Tuesday, June 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రయివేటు పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదు :మంత్రి సీతక్క

ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదు :మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
“లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రయివేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదు. మీ పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించండి. అత్యుత్తమ వాతావరణంలో వారిని తీర్చిదిద్దుతాం. మా అంగన్వాడీ టీచర్లకు మంచి నైపుణ్యం ఉంది. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం అంగన్వాడీ వ్యవస్థకు ఉంది” అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రి-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె
అభ్యాసన పుస్తకాలు, ఆట వస్తువులను అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు. అంగన్వాడీల ద్వారా లభించే సేవలపై తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని తమ పిల్లలను కేంద్రాల్లో నమోదు చేయించాలని సూచించారు. గతంలో అంగన్వాడీల్లో యూనిఫాంలు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ తమ ప్రభుత్వం ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలను అందిస్తుందని తెలిపారు.
భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామ‌ని మంత్రి సీత‌క్క‌ తెలిపారు. చిన్నారులకు పోషకాహారం అందించేందుకు 57 రకాల విద్యా, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. నర్సరీ విద్య పూర్తి చేసిన చిన్నారులకు ప్రత్యేక సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 38 వేల అంగన్వాడీ కేంద్రాల్లో 9 లక్షల మంది చిన్నారులు నమోదు అయ్యారని తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నామనీ, అంగన్వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. కేంద్రాల్లో ఆకర్షణీయమైన పెయింటింగ్స్ వేయించడం ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందిస్తున్నామని, వారి మెదడు వికాసం, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్క అవగాహన ర్యాలీని ప్రారంభించి కమ్యూనిటీకి సందేశం ఇచ్చారు. “అమ్మ మాట – అంగన్వాడీ బాట”, “ప్రైయివేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు” అంటూ నినాదాలు చేయిస్తూ అంగన్వాడీ విద్యా వ్యవస్థ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు. ప్రతి చిన్నారి అంగన్వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -