నీడ

shadowపసికందు ఏడుపు శబ్దం విని మదన్‌ ఆశ్చర్యబోయాడు. ఓక్‌ వక్షాల వెనక ఆరు, ఏడు నెలల పసికందు బోర్లా పడిి ఏడుస్తూ వుంది. తన తలను కాసేపు నేలకు వాల్చి తిరిగి తలెత్తి చూస్తుంది. గట్టిగా ఏడ్చే ఆ గొంతు అలసి పోయిందేమో కాసేపటికి నెమ్మదిగా వినబడుతోంది.
మదన్‌ తన బండిని ఆపాడు. ఆ పసికందుని లేపి తన తలపాగా అంచుతో మొహం తుడిచాడు. ఆ పసికందు ఆడపిల్ల. బేలగా అతని వైపు చూడసాగింది. పక్కనే ఒక తెల్లటి బుర్ఖా పడివుంది. అది ఎలా పడివుందంటే ఏదో తూఫాను తాకిడికి ఎగిరొచ్చినట్లుగా పడివుంది.
”ఎవరో తల్లి వదిలి వెళ్ళిపోయింది ఈ పసికందును, పాపం!” అతను ఆలోచించసాగాడు.
”ఎంతటి దౌర్భాగ్యపు స్థితి నెలకొంది. తల్లులకు తమ పిల్లలను సంభాళించుకోవడానికి కూడా చేత కావడం లేదు!” అని ఆలోచిస్తూ ఆ పసికందు చేతులను తన మెడ చుట్టూ చుట్టుకున్నాడు.
ఎదురుగా వున్న గుంతలో ఒక వ్యక్తి పడివుండటం కనబడింది. కాస్త ముందుకు వెళ్లి చూసాడు. అది ఒక శవం. నుదుటి మీద ఒక చంద్రవంక, ఒక నక్షత్రం నల్లటి సిరాతో చెక్కబడి వుంది. మొహం మీద హింసకు గురైన సంకేతాలున్నాయి. దానివల్ల చంద్రుడు, నక్షత్రం గుర్తులు చెదిరిపోయి వున్నాయి. కాళ్ళ దగ్గర నేలను తవ్వి పోసినట్లు వుంది. బహుశా ప్రాణం విడిచేటప్పుడు అతను తీవ్రమైన పీడనను భరించివుండవచ్చు.
”హంతకులు తండ్రిని చంపి పారేసి, తల్లిని ఎత్తుకుపోయారు. పాపం, ఈ పసికందును… విడిచి వెళ్లారు!” అక్కడి దశ్యాలు చూసి ఏం జరిగిందో ఊహించగలిగాడు. బాలిక ముక్కుమొహం తండ్రి పోలికలను పోలి వున్నాయి. తెల్లటి బుర్ఖాను చూసి ఆ పిల్ల తల్లి అందంగా వుండి వుంటుందన్న ఆలోచన అతనికి వచ్చింది. ఆమె అందమే ఆమె భర్తకు శత్రువుగా మారి వుండవచ్చు. ఆమె స్వయంగా నెమ్మది నెమ్మదిగా ఎవరో పరాయి వాడి ఇంటిని తన ఇంటిగా, ఎవరినో తన మనిషిగా స్వీకరిస్తుంది. ఆమెకు పిల్లలు కూడా పుడతారు. బహుశా ఈ పసికందును కూడా మర్చిపోతుండొచ్చు. కానీ, వాళ్ళు తల్లితో పాటు ఈ పసికందును కూడా తీసుకెళితే వచ్చిన నష్టమేముండే?”
”పిల్లలు భగవత్స్వరూపులు. పిల్లల ఎదుట మనిషి పాపం చేయడానికి భయపడతాడు” మదన్‌కు తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
”మరి ఈ రాక్షసులు చేసిన పని ఏమైనా పుణ్యకార్యమా?” అన్న సంశయం కలిగి తన తల్లి మాటలు అబద్దం అన్న నిర్ణయానికి వచ్చాడు .
