అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి 

నవతెలంగాణ – పెద్దవంగర:అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనిబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదగాని సోమయ్య, మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ..అంగన్‌వాడీ ఉద్యోగులకు గత ఎనిమిది సంవత్సరాలుగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, పర్మినెంట్‌, కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రతలాంటి విషయాలను పట్టించుకోవడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదవి విరమణ పొందే ఉద్యోగులకు గ్రాట్యూటీ, పెన్షన్‌ సౌకర్యాన్ని తెలంగాణలో కూడా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాలుగా అంగన్‌వాడీ టీచర్లకు టీఏ,డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పటివరకు కూడా పెంచలేదని అన్నారు. దీనివల్ల అంగన్‌వాడీ ఉద్యోగులు తమ వేతనం నుంచే ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఆన్లైన్‌యాప్‌ల వల్ల పనిభారం పెరిగిందని వాటిని రద్దు చేయాలని అన్నారు. అనేకసార్లు ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని అన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు ఆయాల పోస్టులు నింపకపోవడంతో అంగన్‌వాడీ సెంటర్ల పని కుంటుపడుతుందని, వాటిని తక్షణం భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు పసుల స్వరూప, యూనియన్ నాయకులు అంబికా, మమత, యాదమ్మ, మంజుల, యాకలక్ష్మీ, బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, మండల అధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి కుమార్, వరంగల్ జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు బిక్షం నాయక్, కుమ్మరికుంట్ల శివ, భాస్కర్, ముఖేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love