– బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా
నవతెలంగాణ- హుజూర్ నగర్
సకల జనులు ఏకమై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. కుటుంబ పాలనలో బంధి అయిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. మత ప్రాతిపదికన నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం దారుణమని తెలి పారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ డబ్బులు విత్ డ్రా చేసుకునే మిషన్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30 వేలకోట్ల నిధులతో అంచనా వేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రూ.1.30 లక్షల కోట్లకు పెంచి కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. దళిత బంధులో 30శాతం ఎమ్మెల్యేలు లంచాలుగా తీసుకున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు యువతకు ఉపాధి, రైతులకు భరోసా బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు.
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సిండికేట్ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు . కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజు చంద్రశేఖర్, కర్నాటక ఎమ్మెల్సీ రవికుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు పోరెడ్డి కిషోర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బొబ్బ భాగ్యరెడ్డి, కోదాడ జనసేన అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి, కిషోర్ రేలంగి తదితరులు పాల్గొన్నారు.