పసికందు మళ్ళీ ఏడుపు అందుకుంది .
దుర్గీ కూడా చెబుతూ వుండేది, ”దేవుడా, నాకు ఒక ఆడపిల్లను ఎట్టాగైనా ప్రసాదించు, ఆమెకు నా కష్టసుఖాలు చెప్పుకునే అవకాశమైనా దక్కుతుంది..”
ఇదిగో ఆ దేవుడు ఆమె కోసం ఆడపిల్లను పంపించేశాడు. హిందువు కాదు, ముసల్మాన్‌ కాదు, బిల్లుతో ఆడుకుంటుంది, ఇద్దరు సోదరీ, సోదరులు …!”
మదన్‌ భార్యకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురి ప్రసవానికి ఆపరేషన్‌ అవసరం అయ్యింది. ఇద్దరు చనిపోయారు. బిల్లు బతికిపోయాడు. బిల్లు పుట్టిన తరువాత దుర్గీ మళ్ళీ గర్భవతి ఐతే బతకడం కష్టం అని డాక్టర్‌ హెచ్చరించాడు. దాని తరువాత ఆడపిల్ల కావాలనే ఆమె కోరిక తీరకుండా అలాగే ఉండిపోయింది.
”ఏమే, నువ్వు దుర్గీని అమ్మగా చేసుకుంటావా?” అని ప్రేమగా అడిగాడు ఆ పసికందును. తరువాత ఆమెను బావి వైపుకు తీసుకెళ్లాడు. అక్కడ నీళ్లు తాగించి తన దగ్గర వున్న చిన్న మూటను విప్పి అందులో నుంచి చిన్న బెల్లం ముక్కను తీసి ఆమె నోట్లో వేసాడు. ఆమెను బండిలో పడుకోబెట్టి బండిని కదిలించసాగాడు.
దాదాపుగా రెండు ఫర్లాంగుల దూరం వేళ్ళాడేమో, ఆ దూరంలోనే రెండు శవాలు అతనికి కనబడ్డాయి. ఇంకా కొన్ని శవాలు ఎదురుగా. అతను తలెత్తి చుట్టు పక్కల చూసాడు. శవాలు గుట్టగా పడివున్నాయి. అతనికి తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి, ”మదన్‌ బండి నడపడం నీ వల్ల కాదు, గొర్రెలా నీ దష్టి నేల వైపే వుంటుంది. నేలవాలు చూపుతో ప్రపంచం సగమే కనబడుతుంది” అతనికి మొదటిసారి తన నేలవాలు చూపుల అలవాటుపై చెప్పలేని కోపం వచ్చింది. ఒకవేళ తాను ముందే ఈ దశ్యాలను చూసి వుంటే అప్పుడే వెనక్కి వెళ్లిపోయేవాణ్ణి. కానీ, ఎక్కడికని వెళ్తాను? ఎవరు తనను రాత్రి తమ ఇంట్లో ఉండనిచ్చేవారు? హంస్‌ రాజ్‌ నాతో ఈ మాట చెప్పే దుకాణం ఎత్తేశాడు. ‘కాఫిలా’ (సంచారజాతుల గుంపు) వెళ్ళిపోయింది. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. జనాలు భయపడుతూ ఉండిపోయేవారు. ఇంటి తలుపులు మూసివేసుకొని ఉండేవారు. వీధుల్లో మొత్తంగా ఒక్కడు కూడా కనబడక పోయేవాడు. ఈ రోజు ‘చుంగీ’ (దారి శిస్తు వసూలు చేసే కేంద్రం) లో రాంలాల్‌ కూడా లేడు. చుంగీ మూసివేసి వుంది. అతనే ఉంటే తన కోసం రాత్రి ఉండటానికి ఏదో ఏర్పాటు చేసి వుండేవాడు.
