ఫలించిన చర్చలు

– నిరసన కార్యక్రమాలు, మహాధర్నా వాయిదా: టీవీవీపీ ఉద్యోగుల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అతి తొందరలో వైద్యవిధాన పరిషత్‌ను ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హామి ఇచ్చినట్టు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. శుక్రవారం టీఎస్‌ఎంఐడీసీ చైర్మెన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మంత్రి హరీశ్‌రావుతో చర్చించారు. మంత్రితో జరిపిన చర్చలు సఫలం కావడం, హరీశ్‌రావు సానుకూలంగా స్పందించడంతో నిరసన కార్యక్రమాలతో పాటు అక్టోబర్‌ 10న నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. 317 జీవోను అమలుకు సహాయ, సహకారాలు అందిస్తామనీ, కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. పదోన్నతులు ఇవ్వడానికీ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నెల నెల జీతాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చారన్నారు. అదే విధంగా 23 డీసీహెచ్‌ఎస్‌ పోస్టులను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇన్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌ ఇచ్చి పదోన్నతులు ఇచ్చేందుకు మంత్రి ఒకే తెలిపారని వారు వివరించారు. మంత్రితో జరిగిన చర్చల్లో జేఏసీ నాయకులు డాక్టర్‌ వినరు కుమార్‌, డాక్టర్‌ రవూఫ్‌, నల్ల సోమ మల్లన్న, వట్టి మరియమ్మ, సత్యనారాయణ రెడ్డి, ఇందిరా శ్రీలక్ష్మీ, భూలక్ష్మి, ఆదిలక్ష్మి, మధుసూదన్‌ రెడ్డి, బైరపాక శ్రీనివాస్‌ , పిడుగు రాజేశ్‌, ఏ. అరుణ్‌ , క్రిస్టఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love