ఆశావర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Problems of Aspirants should be resolved immediately– టార్గెట్లు, పని ఒత్తిడితో చిన్న వయస్సులోనే రోగాలు
– పారితోషికాల పేరుతో అదనపు పని
– తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి
– రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాల ఏర్పాటు
నవతెలంగాణ-ముషీరాబాద్‌/విలేకరులు
ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనియెడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది ఆశా వర్కర్లు ధర్నా సమ్మె చేస్తున్నా ప్రభత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించగా.. తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘కేసీఆర్‌ ఆశావర్కర్ల ఆకలి గోస వినండి! ఫిక్స్‌డ్‌ వేేతనం రూ.18000 పెంచండి’ అంటూ ప్లేట్లను మోగిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి.జయలక్ష్మి మాట్లాడుతూ..
ఆశాలకు పారితోషికాల పేరుతో కేవలం రూ.9750 ఇస్తూ పని భారం మోపుతూ.. దేశంలోనే మూడు సార్లు పారితోషికాలు పెంచామని పాలకులు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. టార్గెట్లు, పని ఒత్తిడి వల్ల ఆశాలు చిన్న వయస్సులోనే బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, గుండెపోటు వంటి రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత కల్పించాలని, 6 నెలల పీఆర్సీ బకాయిలు, 18 నెలల కరోనా రిస్క్‌ అలవెన్స్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే యూనియన్‌తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, ఐద్వా నగర కార్యదర్శి నాగలకిë, సీఐటీయూ నగర సహాయ కార్యదర్శులు మహేందర్‌, ఎం.సత్యనారాయణ, నాయకులు పి.మల్లేష్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు యాదమ్మ, ఎం.అనిత కోశాధికారి రాణి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ఆశాలు మానవహారంగా ఏర్పడ్డారు. రాజేంద్రనగర్‌లోని హైదర్‌గూడ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. వికారాబాద్‌ జిల్లాలో పరిగిలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. నిర్మల్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జి) మండలాల్లో ఆశా కార్యకర్తలు నిర్మల్‌-భైంసా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. లోకేశ్వరంలో భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం నిర్వహించారు.
కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కండ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను నిరసిస్తూ చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండలో ప్రధాన రహదారిపై ఆశాలు మానవహారం చేపట్టారు. మధిరలో భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. మధిరలో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సంఘీభావం తెలిపారు. భట్టికి ఆశాలు వినతి పత్రం అందజేశారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆశాలు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో మానవహారం నిర్వహించారు. మర్రిగూడలో సమ్మెకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. నాంపల్లి మండలంలో ఆశాలు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ తీశారు.

Spread the love