నాలుగు వైపులా శవాలను చూసిన ఒంటె భయపడిపోయింది. మదన్‌ కూడా బెదిరిపోయాడు.
”నీళ్లు” సన్నగా గొంతు వినబడింది. దారి అంచున ఒక శవం లేచే ప్రయత్నం చేస్తుంది.
మదన్‌ దగ్గరికెళ్లి చూసాడు
”నీళ్లు… మేము ‘మర్దాని’ జాతికి చెందిన వాళ్ళం. బాబా నానక్‌ నిన్ను కాపాడుగాక” సన్నగా గొణిగాడు. అతని తలపై గాయం వుంది. రక్తం కారిన ఆనవాళ్లు తడిగా, స్పష్టంగా వున్నాయి. కాస్త లేచి మళ్ళీ కింద పడిపోయాడు.
రోడ్డు మీదంతా ఇంటి సరుకులు చెల్లా చెదురుగా పడివున్నాయి. వెడల్పాటి మట్టి పళ్లెం విరిగి ముక్కలై పడివుంది. విరిగి పడిపోయిన ఒక కూజా వుంది. విరిగిన చిన్న రాట్నం, సొట్టబోయిన కొన్ని రాతెండి గిన్నెలు పడివున్నాయి. ఇత్తడివి కానీ, కంచువి గాని ఏ ఒక్క పాత్ర, వస్తువు అక్కడ లేదు. మధ్య ఒక చిన్న సిల్వర్‌ గిన్నెను సరిచేసాడు. సరిచేసి నీళ్ల కోసం దగ్గర్లోవున్న చెరువు వైపు వెళ్ళాడు.
కొన్ని శవాలు సగం మునిగి చెరువులో పడివున్నాయి. కొన్ని పూర్తిగా మునిగివున్నాయి. మదన్‌ వాటిని లెక్కబెట్టాడు. మొత్తం ముప్పై శవాలు లెక్కలో తేలాయి. నీళ్లు రక్తంతో ఎర్రగా వున్నాయి. శుభ్రమైన నీళ్ల జాడ అతనికి కానరాలేదు. చివరకు ఒక చోట ఆగి అతను వంగి గిన్నె నిండా నీళ్లు నింపుకున్నాడు. నీళ్లతో నిండిన గిన్నెను చూసాడు. అందులో అంతా రక్తమే వుంది. అతనేమాలోచించాడో తెలియదు, వేగంగా ముందుకు అడుగులు వేసాడు.
”తీసుకో అన్నా, నీ అదష్టంలో జీవితముంటే ఎక్కడో ఓ చోటికి క్షేమంగా చేరకపోవు, ఈ నీళ్లలో నీలాంటి వాళ్ళ రక్తం కలిసివుంది” మదన్‌ అతని తలను తన తలపాగాతో గట్టిగా కట్టాడు. అతను చివరి ముడి వేయకముందే అతని చేతుల్లో ఒరిగిపోయాడు. మదన్‌ శరీరంలో సన్నని వణుకు మొదలైంది. అతను అక్కణ్ణుంచి కదిలాడు.
”నీళ్లు…”, అతను వెనక్కి తిరిగి చూసాడు. దారి అంచున మరో శవం కదులుతూ కనబడింది. మదన్‌ రోడ్డు మీద ఉంచిన నీళ్ల గిన్నెను తీసుకున్నాడు. కొద్దిగా నీళ్లు గిన్నెలో వున్నాయి. ఆ వ్యక్తి అలా వెల్లకిలా పడివున్నాడు. అతని గాయాల నుండి రక్తం స్రవించి నేలమీద పడి గడ్డకట్టి వుంది. మదన్‌ కూర్చొని తన మోకాళ్ళ మీద ఆసరా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎన్ని నీళ్లు తాగాడో అవన్నీ నోటి పక్కనుండి కారిపోయాయి. అతను గాయాలకు కట్టు కట్టమని సైగ చేసాడు.
