పత్తి ధరను పడగొట్టేశారు…

The price of cotton fell...– సీసీఐ కంటే తక్కువగా నిర్ణయించిన వ్యాపారులు
– ఆదిలోనే తగ్గిపోవడంపై అన్నదాతల్లో ఆందోళన
– పది రోజుల్లో 29వేల క్వింటాళ్లే కొనుగోళ్లు
– మార్కెట్‌ వైపు దృష్టిసారించని అధికారులు
మార్కెట్‌లో పత్తి ధర దిగజారిపోయింది. భారత పత్తి సంస్థ(సీసీఐ) కల్పిస్తున్న మద్దతు ధర కంటే ప్రయివేటు వ్యాపారులు మరింత తగ్గించడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నాణ్యమైన పత్తి ఉండే ఈ సమయంలో పెరగాల్సిన ధర తగ్గిపోవడం కారణంగా మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు జంకుతున్నారు. తొలిరోజున పట్టువిడుపుల మద్య మద్దతు ధరకంటే రూే.60మాత్రమే ఎక్కువ చెల్లించేందుకు ముందుకొచ్చిన వ్యాపారులు క్రమంగా తగ్గించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సీజన్‌ కావడంతో అధికారులెవరూ దృష్టిసారించరనే కారణంగా ధర తగ్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేంద్రం నిర్దేశించిన మద్దతు ధర తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో కనీస గిట్టుబాటు ధరన్నా లభిస్తుందని ఆశపడిన అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. మార్కెట్‌ ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు 29వేల క్వింటాళ్లు మాత్రమే పత్తి కొనుగోళ్లు జరగడం గమనార్హం. దీపావళి పండుగ తర్వాత ధర పెరిగే అవకాశం ఉందని, అప్పుడే కొనుగోళ్లు సైతం ఊపందుకుంటాయని అధికారులు చెబుతున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ పత్తి మార్కెట్‌లో అన్నదాతలకు గోస తప్పడం లేదు. పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో లబోదిబోమంటున్నారు. క్వింటాల్‌ పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.7020 ఉండగా.. తొలి రోజున మార్కెట్‌లో రూ.7080గా నిర్ణయించారు. మద్దతు ధర కంటే రూ.60మాత్రమే అధికంగా పెంచారు. సరైన ధర లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చేందుకు వెనకాడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ధర పెరుగుతుందని అప్పుడు పత్తిని తీసుకురావచ్చని రైతులు భావించారు. కానీ ధర అనూహ్యంగా దిగజారిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిందటేడాది మద్దతు ధర కంటే రూ.10మాత్రమే అధికంగా నిర్ణయించిన వ్యాపారులు, ఈ ఏడాది పెంచడం మరిచిపోయి మరింత తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6910 మాత్రమే చెల్లించేందుకు ముందుకొచ్చారు. సీసీఐ నిర్ణయించిన రూ.7020కంటే ప్రయివేటులో మరింత తక్కువగా ఉండటంతో పత్తిని విక్రయించేందుకు రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. ఇంట్లో క్వింటాళ్ల కొద్దీ పత్తిని నిల్వ ఉంచి గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారు.
అదును చూసి తగ్గించేశారు..?
ప్రస్తుతం ఎన్నికల వాతావరణం రసకందాయంలో ఉంది. మరో 20రోజుల్లో పోలింగ్‌ జరగడంతో అందరూ ఇదే పనిలో నిమగమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల దృష్టి ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. ప్రతి ఏటా ఈ సీజన్‌లో ఆయా వర్గాలన్నీ పత్తి ధరపైనే దృష్టిపెట్టేవి. కానీ ఈ ఏడాది మార్కెట్‌ ప్రారంభమైన సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పత్తి మార్కెట్‌ వైపు ఎవరూ చూడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు పత్తి ధరను అమాంతం దించేస్తున్నారనే విమర్శలున్నాయి. రెండ్రోజుల కిందట క్వింటాల్‌కు రూ.6870గా నిర్ణయించగా.. తాజాగా రూ.40పెంచి శనివారం రూ.6910గా నిర్ణయించారు. మద్ధతు ధర కంటే తక్కువగా ఉండటంతో రైతులు ప్రయివేటు వైపు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. చాలా మంది రైతులు సీసీఐకే విక్రయిస్తున్నారు. సీసీఐ ఇప్పటి వరకు 1224 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
పండుగ తర్వాత పెరిగే అవకాశం
మార్కెట్‌లో ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. పండుగ తర్వాత పత్తి ధర పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది రైతులు మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం.
శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ ఏడీ, ఆదిలాబాద్‌

Spread the love