– తాపీమేస్త్రీల ఇండ్లల్లో వెలుగులు
– ఎస్‌ఐ ఫలితాల్లో 46, 56వ ర్యాంకులు
– తల్లిదండ్రుల కల సాకారం చేసిన సతీష్, తేజస్విని
నవతెలంగాణ-వేములపల్లి
పేదరికం, పల్లెటూరు, కుటుంబ నేపథ్యం.. ఇవేమీ ప్రతిభకు అడ్డుపడలేదు.. పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చని నల్లగొండ జిల్లా వేములపల్లి మండలానికి చెందిన సతీష్, తేజస్విని నిరూపించారు. తాజాగా వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో మెరిసిన పేదింటి ఆణిముత్యాలు ఇద్దరు తాపీ మేస్త్రీల ఇండ్లల్లో వెలుగులు నింపాయి. మండలంలోని సల్కనూర్ గ్రామం దళిత కుటుంబానికి చెందిన అంకెపాక తేజస్విని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివింది. సూర్యాపేటలో ఇంటర్, మిర్యాలగూడలో డిగ్రీ పూర్తి చేసింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తూ.. ఎస్‌ఐ కావాలన్న లక్ష్యంతో పట్టుదలతో చదివి 56వ ర్యాంకు విజయం సాధించింది. అదేవిధంగా మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన కన్నెబోయిన సతీష్ స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ చదువులు ముగించుకొని రావులపెంట ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మిర్యాలగూడ జేఎంరెడ్డిలో ఇంటర్ పూర్తి చేశాడు. హైదరాబాద్ బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. ఓపెన్ కేటగిరిలో 46వ ర్యాంకుతో సివిల్ ఎస్‌ఐగా విజయం సాధించాడు. ఇరువురివి నిరుపేద కుటుంబాలు. తేజస్విని తండ్రి అంకె పాకబాబు తాపీ మేస్త్రిగా, తల్లి రాణి వీవోఏగా పనిచేస్తున్నారు. సతీష్ తండ్రి కన్నెబోయిన రమేశ్ స్థానికంగా తాపీ పని, తల్లి కూలి పనికి వెళ్తారు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని, వారి కలను సహకారం చేయాలని పట్టుదలతో విజయం సాధించామని అభ్యర్థులు చెబుతున్నారు. వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.