”ఇప్పుడు నన్ను ఆ నల్లతుమ్మ చెట్టుకు ఆనించి కూర్చోబెట్టు” అన్నాడు. మిలట్రీ వాళ్ళు నన్ను బతికుండగానే బొంద పెడతారేమో?”
మదన్‌ త్వరత్వరగా తాను చేయాల్సింది చేసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అస్తమించే సమయం. అతను పగటి వెల్తురు ఉండగానే ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కూడా అతని మనసులో కాస్త భయం గూడు కట్టుకొని వుంది.
అతను బండి నడిపించాడు. పదిహేను, ఇరవై అడుగులు ముందుకు వెళ్ళాడో లేదో బండి పయ్య ఒక శవం కాలు మీద నుండి దాటిపోయింది. మదన్‌కు కోపం వచ్చింది. వెంటనే లాఠీ తీసుకొని ఒంటెకొకటి గట్టిగా ఇచ్చుకున్నాడు. ఒంటె కంగారుగా పరుగు అందుకుంది. బండి మూడు, నాలుగు శవాల మీద నుండి వెళ్ళింది. మదన్‌ బండి దిగి ఒంటె ముక్కుతాడు పట్టుకొని శవాలను జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళసాగాడు.
పసికందు ఏడవడం మొదలెట్టింది. మదన్‌కు తానేం తప్పు చేశాడో తెలిసొచ్చింది. ‘నాకు ఈ పసికందు కోసం నీళ్లను వెంట తీసుకొని వచ్చేదుండే’ అని అనుకుంటూ పసిపిల్లను ఒళ్ళోకి ఎత్తుకున్నాడు. అంతలోనే ఏడుపు మానేసింది. కానీ, ఇంకా ఎవరో పిల్లాడు ఏడుస్తున్న శబ్దం రాసాగింది. ఒక చెట్టు కింద ఇద్దరు, ముగ్గురు పిల్లలు కూర్చొని వున్నారు. అతను వారి దగ్గరికెళ్ళేసరికి ఇంకా గట్టిగా ఏడవటం మొదలెట్టారు. అందులో ఒక పెద్ద పిల్లాడు ఒక శవాన్ని అల్లుకొని ఏడవసాగాడు.
”భయపడకండి, నేను కొట్టేవాణ్ణి కాను” అతను చెప్పాడు.
”ఏమిటి ఇతను మీ నాన్ననా?” మదన్‌ ఆ పెద్ద పిల్లాణ్ణి అడిగాడు.
పిల్లాడు ”అవును” అని తలూపాడు. అందరు పిల్లలు మౌనంగా ఉండిపోయారు. ఇంకా వాళ్లకేం చెప్పాలి, ఎలా సముదాయించాలి అన్న ఆలోచనలో ఉండిపోయాడు. మరికొందరు పిల్లలు రోడ్డుకావల ఒక తుమ్మ చెట్టు కింద కూచొని వున్నారు. కొందరు ఏడుస్తున్నారు. ఒక పిల్లాడు తన తల్లి గుండెల మీద తల ఆనించి వెక్కి వెక్కి రోదిస్తున్నాడు. అక్కడక్కడా గాయాలతో పడివున్న కొందరు నీళ్లడగసాగారు. వాళ్లకేవిధంగా సహాయపడగలడు. ఇందరిని తాను ఎలా సంభాళించగలడు? నీళ్లు ఎక్కణ్ణుంచి తెచ్చి తాగించాలి. తాను ఒక్కడే. ఇప్పుడే వెనకాల ఒక శవాల గుంపును వదిలి వచ్చాడు. ఇంకా ఇప్పుడు అతని ముందర శవాలు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. వాటి నుండి దారి చేసుకుంటూ సాయంకాలానికి ముందే ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. తెలియదు ఎంత దూరం ఈ శవాలు పడివున్నాయో? బతికి వున్న వారి కాఫిలాగుంపు ఇరవై మైళ్ళ వరకు పొడవుంటుందని విన్నాడు .
