పట్టణ ప్రజల సమస్యల్ని మ్యానిఫెస్టోల్లో చేర్చాలి

పట్టణ ప్రజల సమస్యల్ని మ్యానిఫెస్టోల్లో చేర్చాలి– జాతీయ పట్టణ పోరాటాల వేదిక డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ పట్టణ ప్రజల సమస్యలను తమ మ్యానిఫెస్టోల్లో చేర్చాలని జాతీయ పట్టణ పోరాటాల వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు సంఘాల నేతలు మాట్లాడారు. జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక (ఎన్‌ఏపీఎమ్‌) జాతీయ నాయకులు మీరా సంఘమిత్ర, యువజన విభాగం నాయకులు జాన్‌, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పీ శంకర్‌, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, నిరాశ్రయ శ్రామిక సంఘం నాయకులు ఫిరోజ్‌ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సమస్యలతో కూడిన మ్యానిఫెస్టోను వారు విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టో ప్రతుల్ని అన్ని రాజకీయపార్టీలకు అందజేసి, తమ ఎన్నికల ప్రణాళికల్లో చేర్చాలని కోరతామని చెప్పారు. సమ్మిళిత నగరాలు, గృహ నిర్మాణం, జీవనోపాధి, కార్మికహక్కుల పరిరక్షణను అన్ని పార్టీలు విధిగా ప్రకటించాలని కోరారు. పట్టణాల్లో పనిచేస్తున్న వివిధ వర్గాల శ్రామిక వర్గాల జనాభా 70 శాతానికి పైగా ఉన్నదనీ, నగరాల్లో వారికి న్యాయమైన వాటాను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నగరాభివృద్ధి పేరుతో వారి ప్రాథమిక అవసరాలు, హక్కులకు ఎప్పుడూ భంగం కలుగుతూనే ఉన్నదని వివరించారు. ఈ సందర్భంగా పది అంశాలతో కూడిన పట్టణ మ్యానిఫెస్టో అమలును తాము డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

Spread the love