డ్రాప్ అవుట్స్ తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ బడుల్లో ‘అల్పాహార’ పథకం ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడిన ‘బ్రేక్ ఫాస్ట్ అండ్ మిల్క్’ పథకాన్ని సోమవారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులకు ఈ అల్పాహార పథకాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, పౌష్టికాహారం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి విద్యలో రాణిస్తారని చెప్పారు. డ్రాప్ అవుట్స్‌ను తగ్గించి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడానికి ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ. 720 కోట్లు ఖర్చు చేస్తుందని, ఇందులో అల్పాహారం కోసం రూ. 540 కోట్లు, పాల పంపిణీ కోసం రూ. 180 కోట్లు కేటాయించారని అన్నారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. మన్నా ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొదటి దశ
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 672 ప్రభుత్వ పాఠశాలల్లో 93,501 మంది విద్యార్థులు ఉండగా, మొదటి దశలో 45 పాఠశాలలను ఎంపిక చేసినట్టు మంత్రి తెలిపారు.
దీని ద్వారా తొలి విడతలో 12,437 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య, ఆర్డీవో సాయిరాం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
వారంతపు అల్పాహార మెనూ
విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన అల్పాహారంతోపాటు పాలు లేదా రాగి జావను అందించనున్నారు.
సోమవారం: దోసె – చట్నీ / చపాతీ – కూర + పాలు
మంగళవారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు – సాంబార్ + రాగి జావ
బుధవారం: రెండు పూరీలు – ఆలూ కుర్మా + పాలు
గురువారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు – సాంబార్ + రాగి జావ
శుక్రవారం: మిల్లెట్ ఉప్మా / పొంగల్ – చట్నీ + పాలు
శనివారం: రెండు బోండాలు – చట్నీ + రాగి జావ అందిస్తారు.
విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