కాసేపు మౌనంగా వుండిపోయాడు. తిరిగి ఆ పిల్ల పసికందును అక్కడున్న పిల్లల మధ్య వదిలేసి తన మనసు మారక ముందే వెంటనే అక్కణ్ణుంచి కదిలిపోయాడు.
అతను ఒంటె కళ్లెం చేతిలో పట్టుకొని శవాలను తప్పించుకుంటూ బండిని నడపసాగాడు. ఐనప్పటికీ మధ్య మధ్యలో ఏదో ఒక శవం కాలి మీద నుండి, పాదం మీద నుండి బండి చక్రాలు దాటిపోయేవి. కానీ, అతనికి ఒంటె మీద కోపం రావడం లేదు. పాపం దాని తప్పేంవుంది. దానికి తన శక్తినంతా కూడగట్టుకోవాల్సి వస్తున్నది. ఒకదాని తరువాత మరో కష్టం బండి చక్రానికి ఎదురు పడేది.
సగం రోడ్డు దాటేసరికి అతనికి అలసట వచ్చేసింది. నీరసంగా వుండసాగింది.
ఏ చేతితో కళ్లెం పట్టుకొని గట్టిగా లాగి వుంచేవాడో ఆ భుజం నొప్పిగా వుండింది. ఒంటెను పట్టి వుంచిన కళ్లెం భారం భరించలేకపోతున్నాడు. ఇప్పటి దాకా రెండున్నర మైళ్ళు ప్రయాణించాడు. ఇంకా ఒక మైలు కచ్చా రోడ్డును దాటాలి. అది పక్కా రోడ్డు కన్నా కాస్త నయమే. చిన్న కల్వర్టు దాకా వచ్చి చూశాడు. నీళ్ళు కల్వర్టు పై నుండి పారుతున్నాయి. కాలువ శవాలతో నిండి వుంది. అతను బండిని ఆపేసాడు.
ఒంటె కాస్త విశ్రమించగానే మదన్‌ బండెక్కి కళ్లెం వదులు చేసి కూర్చున్నాడు. ఎప్పుడైనా దారికడ్డంగా శవం కనబడేసరికి కళ్లెం ఒక వైపుకు వదిలి వేసేవాడు. అప్పుడప్పుడు బండి వాటిపై నుండే వెళ్లిపోయేది .
నెమ్మదిగా చీకటి పడసాగింది. ఇప్పుడు శవాలు కానరావడం లేదు. ఎప్పుడైతే బండి ఎగిరిపడితే అప్పుడు బండి శవాన్ని దాటిపోతుందన్న భావన కలిగేది. ఒంటె నడక చప్పుడు తోటే తెలిసిపోయేది, రోడ్డు రక్తంతో తడిసివుందా, పొడిగా ఉందా? అన్నది .
ఇప్పుడు అతనిలో భయం పూర్తిగా తగ్గిపోయింది. నెమ్మదిగా పాట అందుకున్నాడు. అలాంటి పాటలు అతను సాధారణంగా రాత్రి పూట పాడుకుంటాడు.
”సఖుడా, నీవు చాలా పెద్ద తప్పు చేసావు
నీ ప్రియురాలిని చంపేస్తున్నావు …”
కానీ, అక్కడ ఎలాంటి ద్వేషాలు కనబడలేదు. ఇంకా ఎలాంటి రక్తపుటేరులు ప్రవహిస్తూ కనబడలేదు. అందుకే అతనికి తన పాట రసహీనంగా కనబడడంతో పాటను ఆపేసాడు .
పక్కా రోడ్డు దాటి కచ్చా రోడ్డు పైకి వచ్చేసరికి ఒంటె దానంతట అదే ఆగిపోయింది. కాసేపాగి తిరిగి తనంతట తానె ముందుకు సాగింది.
