– మంత్రి సబితకు టిప్స్, టిగ్లా, జీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులనూ క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్), తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్ల సంఘం (టిగ్లా), ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య, జీసీఎల్‌ఏ అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఐదేండ్లుగా ఉద్యోగులకు బదిలీల్లేకపోవడం వల్ల మానసిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి బాధలను గమనించి సత్వరమే బదిలీలు చేపట్టాలని కోరారు. బోధనేతర సిబ్బందికి పది శాతం జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలని సూచించారు. జూనియర్ కాలేజీలో పున:ప్రారంభం అయ్యాక విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు వచ్చేలా చూడాలని కోరారు. కాలేజీల ప్రారంభం నుంచే అతిథి అధ్యాపకులను కొనసాగించాలని తెలిపారు. కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని, స్వీపర్లు, అటెండర్లు, వాచ్‌మెన్లను నియమించాలని సూచించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే అధికారులు, సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మంజు నాయక్, సైదులు, లాలు, బిక్యానాయక్, జ్యోతి, వస్కుల శ్రీనివాస్, ఎం శ్రీనివాస్‌రెడ్డి, కెపి శోభన్‌బాబు, సంగీత, గాయత్రి, హరి, గోపాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.