయారు చేసే కొత్త పద్ధతిని ఐఐటీ హైదరాబాద్ రీసెర్చర్లు కనుగొన్నారు. ఆటో మొబైల్, ఏవియేషన్ రంగాల్లో ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. 2030 నాటికి కార్బన్‌డైయాక్సైడ్ ఉద్గారాలలో 3.5 శాతం, ప్రపంచ చమురు డిమాండ్‌లో 15 శాతం ఉన్న గ్లోబల్ ఏవియేషన్ రంగం 2050 సంవత్సరం వచ్చే నాటికి 50 శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. పర్యావరణ అనుకూలమైన బయోడీజిల్‌తో కార్బన్‌ఉద్గారాలను గణనీయంగా తగ్గించ వచ్చని, భవిష్యత్‌లో మొక్కజొన్న రైతులకు స్థిరమైన లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
అన్నట్టు మరో మాట… మనం సరదాగా కాలక్షేపం కోసం తినే రుచికరమైన మొక్కజొన్నలో తియ్యదనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్ సిరప్‌ను ప్రాసెస్‌డ్ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008 577 834