కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

People of Krishna basin should be vigilant: Collector– ఈత కోసం, చేపల వేట కోసం నదిలోకి వెళ్ళరాదు 
– అధికారులు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
శ్రీశైలం ప్రాజెక్టుకు  పై నుండి వరద ఉద్ధృతి కొనసాగుతుండడం, రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి  చేరువలో ఉన్న దృష్ట్యా శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు రేడియల్ క్రస్ట్ గేట్లను  తెరిచి నీటిని దిగువకు వదులుతున్నందున జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల సమాచారం మేరకు  శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 215.8070 టిఎంసీలకు గాను,సోమవారం  ఉదయం 10 గంటలకు 177.1490 టీఎంసీలకు చేరుకుందని, ఇదే సమాయనికి  పైనుండి ప్రాజెక్టుకు  4,37, 680 క్యూసెక్కుల నీరు వస్తుందని, రిజర్వాయర్ 30 వ తేదీ ఎప్పుడైనా పూర్తిస్థాయి కి చేరుకుంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని సోమవారమే శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు శ్రీశైలం ప్రాజక్ట్ రేడియేల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు ఆయన తెలిపారు. అందువల్ల నల్గొండ  జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.ముఖ్యంగా నాగర్జున సాగర్ ప్రాజక్ట్ తిరుగు జలాలు నిలిచే ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు,నది పరివాక ప్రాంత ప్రజలెవ్వరు  ఈత కోసం,బట్టలు ఉతికేందుకు నదిలోకి వెళ్ళవద్దని, అలాగే మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి  వెళ్ళకూడదని, పశువులను సైతం నదిలోకి తీసుకు వెళ్లడం,నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.నది పరివాహక ప్రాంత మండలాల, గ్రామాల అధికారులందరూ ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను  అప్రమత్తం చేయాలని ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఈ విషయమై  సంబంధిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.
Spread the love