ఏఎన్నార్‌.. ఒక నట విశ్వ విద్యాలయం

ANNAR.. A Nata Vishwa Vidyalayam– నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు
శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌, రామ్‌చరణ్‌, మోహన్‌ బాబు, ఎస్‌ఎస్‌ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణీ , నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌, జయసుధ, బ్రహ్మానందం, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, దిల్‌ రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి, సికళ్యాణ్‌, చినబాబు, నాగవంశీ, ఎస్‌గోపాల్‌ రెడ్డి, వైవిఎస్‌ చౌదరి, జెమిని కిరణ్‌, గుణ్ణం గంగరాజు, అనుపమ్‌ ఖేర్‌, నాజర్‌ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని ఏఎన్నార్‌కి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు మహా నటుడు. మహా మనిషి. ఆయన జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకుంటే అదే ఆయనకి మనం ఇచ్చే నిజమైన నివాళి. విలువలకు సజీవ దర్పణం
ఏఎన్నార్‌. ఆయన తెలుగు ప్రజల హదయాల్లో జీవించే ఉంటారు. అక్కినేని వారసత్వాన్ని ఆయన వారసులు నిలబెట్టడం చాలా సంతోషంగా ఉంది
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ చిత్రాలు చేయడం నా అదష్టం. ఆయన నడిచే విశ్వవిద్యాలయం. ఆయన దగ్గర క్రమశిక్షణతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను
– జయసుధ
మహా మనిషి ఎఎన్నార్‌ ‘మరపురాని మనుషులు’ చిత్రానికి నేను అసోసియేట్‌గా పని చేశాను. తర్వాత అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాలు చేశాను. ఏఎన్నార్‌ ఒక గ్రంధం.
– మోహన్‌ బాబు
దేవదాస్‌తో పెద్ద స్టార్‌ హీరో అయినప్పటికీ ‘మిస్సమ్మ’లో కామెడీ వేషం ఎందుకు చేశారని అడిగితే, ‘దేవదాస్‌ తర్వాత అన్నీ అవే తరహా పాత్రలు వస్తున్నాయని, ఇమేజ్‌ మార్చుకోకపొతే ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయనపై ఆయనకి ఉన్న నమ్మకానికి చేతులు జోడించి నమస్కారం చేయాలనిపించింది. ఎన్నో విషయాలలో ఆయన మా అందరికీ స్ఫూర్తి.
– ఎస్‌ఎస్‌ రాజమౌళి
ప్రతి తెలుగువాడికి, నటులకు అక్కినేని నాగేశ్వరరావు జీవితం గొప్ప పాఠం. అక్కినేని స్వయంశిల్పి. ఆయన ఒక మహా నట వక్షం.
– బ్రహ్మానందం
అద్బుతమైన జీవితాన్ని గడిపారు
నాన్న అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్న. మా గుండెలను ఆయన ప్రేమతో నింపారు. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు తీరిపోయేవి. అన్నపూర్ణ స్టూడియోస్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్లు అంటారు. ఆయన ప్రాణంతో మా మధ్యలోనే నడుస్తున్నారని అనుకుంటున్నాం.
– అక్కినేని నాగార్జున
నాలో దీపంలా వెలుగుతూ ఉంటారు
ఏఎన్‌ఆర్‌ అంటే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్‌ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈ రోజుకి కూడా ప్రేరణ కలిగించే కేస్‌ స్టడీగా చాలా మంది ఫిల్మ్‌ స్కూల్స్‌లో చదువుతుంటారు. అందులో నేనూ ఒకడిని. ‘మనం’లో తాతయ్యతో కలసి చేయడం నా అదష్టం. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన ప్రతిసారి కలలు కనడంలో భయపడకూదనిపిస్తుంది. ఆయన ఎప్పుడూ నాలో ఒక దీపంలా వెలుగుతూ ఉంటారు. – నాగచైతన్య

Spread the love