రైతులకు ఇచ్చిన హామీని ప్రధాని నిలబెట్టుకోవాలి

రైతులకు ఇచ్చిన హామీని ప్రధాని నిలబెట్టుకోవాలి– సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు
– హైదరాబాద్‌ చేరుకున్న యాత్ర
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకునే సమయంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతుల మద్దతు కూడగట్టేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్ర హైదరాబాద్‌ చేరుకున్న సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, కిసాన్‌ మోర్చా జాతీయ రైతు నాయకులు జగ్జిత్‌ సింగ్‌ దలైవాళ మాట్లాడారు ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించి రోజులు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 700 మందికిపైగా రైతుల మరణానికి కారణమైన మోడీ.. ఎన్నికలలో సుమారు 30 మందికి పైగా ఎంపీలను కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు ఎన్‌డీఏ కూటమిలోని ఎంపీలకు వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు రైతుల అంశంపై పార్లమెంట్‌లో ప్రయివేటు బిల్లును పెట్టాలని కోరారు. ప్రయివేటు బిల్లు పెట్టిన సమయంలో బిల్లుకు మద్దతు పలికేవారు ఎవరు.. పలకని వారెవరో స్పష్టంగా తెలిసిపోతుందని, దాంతో వారు రైతు వ్యతిరేకులుగా ముద్రపడే అవకాశం ఉంటుందని అన్నారు. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీ నాయకులను విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల రైతు నాయకులు, దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త కురుబురు శాంత కుమార్‌, తెలంగాణ రాష్ట్ర నాయకులు చంగాల్‌రెడ్డి, హరియాణ నాయకులు అభిమన్యు, లక్వీందర్‌ సింగ్‌, న్యూఢిల్లీ నాయకులు జఫర్‌ ఖాన్‌, సుకిందర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love