అతను తన ఇంటి దర్వాజ ముందుకు చేరేసరికి ఇరుగుపొరుగు అంతా చేరి, ”వచ్చేసాడు, వచ్చేసాడు” అని అరవడం మొదలెట్టారు.
అతని ఇంట్లోంచి ఏడుపు శబ్దం ఇంకా గట్టిగా మారి వినబడసాగింది. అతను దగ్గరికి వెళ్లేసరికి పురుషులంతా ఒక్కసారిగా మౌనం వహించారు. మదన్‌ బండి నుండి ఒంటెను విప్పేసి వాకిట్లోని ఒక గుంజకు కట్టేశాడు. ఒక వైపు నుండి ఆడవాళ్లు ఏవేవో మాటలు చెప్పుకుంటూ ఏడవసాగారు. అందులో నుండి మదన్‌ తల్లి లేచి నిలబడి అతన్ని అల్లుకొని గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది.
”అయ్యో బిడ్డా, మనం నాశనమైపోయాం”
”ఏమైందమ్మా?” అంటూ తన తల్లి భుజాలను వదిలించుకుంటూ అడిగాడు.
”బిల్లు పై కప్పు మీద నుండి జారిపడి వెళ్లిపోయాడురా … !”
మదన్‌ నిశ్చేష్టుడై నేల మీద కూలబడిపోయాడు. కాసేపు అందరూ మౌనంగా వుండిపోయారు. అందులో నుండి ఒకరు ”లే, మదన్‌ లాల్‌, అంతిమ సంస్కారాలు చేయాలిగా, మేమంతా నీ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాం!” అన్నాడు .
”కాసేపు వుండండి. ఈ పని కూడా పూర్తి చేసుకుందాం” మదన్‌ అన్నాడు .
”కాసేపు విశ్రమిస్తాను, బాగా అలసిపోయాను, బాగా ఆకలి వేస్తుంది…”
తల్లి అతని భుజాలను పట్టుకుంది. ”హంతకుడా, నువ్వు దీన్ని పని అంటావా? నీకు ఆకలి వేస్తుందా? అరే, ఎవర్రా అక్కడా, లాంతరు పట్టుకు రండి?” అంటూ రెండు చేతులతో గుండెలు బాదుకోసాగింది!
ఒక వ్యక్తి లాంతరు పట్టుకొచ్చాడు.
”అరే అయ్యల్లారా, మేము సర్వనాశనం అయిపోయాం. నేను, చిన్నవాడు చనిపోయాడని ఏడుస్తూ వున్నాను. పెద్దవాడిక్కూడా ఏమైందో అర్ధం కావడం లేదు. ఏదో ‘గాలి’ సోకింది, ‘నీడ’ పట్టుకుంది చూడండి, కళ్ళు ఎలా పెద్దవిగా చేసుకొని మిటకరిస్తూ చూస్తున్నాడో”
ఆడోళ్ళందరూ లేచి నిలబడి నలువైపులకు జరిగిపోయారు .
ఎవరో బయటి వాళ్ళ ‘నీడ’ పడింది”
”ఎవరో ఒకరు వెళ్లి మంత్రగాన్ని పిలుచుకు రండి”
బిల్లు శవం అలా దిక్కులేకుండా ఒంటరిగా బట్టతో కప్పబడి పడివుంది.
మదన్‌ అతని వైపే చూడసాగాడు. చూస్తూనే వుండిపోయాడు. అతను ”ఒక శవం ఇతర శవాలతో కలిసి కాసింత దూరంలో పడి వుంది, అంతే,” అన్న భ్రమలో వుండిపోయాడా?!
మూల రచయిత (పంజాబీ కథ) : గురుదేవ్‌ సింగ్‌ రూపాణా
హిందీ అనువాదం (ఛాయ) : డా. గురుచరణ్‌ సింగ్‌
తెలుగు అనువాదం : డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

Spread the love