– ఆదర్శనేత దేవేందర్‌గౌడ్
– ‘అంతరంగం’ పుస్తకావిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్షం బలోపేతం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పారు. చట్టసభల్లో చర్చకు అవకాశం ఇచ్చి, పటిష్టమైన చర్చల ద్వారా ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే నష్టం ప్రజలకేనని చెప్పారు. ఈచర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓక హోటల్‌లో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్‌గౌడ్ తన రాజకీయ అనుభవాలతో కూడిన ‘ అంతరంగం ‘ పుస్తకంతోపాటు రాజ్యసభ, అసెంబ్లీల్లో చేసిన ప్రసంగ పాఠాల పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో శత్రువులు ఉండరనీ, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అభిప్రాయపడ్డారు. అప్పట్లో మాకు ఇందిరాగాంధీని రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూశామని అన్నారు. అలాగే కమ్యూనిస్టులను సిద్దాంత ప్రత్యర్థులుగా మాత్రమే పరిగణించామన్నారు. అప్పట్లో సభల్లో అర్థవంతమైన చర్యలు జరిగాయనీ, ఇప్పుడు దారుణంగా పడిపోయాయని గుర్తు చేశారు. కులం, మతం, వర్గం, ప్రాంతాల పేరిట గొడవలు పడాల్సిన అవసరం లేదన్నారు. దీనిమూలంగా ఐక్యత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. సభల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలనీ, ప్రజాసమస్యలపై చర్చించాలని చెప్పారు. దేవేందర్‌గౌడ్ ఆదర్శ నేత అని అభినందించారు. ఆయన రాసిన పుస్తకాలను అందరూ చదవాలని పేర్కొన్నారు. ప్రజల తీర్పును అందరూ గౌరవించాలని కోరారు. పదవీ విరమణ మాత్రమే చేశాననీ, పెదవీ విరమణ చేయాలని అభిప్రాయపడ్డారు. పత్రికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కీలకంగా ఉండాలని చెప్పారు. పత్రికలు అద్దంలా ఉండాలనీ, ప్రజల అభిప్రాయాలకు దర్పణంగా కనిపించాలని వివరించారు. ఎన్టీఆర్, నర్రా రాఘవరెడ్డిలను ఈసందర్భంగా వెంకయ్యఆయుడు గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ దేవేందర్‌గౌడ్ సభల్లో స్టేట్స్‌మెన్‌లా వ్యవహరించారని ప్రశంసించారు. అప్పటికి, ఇప్పటికీ సభల్లో విలువలు ఘోరంగా పడిపోతున్నాయని వివరించారు. మంత్రి దేవేందర్‌గౌడ్ సమర్థవంతం పనిచేశారని చెప్పారు. అంతరంగం పుస్తక రచయిత, మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ రాజ్యసభ, శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా మూడు పుస్తకాలు, రాజకీయాలు, ఇతర అంశాలపై అంతరంగం పుస్తకం రాసినట్టు చెప్పారు. నాడు ప్రజాస్వామ్యయుతంగా సభను నడిపించారనీ, ఇప్పుడు అవి కరువు అవుతున్నాయని అన్నారు. ఈ కార్యమ్రానికి దేవేందర్‌గౌడ్ కుమారుడు విజయేందర్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్టు విక్రమ్ ఫూలే వందన సమర్పణ చేశారు. దేవేందర్‌గౌడ్ భార్య వినోద, కుమారుడు వినయేందర్, వీరేందర్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.