జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలి

జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలి– అధికారులకు మంత్రి కోమటిరెడ్డి దిశానిర్దేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రానికి రహదారులు జీవనాడులని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వీటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మూలంగా గత మూడేండ్లలో కేంద్రం నుంచి అతి తక్కువగా నిధులు మంజూరయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి అలాంటి అలసత్వానికి తావులేకుండా కషి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు మంత్రి మార్గనిర్దేశం చేశారు. శుక్రవారం హైటెక్‌ సిటీలోని ‘న్యాక్‌’ కార్యాలయంలో జాతీయ రహదారులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రహదారులు, ఎన్‌హెచ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రానికి మణిహారం గా మారనున్న ఆర్‌ఆర్‌ఆర్‌పై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాలని సూచించారు. జులై మొదటి వారంలో రాష్ట్రానికి ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారుల బందం రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మంజూరీ అయి పనులు నడుస్తున్నవి, పలు అనుమతుల కోసం ఆగిపోయినవి, అప్‌గ్రేడ్‌ కోసం విన్నవించిన జాతీయ రహదారులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో అధికారులు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనులను ముందుకు తీసుకుపోదామని సూచించారు. అనంతరం ఎన్‌.హెచ్‌-65 (హైదరాబాద్‌-విజయవాడ) జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఫోర్‌ క్లోజ్‌ చేసి.. వచ్చే నెలలో కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. సెప్టెంబర్‌లో పనులు పున:ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందులో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ప్రతీది నిత్యం పర్యవేక్షించాలని జాతీయ రహదారుల సంస్థ ఆర్‌.ఓ. రాజాక్‌ను ఆదేశించారు. అంతేగాక, ఎన్‌.హెచ్‌-645ను గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా నిర్మించేందుకు డీపీఆర్‌ కూడా సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి, ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో మరింత చురుగ్గా పనులు చేయాలని చెప్పారు. ఒక్క ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు ప్రారంభమైతే రాష్ట్రానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు, డిస్నీల్యాండ్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పడి రాష్ట్రం ఎంతో అభివద్ధిని సాధిస్తుందని మంత్రి అధికారులకు చెప్పారు. మన్నెగూడ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు. అయితే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశానుసారం 930 చెట్లను రిలోకేట్‌ చేయాల్సి ఉండటంతో పాటు పలు అనుమతుల వల్ల ఆలస్యం అవుతుందని ఎన్‌హెచ్‌ అధికారులు చెప్పగా, చెట్లు లేకుండా రోడ్డు నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు ఎందుకు నిర్మించడం లేదని మంత్రి తిరిగి ప్రశ్నించారు.
ఇక ఆర్మూర్‌-మంచిర్యాల జాతీయ రహదారి కోసం 1573 ఎకరాల భూమి కావాల్సి ఉండగా ఇప్పటికే 1309 ఎకరాలు సేకరించామని చెప్పిన అధికారులు, మిగతా పనులను ఈ నెలలో పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. వీటితోపాటు ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ ఫై ఓవర్‌ పనులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశాల మేరకు టెండర్లు ఫోర్‌ క్లోజ్‌ చేసి కొత్త టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా సంస్థలను ఖరారు చేసి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎల్బీనగర్‌-మల్కాపూర్‌ రోడ్డులో మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద నిర్మించాల్సిన బ్రిడ్జి సమస్యలపై మంత్రికి అధికారులు వివరించగా, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, జాయింట్‌ సెక్రెటరీ హరీశ్‌తో పాటు జాతీయ రహదారుల సంస్థ ఆర్‌.ఓ. రజాక్‌, రీజినల్‌ ఆఫీసర్‌ కుష్వాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love