నవతెలంగాణ – రెంజల్
గత కొన్ని సంవత్సరాలుగా కందకుర్తి, బోర్గం, పేపర్ మిల్లు గ్రామాలలో రైతులు పొగాకు పంటను పండిస్తూ, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ వారికి విక్రయిస్తూ ఉండేవారు. ఇటీవల ప్రైవేట్ కంపెనీల వారు సైతం పొగాకు కొనుగోలు చేయడానికి రావడంతో పొగాకు ధర క్వింటాలుకు సుమారుగా రూ.3000 రూపాయలు అదనంగా కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులకు తాము పండించిన పంటకు గిట్టుబాటు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వజీర్ సుల్తానా టొబాకో కంపెనీతోపాటు, పి టి పి, కె ఆర్ కె, అలయన్స్ కంపెనీ లు ముందుకు రావడంతో పొగాకు క్వింటాలకు రూ.3000 రూపాయలు చొప్పున పెరగడం సంతోష కరమని రైతులు పేర్కొంటున్నారు. రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన ఖసీముద్దీన్ అలయన్స్ కంపెనీ వారితో రైతుల పొగాకును కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. కందకుర్తి, బోర్గం గ్రామాల నుంచి సుమారు 15 లారీల పొగాకును గుంటూరు బోర్డు రేటు ప్రకారం రైతుల నుంచి అలయన్స్ కంపెనీ వారితో సంప్రదించి పొగాకు కొనుగోలు చేయించారు. గ్రేడ్ ప్రకారం రైతులకు క్వింటాలకు రూ.13,800 రూపాయల చొప్పున వారికి ఇప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. పొగాకు కంపెనీలు పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో రైతులకు లాభం కలుగుతుందని వారు పేర్కొన్నారు. గత సంవత్సరం నుంచి పొగాకు పంటపై రైతుల పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ, పోగాకు యాజమాన్యం కేవలం ప్రతి ఏటా 500 రూపాయలు కంటే ఎక్కువగా ఇచ్చేవారు కాదని, ఈ సంవత్సరం ఒకేసారి రూ.3000 రూపాయలు పెరగడంతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా వారు పండించిన పడ్డకు గిట్టబాటు ధర లభించిందని రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లలో పోటీ తత్వం పెరిగినప్పుడే రైతులకు లాభాలు చేకూరు తుందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు..